లక్నో: డాక్టర్ కఫీల్ ఖాన్.. యూపీలో గోరఖ్‌పూర్ చిన్నారుల మారణహోమానికి బాధ్యుడ్ని చేస్తూ అధికారులు కటకటాలపాలు జేశారు. సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు అందించాడని అతన్ని సోషల్ మీడియా పొగిడిన కొన్ని రోజులకే.. అసలు ఆ మరణాలకు బాధ్యుడే ఆయన అంటూ అధికారులు నివేదిక ఇవ్వటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలల తర్వాత ఈ మధ్యే బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పోరాటానికి దిగారు. ఇదిలా ఉంటే ఆయన సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
కఫీల్ సోదరుడు, వ్యాపారవేత్త అయిన కసీఫ్ జమీల్(34)పై ఆదివారం రాత్రి బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో ఘటన చోటు చేసుకోగా, ఆయన్ని వెంటనే స్థానికంగా ఓ నర్సింగ్ హోమ్‌కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి మెడలో దిగిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించారని డాక్టర్ కఫీల్ తెలిపారు. ఆ తర్వాత కసీఫ్‌ను బీఆర్డీ ఆస్పత్రికి తరలించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు కఫీల్ మీడియాకు వెల్లడించారు. కాగా, ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.
జిగ్నేశ్ ట్వీట్లు... ఇదిలా ఉంటే గుజరాత్ యువ ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేశ్ మెవానీ ఈ ఘటనపై ట్విటర్‌లో స్పందించారు. ‘ఆక్సిజన్ సిలిండర్ల కోసం డబ్బులు చెల్లించకుండా యోగి ప్రభుత్వం చిన్నారులను బలి తీసుకుంది. కానీ, డాక్టర్ కఫీల్ మాత్రం తన సొంత డబ్బుతో కొందరినైనా కాపాడేందుకు ప్రయత్నించారు. అలాంటి వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు. ఇప్పుడేమో ఆయన సోదరుడ్నిపై హత్యా యత్నం జరిగింది. ఇలాంటి మంచి రోజుల(అచ్చెదిన్)ను మాకు అందిస్తున్న మోదీగారికి ధన్యావాదాలు’ అంటూ మెవానీ ఓ ట్వీట్ చేశారు.
గోరఖ్‌పూర్ ఉదంతం... ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బాబా రాఘవ దాస్ మెడికల్ కళాశాల ఆస్పత్రి (బీఆర్‌డీ) మెడికల్ కాలేజిలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. సిలిండర్ల తాలుకూ బకాయిలు చెల్లించకపోవటంతో.. సరఫరాను సదరు సంస్థ నిలిపేయగా, నిర్లక్ష్యంగా వ్యవహిరంచి పిల్లలు మృతి చెందాడానికి కారణమయ్యాడంటూ మెదడు వాపు వ్యాధి నివారణ (ఏఈఎస్) విభాగ హెడ్ కఫీల్‌ఖాన్ జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి పూర్తిగా విషమించడంతో ఏప్రిల్ 19న కఫీల్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కఫీల్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని హైకోర్టు అతనికి ఈ ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment