doctor kafeel khan
-
సీఎం యోగిపై పోటీకి రెడీ.. టిక్కెట్ ఇవ్వండి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి తాను సిద్ధమని డాక్టర్ కఫీల్ ఖాన్ ప్రకటించారు. ‘గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్ ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాను' అని పీటీఐతో డాక్టర్ ఖాన్ చెప్పారు. (చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు) చర్చలు జరుగుతున్నాయి మీరు ఏదైనా పార్టీతో టచ్‌లో ఉన్నారా, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగినప్పుడు.. ‘అవును, సంప్రదింపులు జరుగుతున్నాయి, అన్నీ కుదిరితే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాన’ని సమాధానం ఇచ్చారు. గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో జరిగిన దుర్ఘటనలో తనను బలిపశువు చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. ఇప్పటికీ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్ పోలీసులు పదే పదే తమ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రెండు సస్పెన్షన్లు.. రెండుసార్లు జైలు గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనతో కఫీల్ ఖాన్ జీవితం తలక్రిందులైంది. ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డాక్టర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు జైలు పాలయ్యారు. రెండు పర్యాయాలు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల ఆధారంగా ‘ది గోరఖ్‌పూర్ హాస్పిటల్ ట్రాజెడీ- ఏ డాక్టర్స్ మెమోయిర్ ఆఫ్ ఎ డెడ్లీ మెడికల్ క్రైసిస్' పేరుతో పుస్తకం రాశారు. 5000 కాపీలకు పైగా అమ్ముడవడంతో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిందని డాక్టర్ ఖాన్ తెలిపారు. ఇప్పటికీ పోలీసుల వేధింపులు ఆగలేదన్నారు. (చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్..) రౌడీ షీటర్ అంటున్నారు ‘డిసెంబర్ 17, 2021న నా పుస్తకాన్ని లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ 20న పోలీసులు మా ఇంటికి వచ్చారు. తర్వాత డిసెంబర్ 28న ఒకసారి, మళ్లీ జనవరిలో వచ్చారు. నేను గోరఖ్‌పూర్‌లోని రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్లో హిస్టరీ షీటర్ని అని పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిస్టరీ షీటర్లపై కన్నేసి ఉంచామని అంటున్నార’ని డాక్టర్ ఖాన్ వెల్లడించారు. (చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..) నా జీవితం నాశనం చేశారు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే గోరఖ్‌పూర్ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఫలితంగా 54 గంటల వ్యవధిలో 80 మంది పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పారు. నిజాలకు పాతర వేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ అయితే ప్రకృతి విపత్తుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆస్పత్రి అథారిటీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు తనను జైలుకు పంపారని, తన సోదరుడిపై దాడికి పాల్పడ్డారని.. కుటుంబ వ్యాపారాన్ని నాశనం చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. తనను జైలు నుంచి విడిపించేందుకు తన తల్లి, భార్య ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తాను రాసిన పుస్తకం చదివితే ప్రస్తుతం మనం ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నామన్న విషయం తెలుస్తుందన్నారు. (చదవండి: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?) -
ఏ పార్టీలో చేరను.. డాక్టర్‌గానే ఉంటా
లక్నో: ఇటీవల మథుర జైలు నుంచి విడుదలైన వైద్యుడు కఫీల్ ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తాను వైద్యుడిగానే ఉంటానని ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకోవడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబడుతూ ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆయన చేసిన ప్రసంగం విద్వేషాలను రెచ్చగొట్టేలా లేదని ఆయనకు ఊరటనిచ్చింది. సెప్టెంబర్ 1న కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయకుండా జాప్యం చేసింది. దీంతో ఏదో ఒక కేసులో తనను ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని భయమేసిందని, అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తనకు మానవతా దృక్పథంతో సహాయం చేశారని ఆయన చెప్పారు. (పోలీసుల ఎదుటే కొట్టి చంపారు) ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే అంచనాలు వచ్చాయి. ప్రస్తుతం రాజస్తాన్‌లో ఉన్న కఫీల్ ఖాన్ వీటిని తోసిపుచ్చుతూ తాను ఏ పార్టీలో చేరనని చెప్పారు. బిహార్‌లో వరద బాధితులకు సాయం చేయడంపై తాను దృష్టి పెడతానన్నారు. 2017లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంతో వార్తల్లోకెక్కిన గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడికల్ కాలేజీలో కఫీల్‌ఖాన్ వైద్యుడిగా ఉన్నారు. అప్పడు ఆయనతోపాటు మరికొంతమంది వైద్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తర్వాత ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఆయన నిర్దోషి అని తేలింది. చదవండి: ‘2011’ పరిస్థితి పునరావృతం అవుతుందా?! -
కఫీల్ సోదరుడిపై హత్యాయత్నం.. కలకలం
లక్నో: డాక్టర్ కఫీల్ ఖాన్.. యూపీలో గోరఖ్‌పూర్ చిన్నారుల మారణహోమానికి బాధ్యుడ్ని చేస్తూ అధికారులు కటకటాలపాలు జేశారు. సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు అందించాడని అతన్ని సోషల్ మీడియా పొగిడిన కొన్ని రోజులకే.. అసలు ఆ మరణాలకు బాధ్యుడే ఆయన అంటూ అధికారులు నివేదిక ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల తర్వాత ఈ మధ్యే బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పోరాటానికి దిగారు. ఇదిలా ఉంటే ఆయన సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కఫీల్ సోదరుడు, వ్యాపారవేత్త అయిన కసీఫ్ జమీల్(34)పై ఆదివారం రాత్రి బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటు చేసుకోగా, ఆయన్ని వెంటనే స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్‌కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి మెడలో దిగిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారని డాక్టర్ కఫీల్ తెలిపారు. ఆ తర్వాత కసీఫ్ను బీఆర్డీ ఆస్పత్రికి తరలించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు కఫీల్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. జిగ్నేశ్ ట్వీట్లు... ఇదిలా ఉంటే గుజరాత్ యువ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మెవానీ ఈ ఘటనపై ట్విటర్లో స్పందించారు. ‘ఆక్సిజన్ సిలిండర్ల కోసం డబ్బులు చెల్లించకుండా యోగి ప్రభుత్వం చిన్నారులను బలి తీసుకుంది. కానీ, డాక్టర్ కఫీల్ మాత్రం తన సొంత డబ్బుతో కొందరినైనా కాపాడేందుకు ప్రయత్నించారు. అలాంటి వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడేమో ఆయన సోదరుడ్నిపై హత్యా యత్నం జరిగింది. ఇలాంటి మంచి రోజుల(అచ్చెదిన్)ను మాకు అందిస్తున్న మోదీగారికి ధన్యావాదాలు’ అంటూ మెవానీ ఓ ట్వీట్ చేశారు. గోరఖ్‌పూర్ ఉదంతం... ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బాబా రాఘవ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రి (బీఆర్డీ) మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సిలిండర్ల తాలుకూ బకాయిలు చెల్లించకపోవటంతో.. సరఫరాను సదరు సంస్థ నిలిపేయగా, నిర్లక్ష్యంగా వ్యవహిరంచి పిల్లలు మృతి చెందాడానికి కారణమయ్యాడంటూ మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగ హెడ్ కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి ఈ ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. -
నా తప్పేంటో తెలీట్లేదు.. యోగి చేతుల్లో నా జీవితం
లక్నో: గోరఖ్‌పూర్ చిన్నారుల మృత్యుఘోష ఉదంతంలో డాక్టర్ కఫీల్ ఖాన్ ఊరట పొందారు. బుధవారం అలహాబాద్ బెయిల్ మంజూరు చేయటం తెలిసిందే. దీంతో శనివారం ఆయన్ని జైలు నుంచి విడుదల చేశారు. బయటకు వచ్చాక భావోద్వేగానికి గురైన ఆయన మీడియా ముందు రోదించారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా ఛానెల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నేను మానసికంగా చాలా కుంగిపోయాను. నెలల తర్వాత నా కుటుంబాన్ని కలిశాను. నేనేం తప్పు చేశాను? అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? జైల్లో గంటల తరబడి మధన పడేవాడిని. ఓ వైద్యుడిగా.. ఓ భారతీయుడిగా... అంతకు మించి ఓ తండ్రిగా... నేను చేయాల్సింది చేశాను. పిల్లల కోసం ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించాను. కానీ, వారి చావుకు నేను కారణమంటూ నాపై నిందలేయటంతో ప్రాణం పోయినంత పనైయ్యింది... ... నా భవిష్యత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేతుల్లోనే ఉంది. జైల్లో ఉండగా నా విషయంలో ఆయన స్పందించలేదు. కనీసం ఇప్పుడైనా కనికరించి నాపై సస్పెన్షన్ ఎత్తేస్తే.. తిరిగి విధుల్లో చేరి సేవలు కొనసాగిస్తా. లేకుంటే ఏ తప్పు చేయకపోయినా జీవితాంతం నరకం అనుభవించాల్సిందే’ అని కఫీల్ తెలిపారు. పిల్లల మరణాలకు కారకులెవరన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఈ విషయాన్ని ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో స్పష్టం చేశానన్నారు. ‘నిధుల నిలిపివేతతో ఆక్సిజన్ సరఫరా కంపెనీకి బకాయిలు చెల్లించలేకపోయామని.. దీంతో సదరు కంపెనీ ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిపేసిందని, 14 సార్లు సదరు కంపెనీ లేఖలు రాసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో కఫీల్ ఖాన్ భార్య షబిస్తా ఖాన్ కాగా, ఆ లేఖను కఫీల్ జైల్లో ఉండగానే రాయగా.. దానిని కఫీల్ భార్య షబిస్తా మీడియాకు విడుదల చేశారు. తన భర్తకు జైల్లో ఉండగా గుండెపోటు వచ్చినా కూడా జైలు అధికారుల సరైన వైద్యం అందించలేకపోయారని, తన భర్త పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కఫీల్‌పై ఆరోపణలు... గోరఖ్‌పూర్ బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో గతేడాది ఆగస్ట్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ సమయంలో సొంత డబ్బులతో కఫీల్‌ఖాన్ సిలిండర్లు తెప్పించి చికిత్స అందించటంతో ఆయన్ని హీరోగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. అయితే ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు సృష్టించారని, అసలు పిల్లల మరణానికి కారకుల్లో కఫీల్ కూడా ఒకరని ఆస్పత్రి వర్గాలు దర్యాప్తు బృందానికి నివేదించాయి. గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన కఫీల్ భార్య షబిస్తా ఖాన్ నడుపుతుందంటూ ఆరోపించాయి. ఈ పరిణామాలతో కఫీల్ ఖాన్‌పై వైద్య విభాగం వేటు వేయగా.. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం కఫీల్ కుటుంబసభ్యులు ఆరుసార్లు ప్రయత్నించారు. చివరకు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసినందున కస్టడీలో కఫీల్ ఉండాల్సిన అవసరం లేదని కోర్టు ఆయన్ని విడుదల చేసింది. -
గోరఖ్‌పూర్ ఉదంతం.. ఆ డాక్టర్ అరెస్ట్
సాక్షి, గోరఖ్‌పూర్: ఉత్తర ప్రదేశ్ లో బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 30 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన ఉదంతంలో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్‌ను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సిలిండర్ల కొరతకు ప్రధాన కారణం కఫీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. మెదడువాపు వ్యాధి విభాగాన్ని నోడల్ అధికారిగా ఉన్న కఫీల్ ఖాన్, డెంటిస్ట్ అయిన భార్యతో కలిసి ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రి కోసం బీఆర్డీ ఆస్పత్రి నుంచే సిలిండర్లను తరలించాడని, తద్వారా సిలిండర్ల కొరత ఏర్పడి పిల్లల మరణాలు సంభవించాయని ఆరోపణలు వినిపించాయి. ఇందుకు ఘటన జరిగిన సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ ఆర్కే మిశ్రా కూడా సహకరించాడని విచారణలో తేలింది. సొంత డబ్బులతో పిల్లల కోసం సిలిండర్లు కొంటున్నట్లు కలరింగ్ ఇచ్చి ‘హీరో’గా మీడియాకెక్కిన కఫీల్ తర్వాత అసలు విషయం వెలుగు చూడగా సస్పెన్షన్ కు గురికావటంతోపాటు ఇప్పుడు జైలు పాలయ్యారు. -
ఆ 'హీరో' డాక్టర్‌పై వేటుపడింది!
గోరఖ్‌పూర్: చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు సొంత డబ్బుతో ఆక్సీజన్ సిలిండర్లు కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో హీరోగా ప్రచారం పొందిన డాక్టర్‌పై అనుహ్యంగా వేటు పడింది. బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీలో మెదడువ్యాపు వ్యాధి విభాగానికి నోడల్ అధికారిగా ఉన్న ఆయనను తొలగించారు. విధులను ఉల్లంఘించి.. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నందుకు కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు. మెదడువాపు వ్యాధి కారణంగా బీఆర్డీ మెడికల్ కాలేజీ దవాఖానాలో పెద్దసంఖ్యలో చిన్నారులు చనిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన నేపథ్యంలో గత గురువారం సొంత డబ్బుతో బయటినుంచి ఆక్సీజన్ సిలిండర్లు తెప్పించి.. చిన్నారుల ప్రాణాలు కాపాడినట్టు సోషల్ మీడియాలో, మీడియాలో కఫీల్ ఖాన్‌పై కథనాలు వచ్చాయి. అయితే, ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నా.. తనను తాను 'పిల్లల రక్షకుడి'గా చూపించుకునేందుకు ఆయన కల్పిత కథనాలు మీడియాలో సృష్టించారని, గోరఖ్‌పూర్‌లో కఫీల్‌ఖాన్‌కు 50 పడకల ప్రైవేటు పిల్లల ఆస్పత్రి ఉందని, దీనిని డెంటిస్ట్ అయిన తన భార్య షబిస్తా ఖాన్ ఆధ్వర్యంలో నడుపుతున్నాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అసలు బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సీజన్ సిలిండర్ల కొరతకు కఫీల్ ఖాన్‌తోపాటు, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే మిశ్రా కారణమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మిశ్రాపై సస్పెన్షన్ వేటు పడటంతో ఆయన రాజీనామా చేశారు. తాజాగా మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించారని, విధులను ఉల్లంఘించారని కఫీల్ ఖాన్‌పై వేటు వేశారు.