మీడియాతో కఫీల్.. పక్కన పాత చిత్రం(ఇన్‌సెట్‌లో సీఎం యోగి ఆదిత్యానాథ్)
లక్నో: గోరఖ్‌పూర్ చిన్నారుల మృత్యుఘోష ఉదంతంలో డాక్టర్ కఫీల్ ఖాన్ ఊరట పొందారు. బుధవారం అలహాబాద్ బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. దీంతో శనివారం ఆయన్ని జైలు నుంచి విడుదల చేశారు. బయటకు వచ్చాక భావోద్వేగానికి గురైన ఆయన మీడియా ముందు రోదించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నేను మానసికంగా చాలా కుంగిపోయాను. నెలల తర్వాత నా కుటుంబాన్ని కలిశాను. నేనేం తప్పు చేశాను? అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? జైల్లో గంటల తరబడి మధన పడేవాడిని. ఓ వైద్యుడిగా.. ఓ భారతీయుడిగా... అంతకు మించి ఓ తండ్రిగా... నేను చేయాల్సింది చేశాను. పిల్లల కోసం ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించాను. కానీ, వారి చావుకు నేను కారణమంటూ నాపై నిందలేయటంతో ప్రాణం పోయినంత పనైయ్యింది...
... నా భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేతుల్లోనే ఉంది. జైల్లో ఉండగా నా విషయంలో ఆయన స్పందించలేదు. కనీసం ఇప్పుడైనా కనికరించి నాపై సస్పెన్షన్ ఎత్తేస్తే.. తిరిగి విధుల్లో చేరి సేవలు కొనసాగిస్తా. లేకుంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం నరకం అనుభవించాల్సిందే’ అని కఫీల్ తెలిపారు. పిల్లల మరణాలకు కారకులెవరన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయాన్ని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశానన్నారు. ‘నిధుల నిలిపివేతతో ఆక్సిజన్ సరఫరా కంపెనీకి బకాయిలు చెల్లించలేకపోయామని.. దీంతో సదరు కంపెనీ ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిపేసిందని, 14 సార్లు సదరు కంపెనీ లేఖలు రాసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో కఫీల్ ఖాన్ భార్య షబిస్తా ఖాన్
కాగా, ఆ లేఖను కఫీల్ జైల్లో ఉండగానే రాయగా.. దానిని కఫీల్ భార్య షబిస్తా మీడియాకు విడుదల చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కఫీల్‌పై ఆరోపణలు... గోరఖ్‌పూర్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గతేడాది ఆగస్ట్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ సమయంలో సొంత డబ్బులతో కఫీల్‌ఖాన్ సిలిండర్లు తెప్పించి చికిత్స అందించటంతో ఆయన్ని హీరోగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు సృష్టించారని, అసలు పిల్లల మరణానికి కారకుల్లో కఫీల్ కూడా ఒకరని ఆస్పత్రి వర్గాలు దర్యాప్తు బృందానికి నివేదించాయి. గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన కఫీల్ భార్య షబిస్తా ఖాన్ నడుపుతుందంటూ ఆరోపించాయి. ఈ పరిణామాలతో కఫీల్ ఖాన్‌పై వైద్య విభాగం వేటు వేయగా.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం కఫీల్ కుటుంబసభ్యులు ఆరుసార్లు ప్రయత్నించారు. చివరకు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినందున కస్టడీలో కఫీల్ ఉండాల్సిన అవసరం లేదని కోర్టు ఆయన్ని విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment