గోరఖ్‌పూర్ ఘటన.. ఓ పనైపోయింది
సాక్షి, గోరఖ్‌పూర్: సుమారు 60 మంది చిన్నారులను బలి తీసుకున్న బాబా రాందేవ్ ఆస్పత్రి ఘటనలో ఓ పని పూర్తయిపోయింది. ఈ కేసులో నిందితుడు, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాదారుడు మనీశ్ బండారిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న మనీశ్‌ను డొరియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, 9 మంది నిందితులతో కూడిన ఎఫ్‌ఐఆర్‌లో పుష్ఫలీల కంపెనీ యాజమాని మనీశ్ బండారి పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. బీఆర్డీ ఆస్పత్రి యాజమాన్యం బకాయిలు చెల్లించకపోవటంతో సిలిండర్ల సరఫరాను నిలిపివేయటం.. తద్వారానే చిన్నారులు మృతి చెందారని ఆరోపణలు వినిపించాయి. నిందితులందరినీ అరెస్ట్ చేయటంతో ఇక విచారణను వేగవంతం చేయటమే మిగిలి ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రి బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీలో చిన్నారులు ఆక్సిజన్ సరఫరా అందక మృతి చెందారు. దేశ చరిత్ర లోనే కనీవినీ ఎరుగని రీతిలో చోటుచేసుకున్న ఈ ఘోర కలిపై పెద్ద ఎత్తున్న విమర్శలు రావటంతో సీఎం ఆదిత్యానాథ్ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్‌లో మాజీ ప్రిన్సిపాల్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లా, పిల్లల వైద్య విభాగం మాజీ చీఫ్
డాక్టర్ కఫీల్ ఖాన్, వైద్యులు, క్లర్కులు ఇలా 9 మంది పేర్లను పోలీసులు చేర్చారు.