శుభావతి శుక్లా, యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మొదటిసారిగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయనకు దీటుగా మహిళా నేత శుభావతి శుక్లాను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దించింది. కాంగ్రెస్ నుంచి చేతనా పాండే, బీఎస్‌పీ అభ్యర్థిగా ఖ్వాజా శంషుద్దీన్ బరిలో ఉన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ తరపున యువ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు.
ఎవరీ శుభావతి?
దివంగత బీజేపీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా సతీమణి శుభావతి. ఉపేంద్ర దత్ గుండెపోటుతో 2020లో మరణించారు. గోరఖ్‌పూర్‌లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు పనిచేశారు. నాలుగు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసినా విజయాన్ని అందుకోలేకపోయారు. రెండు అసెంబ్లీ ఎన్నికలు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఒక లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
యోగి ఆదిత్యనాథ్ యూపీ బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి గోరఖ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగిన 2018 లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఉపేంద్ర దత్ పోటీ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌తో విభేదాల కారణంగానే ఆయన ఓడిపోయారన్న వాదన అప్పట్లో బలంగా వినిపించింది. తన భర్త జీవించి ఉన్న సమయంలో శుభావతి రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజా ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్‌పూర్‌లోని మరో స్థానం నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో కుమారుడితో కలిసి గత నెలలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.
బీజేపీ తమ పట్ల వ్యవహరించిన తీరుపై శుక్లా కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఉపేంద్ర శుక్లా మరణం తర్వాత యోగి ఆదిత్యనాథ్ కనీసం తమ కుటుంబాన్ని పరామర్శించలేదని వారు వెల్లడించారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన ఉపేంద్ర కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా అవమానించిందని బాధ పడుతున్నారు. (హాట్‌టాఫిక్: యూపీ ఎన్నికల బరిలో సదాఫ్, పూజ)
సానుభూతి పనిచేస్తుందా?
సీఎం యోగిపై శుభావతిని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీకి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎటువంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ బలమైన అభ్యర్థిని ఎదుర్కొనేందుకు ఆమెను ఎంపిక చేయడం విశేషం. ఠాకూర్-బ్రాహ్మణుల ఓటు బ్యాంకును చీల్చి బీజేపీ చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే శుభావతిని పోటీకి పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె భర్త ఉపేంద్ర శుక్లా గోరఖ్‌పూర్‌లోనే కాకుండా పూర్వాంచల్‌లోనూ పేరున్న బ్రాహ్మణ నాయకుడు. శుక్లా కుటుంబంపై ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ భావిస్తోంది. బీజేపీ తమ కుటుంబానికి చేసిన అన్యాయం గురించే ఎన్నికల ప్రచారంలో శుభావతి, ఆమె కుమారుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
ఆసక్తికర పోటీ
చాలా కాలంగా యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యర్థిగా ఉన్న బీఎస్‌పీ మాజీ నేత హరిశంకర్ తివారీ కుమారుడు గతేడాది డిసెంబర్‌లో సమాజ్‌వాదీ పార్టీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో అంశం. అయితే గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ ఓడిపోని యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం అత్యంత సురక్షితమైందిగా పరిగణించబడుతోంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మార్చి 3న ఇక్కడ పోలింగ్ జరగనుంది. (క్లిక్: ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు.. నామినేషన్లో రెండో భార్య పేరు)
Comments
Please login to add a commentAdd a comment