ఉత్తరప్రదేశ్‌లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్‌పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్‌పురి స్టార్లే కావడం అందుకు కారణం...
రవికిషన్‌కు పీఠం మద్దతు...
భోజ్‌పురి సినిమాల్లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో జౌన్‌పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి.
ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్‌పూర్‌లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్‌కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది.
నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్
భోజ్‌పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్‌కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై, కాంపియర్‌గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది.
1990ల నుంచి బీజేపీ హవా..
గోరఖ్‌పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్‌దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది.
కుల సమీకరణాలదే కీలకపాత్ర..
గోరఖ్‌పూర్‌లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్‌లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్‌ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment