Baba Raghav Das Medical College hospital
-
నా తప్పేంటో తెలీట్లేదు.. యోగి చేతుల్లో నా జీవితం
లక్నో: గోరఖ్‌పూర్ చిన్నారుల మృత్యుఘోష ఉదంతంలో డాక్టర్ కఫీల్ ఖాన్ ఊరట పొందారు. బుధవారం అలహాబాద్ బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. దీంతో శనివారం ఆయన్ని జైలు నుంచి విడుదల చేశారు. బయటకు వచ్చాక భావోద్వేగానికి గురైన ఆయన మీడియా ముందు రోదించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నేను మానసికంగా చాలా కుంగిపోయాను. నెలల తర్వాత నా కుటుంబాన్ని కలిశాను. నేనేం తప్పు చేశాను? అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? జైల్లో గంటల తరబడి మధన పడేవాడిని. ఓ వైద్యుడిగా.. ఓ భారతీయుడిగా... అంతకు మించి ఓ తండ్రిగా... నేను చేయాల్సింది చేశాను. పిల్లల కోసం ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించాను. కానీ, వారి చావుకు నేను కారణమంటూ నాపై నిందలేయటంతో ప్రాణం పోయినంత పనైయ్యింది... ... నా భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేతుల్లోనే ఉంది. జైల్లో ఉండగా నా విషయంలో ఆయన స్పందించలేదు. కనీసం ఇప్పుడైనా కనికరించి నాపై సస్పెన్షన్ ఎత్తేస్తే.. తిరిగి విధుల్లో చేరి సేవలు కొనసాగిస్తా. లేకుంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం నరకం అనుభవించాల్సిందే’ అని కఫీల్ తెలిపారు. పిల్లల మరణాలకు కారకులెవరన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయాన్ని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశానన్నారు. ‘నిధుల నిలిపివేతతో ఆక్సిజన్ సరఫరా కంపెనీకి బకాయిలు చెల్లించలేకపోయామని.. దీంతో సదరు కంపెనీ ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిపేసిందని, 14 సార్లు సదరు కంపెనీ లేఖలు రాసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కఫీల్ ఖాన్ భార్య షబిస్తా ఖాన్ కాగా, ఆ లేఖను కఫీల్ జైల్లో ఉండగానే రాయగా.. దానిని కఫీల్ భార్య షబిస్తా మీడియాకు విడుదల చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కఫీల్‌పై ఆరోపణలు... గోరఖ్‌పూర్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గతేడాది ఆగస్ట్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ సమయంలో సొంత డబ్బులతో కఫీల్‌ఖాన్ సిలిండర్లు తెప్పించి చికిత్స అందించటంతో ఆయన్ని హీరోగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు సృష్టించారని, అసలు పిల్లల మరణానికి కారకుల్లో కఫీల్ కూడా ఒకరని ఆస్పత్రి వర్గాలు దర్యాప్తు బృందానికి నివేదించాయి. గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన కఫీల్ భార్య షబిస్తా ఖాన్ నడుపుతుందంటూ ఆరోపించాయి. ఈ పరిణామాలతో కఫీల్ ఖాన్‌పై వైద్య విభాగం వేటు వేయగా.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం కఫీల్ కుటుంబసభ్యులు ఆరుసార్లు ప్రయత్నించారు. చివరకు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినందున కస్టడీలో కఫీల్ ఉండాల్సిన అవసరం లేదని కోర్టు ఆయన్ని విడుదల చేసింది. -
యోగి సర్కారుపై మండిపడ్డ అఖిలేశ్!
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాకాలోని బీఆర్డీ ప్రభుత్వ దవాఖానాలో పెద్దసంఖ్యలో చిన్నారులు చనిపోయవడంపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యోగి సర్కారు వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమని మండిపడ్డారు. 'బీయార్డీ మెడికల్ కాలేజీలో మరణాలపై యోగి సర్కారు నిజాలను వెల్లడించడం లేదు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతినిధుల బృందం ఆస్పత్రిని సందర్శించి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని వెలికితీసి.. ప్రభుత్వానికి తెలియజేయనుంది' అని చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వం తన విధులను తాను నిర్వర్తించకుండా ఎస్పీ కార్యకర్తలను వెంటాడే పనిలో నిమగ్నమైంది. బరేలీ, బాలియాలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం' అని అఖిలేశ్ విమర్శించారు. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కు పెరిగింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆక్సీజన్, వైద్యం అందక చిన్నారులు చనిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గోరఖ్‌పూర్ ఘోరకలి: 63కు పెరిగిన మరణాలు
- బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృత్యువు విలయతాండవం - శుక్రవారానికి 60 మంది.. శనివారం మరో ముగ్గురి మృతి - మరణాలను ధృవీకరింస్తూ వైద్యుల ప్రకటన - యూపీ సర్కారుపై తీవ్ర విమర్శలు.. మంత్రులతో సీఎం యోగి అత్యవసరభేటీ గోరఖ్‌పూర్: చిన్నారుల వరుస మరణాలతో ఉత్తరప్రదేశ్ వణికిపోతోంది. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కు పెరిగింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. కానీ వైద్యులు మాత్రం మరణాలకు వేర్వేరు కారణాలున్నాయని వాదిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం బీఆర్డీ ఆస్పత్రి అధికారులు విడుదల చేసిన ప్రకటనను బట్టి.. పిల్లల వార్డు, మెదడువాపు వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాల్లో కేవలం 11 కేసులపై మాత్రమే శాఖాపరమైన విచారణకు ఆదేశించామని అధికారులు చెప్పారు. మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారు జాము నుంచి ఉదయం 11 గంటల మధ్య మరో ముగ్గురు చిన్నారులు తుదిశ్వాస విడిచారు. చిన్నారుల మరణాల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్ నాథ్ సింగ్ సహా శాఖల ఉన్నతాధికారులు, బీఆర్డీ మెడికల్ కాలేజీ డీన్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చిన్నారులు చనిపోవడానికి కారణంగా భావిస్తోన్న ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం.. అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అసలేం జరిగింది? యూపీ సీఎం ఆదిత్యనాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ. గోరఖ్‌పూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పేదలంతా వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే కొద్ది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో సుమారు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో సదరు ప్రైవేటు సంస్థ.. ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసింది. దీంతో చిన్నారులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది. శనివారం ఉదయం 11 గంటల వరకు చనిపోయినవారి సంఖ్య 63కు పెరిగింది.