Baba Raghav Das Medical College
-
గోరఖ్‌పూర్ : 40 ఏళ్లుగా చనిపోతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ : బాబా రాఘవ్‌దాస్ ఆసుపత్రి ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. మెదడు వాపు వ్యాధితో చిన్నారులు ఇక్కడ 40 ఏళ్ల నుంచి మృతి చెందుతూనే ఉన్నారు. ఇన్నేళ్ల నుంచి మాటమాత్రంగా కూడా స్పందించిన వ్యక్తులు, పార్టీలు నేడు అతిగా ప్రతిస్పందిస్తున్నాయని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. చిన్నారుల మృతి చెందడడం బాధాకరం.. భవిష్యత్‌లో ఇలా జరక్కుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వాన్ని విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది.. గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో బాధపడే చిన్నారులు.. ఆక్సిజన్ కొరతతో 40 ఏళ్లుగా చిపోతూనే ఉన్నారు.. ఇప్పుడే కొందరు కొత్తగా అరుస్తున్నారు అని యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. 40 ఏళ్లు తప్పులను సరిదిద్దడానికి మాకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లో మేం అధికారంలోకి వచ్చాక మెదడువాపు వ్యాధి రాకుండా గత మే నెల్లో 92 లక్షల మంది చిన్నారులకు టీకాలు వేయించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి అధికంగా సోకే 20 జిల్లాలో ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పతనముతోందన్న విమర్శలకు యోగి ఆదిత్యనాథ్ సమాధానమిస్తూ.. మోదీ నేతృత్వంలో దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలించిదని యూపీ సీఎం ఆదిత్యనాథ్ చెప్పారు. -
గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం
-
గోరఖ్‌పూర్‌లో మరణమృదంగం
ఒక్క నెలలోనే 296 మంది చిన్నారుల దుర్మరణం గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) వైద్య కళాశాలలో ఒక్క ఆగస్టు నెలలోనే దాదాపు 296 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. వీరిలో 213 నవజాత శిశువులు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందగా, 83 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో చనిపోయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆస్పత్రిలోని మెదడువాపు, చిన్నారుల వార్డుల్లో దాదాపు 1,256 మంది మృతి చెందినట్లు సింగ్ పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 17 మంది చిన్నారులు మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో 37 మంది పిల్లలు (వీరిలో 11 మంది మెదడువాపు వ్యాధితో) ఆస్పత్రిలో మృత్యువాత పడ్డారని సింగ్ వెల్లడించారు. నెలలు నిండకుండానే పుట్టడం, తక్కువ బరువు ఉండడం, కామెర్లు, న్యుమోనియా, ఇన్ఫెక్షన్, మెదడువాపు తదితర కారణాలతో, విషమ పరిస్థితుల్లోనే చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారని సింగ్ తెలిపారు. చిన్నారులను కొంచెం ముందుగా ఆస్పత్రికి తీసుకురాగలిగితే చాలామంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు చిన్నారుల మరణాలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్డీ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రాతో పాటు ఆయన భార్యను ఉత్తరప్రదేశ్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అరెస్టు చేసింది. -
గోరఖ్‌పూర్: 105కి చేరిన పిల్లల మరణాలు
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పిల్లల మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో మరో 9 మంది చిన్నారులు చనిపోవటంతో ఆ సంఖ్య 105కి చేరుకుంది. ఈ విషయాన్ని డాక్టర్ పీకే సింగ్ ధృవీకరించారు. నియోనాటల్ వార్డులో ఐదుగురు, ఏన్కెఫలైటిస్ వార్డులో ఇద్దరు, సాధారణ వార్డులో ఇద్దరు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశులు ఉన్నారని, అత్యవసర స్థితిలోనే వారిని తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారని సింగ్ తెలిపారు. ఆగస్టు 10 నుంచి ఆగష్టు 11వ వరకు ఆ 48 గంటల్లో 30 మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయారంటూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఉంది. ఇదిలా ఉండగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం యూపీకి వెళ్లనున్నారు. బీఆర్డీ ఆస్పత్రిని కూడా ఆయన సందర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోపక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గోరఖ్‌పూర్ లో స్వచ్ఛ్భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన కూడా ఆస్పత్రిని సందర్శించే పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని సీఎంవో అధికారులు చెబుతున్నారు. -
గోరఖ్‌పూర్‌లో పరిస్థితి ఘోరం.. చేజారింది
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ (బీఆర్డీ) ఆస్పత్రిలో చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రభుత్వం కంటి తుడుపు చర్యలే కనిపిస్తున్నాయి. ఆస్పత్రి చీఫ్ ను తొలగించటంతోపాటు ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీదారుపై విచారణకు ఆదేశించింది. మరోవైపు, కేవలం కొందరు మాత్రమే ఆక్సిజన్ అందక చనిపోయారని స్వయంగా సీఎం యోగి ఆదిత్యానాథే ప్రకటించారు. మృతుల్లో 30మంది పిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయినట్లు హోంశాఖ ప్రకటించగా, 21 మందేనని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆదివారం ఉదయం మరో చిన్నారి చనిపోవటంతో ఆ సంఖ్య 65కి చేరుకుంది. మరికొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. కళ్ల ముందే కన్నపేగు కన్నుమూస్తుంటే నిస్సహాయతతో చూస్తున్న తల్లిదండ్రుల ఆవేదనపై అంతర్జాతీయ మీడియా కూడా స్పందించింది. గోరఖ్‌పూర్‌లో చిన్నారులు ఒకరి తర్వాత ఒకరి చేజారి పోతున్నారంటూ కథనం ప్రచురించింది. ఆగస్టు 7 నుంచి అక్కడ జరుగుతున్న ఘోర కలిని కూలంకషంగా వివరించింది. 'ఇది ముమ్మాటికీ ఆస్పత్రి వర్గాల తప్పే. వారి మూలంగా చిన్నారులు చనిపోతున్నారు. రాత్రి నా కొడుకు బాగానే ఉన్నాడు. తర్వాతే ఏదో జరిగింది, విగతజీవిగా మారిపోయాడు'అని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది విషాదం కాదు.. ముమ్మాటికీ మారణకాండే. ఆక్సిజన్ సరఫరాతో అంత మంది కన్నుమూయటం దారుణం' అని బాలలహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ట్వీట్ చేశారు. మరోపక్క హుటాహుటినా సిలిండర్లు తెప్పించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నించినప్పటికీ శనివారం మరో ఇద్దరు చిన్నారులు చనిపోవటంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. నేడు సీఎం ఆదిత్యానాథ్‌తోపాటు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ నడ్డా పరిస్థితిని సమీక్షించేందుకు ఆస్పత్రికి వెళ్లనున్నారు. -
మందులు తెచ్చేలోపే.. ప్రాణాలు విడిచాడు!
గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృత్యుఘోషతో పరిస్థితి భయానకంగా ఉంది. ఇప్పటికే 63 మంది పిల్లలు చనిపోగా, తీవ్ర విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన సీఎం ఆదిత్యనాథ్ మంత్రుల బృందాన్ని రంగంలోకి దించారు. ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. బాధిత తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. కళ్లముందే కన్నబిడ్డలు పిట్టల్లా రాలిపోయిన వేదన వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఎవరినీ కదిలించినా గుండెలు పిండేసేరీతిలో తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. 'పది రోజుల వయసున్న మా అబ్బాయికి నియో నేటల్ వార్డులో చికిత్స అందించారు. అప్పటిదాకా బాగానే ఉన్నాడు. రక్తం, మందులు కావాలని వైద్యులు కోరారు. వాటి కోసం వెళ్లి వచ్చేలోపే ప్రాణాలు వదిలాడు. ఆ అరగంటలో ఏం జరిగిందో తెలియదు' అంటూ దీపక్ చంద్ అనే వ్యక్తి విలపిస్తూ చెప్పాడు. చనిపోయిన పిల్లల్ని చూడనివ్వకుండా వైద్యులు అడ్డుకుంటున్నారని, నిలదీస్తే సిబ్బంది చెయ్యి చేసుకున్నారని మృత్యుంజయ్ అనే మరో వ్యక్తి ఆరోపించాడు. కావాలంటే సీసీ పుటేజీలను పరిశీలించాలని కోరుతున్నాడు. 'ఉదయం నుంచి వార్తల్లో ఆక్సిజన్ అందకే పిల్లలు చనిపోతున్నారని చూస్తున్నాం. కానీ, అందులో నా కూతురు కూడా ఉంటుందనుకోలేదు' అని చనిపోయిన ఏడేళ్ల జ్యోతి అనే చిన్నారి తల్లి సరోజా దేవి ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర జ్వరం, వాంతులు చేసుకోవటంతో మంగళవారం జ్యోతిని ఆస్పత్రిలో చేర్పించామని, హఠాత్తుగా పరిస్థితి విషమించిందని కూతురు శవాన్ని తమ చేతుల్లో పెట్టారని ఆమె గోళ్లుమంది. ఇక అమైరా అనే తల్లిది మరో వేదన. 'జలుబుతో బాధపడుతున్న నా కూతురు జీవచ్ఛవంలా పడి ఉంది. కాస్త వచ్చి చూడండయ్యా బతిమాలుకుంటున్నా వైద్యులు ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా భగవంతుణ్ణి ప్రార్థించాడంటూ సలహాలు ఇస్తున్నారు' అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇలా బీఆర్డీ ఆస్పత్రిలో ఏ తల్లిదండ్రులను కదిలించినా ఇలాంటి కన్నీటి వ్యధలు వినిపిస్తున్నాయి. చిన్నారుల శవాలను చేతులతో మోసుకొస్తున్న తల్లిదండ్రుల దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి.