యోగి సర్కారుపై మండిపడ్డ అఖిలేశ్!
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాకాలోని బీఆర్డీ ప్రభుత్వ దవాఖానాలో పెద్దసంఖ్యలో చిన్నారులు చనిపోయవడంపై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. యోగి సర్కారు వైఫల్యానికి ఈ ఘటన నిదర్శనమని మండిపడ్డారు. 'బీయార్డీ మెడికల్ కాలేజీలో మరణాలపై యోగి సర్కారు నిజాలను వెల్లడించడం లేదు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతినిధుల బృందం ఆస్పత్రిని సందర్శించి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిని వెలికితీసి.. ప్రభుత్వానికి తెలియజేయనుంది' అని చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వం తన విధులను తాను నిర్వర్తించకుండా ఎస్పీ కార్యకర్తలను వెంటాడే పనిలో నిమగ్నమైంది. బరేలీ, బాలియాలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం' అని అఖిలేశ్ విమర్శించారు.
గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కు పెరిగింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆక్సీజన్, వైద్యం అందక చిన్నారులు చనిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.