లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీకి తాను సిద్ధమని డాక్టర్ కఫీల్ ఖాన్ ప్రకటించారు. ‘గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్ ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాను' అని పీటీఐతో డాక్టర్ ఖాన్ చెప్పారు. (చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికలు; ఆసక్తికర పరిణామాలు)
చర్చలు జరుగుతున్నాయి
మీరు ఏదైనా పార్టీతో టచ్‌లో ఉన్నారా, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా అని అడిగినప్పుడు.. ‘అవును, సంప్రదింపులు జరుగుతున్నాయి, అన్నీ కుదిరితే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాన’ని సమాధానం ఇచ్చారు. గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో జరిగిన దుర్ఘటనలో తనను బలిపశువు చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. ఇప్పటికీ ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోరఖ్‌పూర్ పోలీసులు పదే పదే తమ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.
రెండు సస్పెన్షన్లు.. రెండుసార్లు జైలు
గోరఖ్‌పూర్‌లో 2017, ఆగస్టులో బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో చోటుచేసుకున్న దుర్ఘటనతో కఫీల్ ఖాన్ జీవితం తలక్రిందులైంది. ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డాక్టర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు జైలు పాలయ్యారు. రెండు పర్యాయాలు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల ఆధారంగా ‘ది గోరఖ్‌పూర్ హాస్పిటల్ ట్రాజెడీ- ఏ డాక్టర్స్ మెమోయిర్ ఆఫ్ ఎ డెడ్లీ మెడికల్ క్రైసిస్' పేరుతో పుస్తకం రాశారు. 5000 కాపీలకు పైగా అమ్ముడవడంతో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిందని డాక్టర్ ఖాన్ తెలిపారు. ఇప్పటికీ పోలీసుల వేధింపులు ఆగలేదన్నారు. (చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్..)
రౌడీ షీటర్ అంటున్నారు
‘డిసెంబర్ 17, 2021న నా పుస్తకాన్ని లాంచ్ చేసిన తర్వాత డిసెంబర్ 20న పోలీసులు మా ఇంటికి వచ్చారు. తర్వాత డిసెంబర్ 28న ఒకసారి, మళ్లీ జనవరిలో వచ్చారు. నేను గోరఖ్‌పూర్‌లోని రాజ్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో హిస్టరీ షీటర్‌ని అని పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హిస్టరీ షీటర్లపై కన్నేసి ఉంచామని అంటున్నార’ని డాక్టర్ ఖాన్ వెల్లడించారు. (చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..)
నా జీవితం నాశనం చేశారు
పాలకులు నిర్లక్ష్యం కారణంగానే గోరఖ్‌పూర్ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందన్నారు. ఫలితంగా 54 గంటల వ్యవధిలో 80 మంది పసివాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని చెప్పారు. నిజాలకు పాతర వేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రధాని మోదీ అయితే ప్రకృతి విపత్తుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆస్పత్రి అథారిటీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు తనను జైలుకు పంపారని, తన సోదరుడిపై దాడికి పాల్పడ్డారని.. కుటుంబ వ్యాపారాన్ని నాశనం చేశారని డాక్టర్ ఖాన్ వాపోయారు. తనను జైలు నుంచి విడిపించేందుకు తన తల్లి, భార్య ఎంతో కష్టపడ్డారని తెలిపారు. తాను రాసిన పుస్తకం చదివితే ప్రస్తుతం మనం ఎలాంటి పాలకుల ఏలుబడిలో ఉన్నామన్న విషయం తెలుస్తుందన్నారు. (చదవండి: సింగిల్ డే సీఎం.. ఎవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment