ఆస్పత్రి మృత్యుగీతం | Childrens dies at Gorakhpur BRD Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి మృత్యుగీతం

Published Wed, Aug 16 2017 12:49 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

ఆస్పత్రి మృత్యుగీతం

ఆస్పత్రి మృత్యుగీతం

అసమర్ధత, అవినీతి, నిర్లక్ష్యం అన్నీ జతగూడి కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాయి. యూపీలోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌దాస్‌ వైద్య కళాశాల(బీఆర్డీ) ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా సాగుతున్న నరమేథం సామాన్యమైనది కాదు. ఈ నెల 1 మొదలుకొని 12 వరకూ అక్కడ 134 మంది పసిపిల్లలు మృత్యువాత పడ్డారని ఆ ఆస్పత్రిని సందర్శించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికనిచ్చిన వైద్య నిపుణుల బృందం చెబుతోంది. ఇందులో 70 మంది కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలో చని పోయారు. కేవలం 48 గంటల్లో 30 మంది కన్నుమూశారు.

ప్రాణాలు కోల్పోయిన పిల్లల్లో పది రోజుల వయస్సున్న ఇద్దరు కవలలు మొదలుకొని పది పన్నెండేళ్ల వయసు చిన్నారుల వరకూ ఉన్నారు. వీరిలో అత్యధికులు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందినవారు. కొందరు బడుగు రైతుల పిల్లలు. మరికొందరు చిరు ఉద్యోగస్తుల పిల్లలు. తీవ్రంగా జబ్బుపడ్డ తమ పిల్లల ప్రాణాలు కాపాడుకుందా  మని వారిని  ఆత్రంగా భుజాలకెత్తుకుని సర్కారీ ఆస్పత్రికొస్తే అది కాస్తా వారిని మింగేసింది. జరిగిన నరమేథానికి కారణం ఆక్సిజెన్‌ సిలెండర్లు లేకపోవడమా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చెబుతున్నట్టు మెదడువాపు వ్యాధి తీవ్రత వల్లనా లేక మరో రకమైన అంటువ్యాధుల వల్లనా అన్నది చర్చనీయాంశం కాదు. అది కేవలం సమస్య తీవ్రత నుంచి జనం దృష్టి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వృధా తర్కం.

అధికారంలోకొచ్చిన వెంటనే చాలామంది పాలకులు చేసే పని పోలీసు శాఖలో చురుకుదనం తీసుకురావడం. వారు వీధుల్లో తరచు కనిపించి ఆడపిల్లల్ని వేధించే ఆకతాయిలను అరెస్టు చేయడం, ట్రాఫిక్‌ నిబంధనల్ని సరిగా పాటించనివారి వాహ నాలు స్వాధీనం చేసుకోవడం వంటివి చేస్తే ప్రభుత్వం పనిచేస్తున్నదన్న భ్రమ కల్పించవచ్చునని పాలకులు భావిస్తారు. యోగి ఆదిత్యనాథ్‌ చేసింది కూడా అదే. ప్రత్యేక పోలీసు బృందాల గస్తీని పెంచి ఆకతాయిలను పట్టుకుని చితకబాదడం, ఆడ మగా కలిసి వెళ్తుంటే వారిని పట్టుకుని గుంజీలు తీయించడం లాంటివి నిర్వ హించి అల్ప సంతోషులతో సెబాసనిపించుకున్నారు.

ఒక పసివాణ్ణి కోల్పోయిన తండ్రి ‘మరణించింది పిల్లలు గనుక మా నోరు నొక్కాలని చూస్తున్నారు. ఇదే ఆవు చనిపోయి ఉంటే ఈపాటికి పట్టణం ఎంత అల్లకల్లోలంగా మారేది!’ అని వాపో యాడు. ఆ తండ్రి మాట అక్షరాలా నిజం. బీఆర్డీ సాధారణమైన ఆస్పత్రి కాదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల ఆస్పత్రులు సైతం తీవ్రత గల కేసుల్ని పంపించే రెఫరల్‌ ఆస్పత్రి. అలాంటిచోట ఆక్సిజెన్‌ సిలెండర్ల వరకూ ఎందుకు... కాటన్‌ లేదు, గ్లూకోజ్‌ లేదు, మందుల్లేవు. చేర్పించింది మొదలు ఆ పిల్లల తల్లిదండ్రులు వీటన్నిటి కోసం మెడికల్‌ షాపులకు ఉరుకులెత్తడమే సరిపోయింది. ఇవన్నీ ఉన్న వారు రక్తం కోసం వెదుకులాడారు.

అంతా అయిందనుకున్నాక వైద్యుల జాడ కోసం వివిధ వార్డుల్ని గాలించవలసివచ్చింది. విషాదమేమంటే పిల్లలు ప్రాణంతో ఉన్నంతవరకూ పడిన ఈ ఆత్రుత వారు మరణించాక కూడా కొనసాగింది. ముందు డెత్‌ సర్టిఫికెట్‌ కోసం... ఆ తర్వాత పోస్టుమార్టం కోసం...అటుపై మృత దేహాలను తెచ్చుకోవడం కోసం వారంతా యాతనలు పడ్డారు. ఆక్సిజెన్‌ లేదు మొర్రో అని ఆర్తనాదాలు చేస్తున్న పిల్లల బంధువుల్ని తరిమికొట్టడానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు దిగాయి.

గోరఖ్‌పూర్‌ జిల్లాలో మెదడువాపు వ్యాధి తీవ్రత నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నదని యోగి చెబుతున్న మాటలో నిజముంది. కానీ అదే నియోజకవర్గానికి 1998 నుంచి వరసగా ప్రాతినిధ్యం వహించిన తన నిర్లక్ష్యం పాలు అందులో ఎంతన్నది ఆయన గుర్తించలేదు. కనీసం మొన్నటివరకూ ఉన్న అఖిలేశ్‌ ప్రభుత్వం మెడలు వంచి సరైన వైద్య సదుపాయాలు కల్పించడానికి ఆయన చేసిన ప్రయత్నమేమిటి? అధికారంలోకి వచ్చాక మాత్రం చేసిందేమిటి? మార్చి 22న తొలిసారి ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజీవ్‌ మిశ్రా ఆక్సిజెన్‌ సిలెండర్‌ల సరఫరా దారుకు చెల్లించాల్సిన రూ. 68 లక్షల బకాయి గురించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ బకాయి తీర్చకపోతే సిలెండర్ల సరఫరా సాధ్యం కాదంటున్నాడని చెప్పారు.

ఆ తర్వాత నెలకు రెండు, మూడు ఉత్తరాల చొప్పున రాస్తూనే ఉన్నారు. ఇది అయ్యే పని కాదని ఆ సరఫరాదారే స్వయంగా ఆరోగ్యమంత్రిని కలిసి చెప్పాడు. ఎన్ని చేసినా నిరుపయోగమైంది. చివరకు 23మంది పిల్లలు మరణించిన పదో తేదీన స్వయంగా యోగి ఆదిత్యనాథ్‌ జోక్యం చేసుకున్నా బకాయి తీర్చడానికి మరో 24 గంటలు పట్టింది. కారణం నిధుల కొరత కాదు. వైద్య కళాశాల ఖాతాలో రూ. 3.86 కోట్లున్నాయి. కేవలం చేతులు తడపలేదన్న ఏకైక కారణంతోనే బకాయిల విడు దలలో జాప్యం చేశారని రికార్డులు చూస్తే అర్ధమవుతుంది. ఆన్‌లైన్‌లో కేవలం అయిదు నిమిషాల్లో పూర్తి కావలసిన నిధుల బదలాయింపు అయిదు నెలలు పట్టిం దంటే లోపం ఎక్కడుందో యోగి ఆదిత్యనాథ్‌కు అర్ధమై ఉండాలి. కానీ ఆయన సర్కారు కళాశాల ప్రిన్సిపాల్‌ను తొలగించింది. సిలెండర్ల కోసం రాత్రింబవళ్లు తాపత్రయపడి కొందరు పిల్లల్ని రక్షించిన వైద్యుడు ఖఫీల్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేసింది.  

నిజానికి సమస్య యూపీకి లేదా గోరఖ్‌పూర్‌కూ పరిమితమైనది కాదు. దేశంలో ఇంచుమించు ప్రతిచోటా ప్రభుత్వాసుపత్రులు ఇలాగే అఘోరిస్తున్నాయి. ఆలనా పాలనా కరువై అవి మంచం పట్టాయి. రెండేళ్లక్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఐసీయూలో ఎలుకలు కొరకడంతో ఒక బాలుడు మరణిస్తే ఆ తర్వాత చీమలు కుట్టి మరో నవజాత శిశువు కన్నుమూసింది. ఆరోగ్య రంగాన్ని మన దేశం దారు ణంగా నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆమధ్య హెచ్చరించింది.

స్థూల దేశీయోత్పత్తిలో ప్రజారోగ్యానికి వెచ్చిస్తున్నది కేవలం 1.6 శాతం మాత్రమే. దీనికితోడు సిబ్బంది కొరత, తాత్కాలిక నియామకాలు, పర్యవేక్షణా లోపం, జవాబుదారీతనం లోపించడం సర్కారీ ఆస్పత్రులకు శాపంగా మారాయి. ఇవన్నీ సరిచేయకుండా చవకబారు చిట్కాలతో కాలక్షేపం చేస్తే గోరఖ్‌పూర్‌లు పున రావృతమవుతూనే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement