లక్నో : బాలీవుడ్ ప్రముఖ సింగర్ కైలాష్ ఖేర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గోరఖ్‌పూర్ మహోత్సవ్ కోసం నిర్వాహకులు ఓ ప్రత్యేక ఆల్బమ్‌ను రూపకల్పన చేశారు. అయితే వారు తన పాటను కాపీ కొట్టారంటూ కైలాష్ ఆరోపిస్తున్నారు.
గత ఫిబ్రవరిలో ఇసా యోగా సెంటర్‌లో నిర్వహించిన మహాశివ రాత్రి ఉత్సవాల కోసం గేయ రచయిత ప్రసూన్ జోషి ఓ పాటను రాశారు. దానిని కైలాష్ ఆలపించారు. ఇక ఇప్పుడు గోరఖ్‌పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించే మహోత్సవం కోసం విమల్ బర్వా ఓ పాట రాయగా.. ప్రణయ్ సింగ్ దానిని పాడాడు. నాథ్ యోగి పేరిట ఆ పాట జనాల్లోకి బాగా దూసుకుపోతోంది. పాటను విన్న కైలాష్ అనుచరులు అది కాపీ అన్న విషయాన్ని అతని దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కైలాష్ ఇది కాపీ రైట్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెబుతున్నారు. ‘‘ విదేశాల్లో కాపీ హక్కుల ఉల్లంఘన తీవ్ర నేరం. కానీ, మన దగ్గర మాత్రం ప్రజలు ఆ అంశాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అందుకు కారణం చట్టంపై అవగాహలేమినే. ఈ విషయంలో గోరఖ్‌పూర్ మహోత్సవ నిర్వాహకులతో న్యాయపోరాటానికి నేను సిద్ధం’’ అని కైలాష్ ప్రకటించారు. బహుశా ఈ విషయం ముఖ్యమంత్రికి తెలీకపోయి ఉండొచ్చని.. మంచి పరిపాలకుడిగా పేరున్న యోగి ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని.. అవసరమైతే తానే స్వయంగా సీఎంను కలిసి ఘటనపై వివరిస్తానని కైలాష్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment