ఉత్తరప్రదేశ్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారిని కనిపించినట్లే మీద పడి గాయపరిచింది. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా కేవలం గంట వ్యవధిలోనే కంట పడిన 17 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో మహిళతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని షాపూర్‌లో ఆగష్టు 14న జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
ఇందులో 22 ఏళ్ల విద్యార్ధి ఆశిష్ యాదవ్.. ఆవాస్ వికాస్ కాలనీలోని తన ఇంటి ముందు నిలబడి ఫోన్‌లో మాట్లాడుతుండగా వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఇంటి ముందు వెళ్తున్న కుక్క.. అకస్మాత్తుగా యువకుడి వైపుకు పరుగెత్తుకొచ్చి కరిచింది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆ కుక్క ఎంతకు తగ్గలేదు.
అతడిపైకి ఎగురుతూ, మరింత వేగంగా కరిచేందుకు యత్నించింది. ఆశిష్ కిందపడిపోవడంతో అతని కాలుపై, ముఖంపై గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో అతని ముఖం, నోరు, కళ్లు, పెదవులు దెబ్బతిన్నాయి.
దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారని ఆశిష్ తండ్రి విజయ్ యాదవ్ తెలిపారు. కుక్కల దాడిపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.
ఈ ఘటన తరువాత కుక్కు ఇంటి గేటు వద్ద నిలబడిన మరో మహిళపై దాడి చేసింది. ఆమె మోకాలి, కాలుపై కరిచి వెళ్లిపోయింది. దీంతో మహిళ మోకాలిపై లోతైన గాయమవ్వగా కుట్లు పడ్డాయి. దీని తర్వాత ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు బాలికలపై కుక్క దాడి చేసింది. ఇలా ఆ పిచ్చి కుక్క దాదాపు 17 మందిని గాయపరిచింది.
దీనిపై గోరఖ్‌పూర్ అదనపు మున్సిపల్ కమీషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నామని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేయడంతోపాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment