గోరఖ్‌పూర్ విషాదం: కీలక నిందితుడి అరెస్ట్
సాక్షి, లక్నో: యూపీలోని గోరఖ్‌పూర్ బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆగస్టు నెలలో ఆక్సిజన్‌కొరత కారణంగా దాదాపు 70 మంది చిన్నారులు మృతిచెందగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో మరో కీలక నిందితుడు, బీఆర్‌డీ కాలేజీ సీఎంఎస్ ఆఫీస క్లర్క్ సుధీర్ పాండేను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు పోటీసులు శనివారం వెల్లడించారు.
బీఆర్‌డీ కాలేజీకి చెందిన కొందరు వైద్యసిబ్బందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా అందులో సుధీర్ పాండే నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న సుధీర్‌ను ఖాజంచి చౌక్‌లో గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అప్పటి ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా సహకారంతో ఆక్సిజన్‌కు సంబంధించిన నగదును కమిషన్ల కోసం వాడుకుని, సరఫరాదారులకు చెల్లించడంలో జాప్యం చేయడం వల్లేచిన్నారుల మరణాలు సంభవించాయని ఆరోపణలున్నాయి.
ఈ కేసులో ఇదివరకే వైద్య విద్య అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనితా భట్నాగర్ జైన్‌ను బదిలీ చేస్తూ యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన నిందితులైన రాజీవ్‌మిశ్రా, పూర్ణిమా మిశ్రా, మెదడువాపు వ్యాధి విభాగం నోడల్ అధికారి కఫీల్ ఖాన్ లను యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం వీరు జ్యూడీషయల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా సెప్టెంబర్ 1న కూడా ఈ ఆసుపత్రిలో 35మంది చిన్నారులు చనిపోయారు.