స్ఫూర్తి ప్రసంగం చేస్తూ
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్‌పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది.
ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది.
భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి?
స్వీట్‌షాపులో డబ్బాలు
ఆమె ఒకసారి స్వీట్‌షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్‌పూర్‌లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది.
కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది.
గోరఖ్‌పూర్ రత్న
ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్‌గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్‌పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి.
స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్‌బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే.
అసలు కిటుకు
రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్‌పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది.
‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment