అక్కడేమైంది జాతీయవాదం?
సందర్భం
గడచిన 140 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత దుర్భిక్షం ప్రస్తుతం తమిళనాడులో నెలకొని ఉంది. అయితే మాత్రం మనం లెక్క చేస్తామా ఏమిటి? అసలు తమను ఓటు వేసి గెలిపించే అతి పెద్ద ఈ ఓటు బ్యాంకు మీద ప్రభుత్వాలు శీతకన్ను ఎలా వేయగలుగుతున్నాయి? ఆ దుర్భర పరిస్థితుల నుంచి తమిళనాడు రైతులను రక్షించవలసిన ఈ తరుణంలో మన ఘన జాతీయవాదం ఏమైపోయింది?
ఆ రాష్ట్రంలో దారుణ దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాలు ఏడింటిలో గత వారం పర్యటించినప్పుడు నన్ను ఆ ప్రశ్నలే వెంటాడాయి. మిగతా దేశంలో మాదిరిగా కాకుండా, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు బలహీనపడుతున్నప్పుడే తమిళనాడు అత్యధిక వర్షపాతానికి నోచుకుంటుంది. అయితే 2016లో ఇది జరగలేదు. ఈశాన్య రుతుపవనాల కాలంలో రాష్ట్రానికి అవసరమైన వర్షపాతంలో 62 శాతం లోటు కనిపించిందని అధికారులు చెప్పారు. వర్షపాతంలో 25 శాతం లోటు అంటేనే తీవ్రంగా పరిగణిస్తారు. ఇక 50 శాతం లోటు అంటే ప్రమాదకర స్థాయిగా భావిస్తారు. గడచిన ఏడాది వర్షపాతంలో వచ్చిన ఆ లోటు, ఎప్పుడో 1876లో ఒకసారి ఆ ప్రాంతం చవిచూసిందని రికార్డులు చెబుతున్నాయి. జలాశయాలు వాటి సామర్థ్యంలో 20 శాతానికి పరిమితమైనాయి. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాలలో 21 జిల్లాలు కరువు కోరలలో చిక్కుకున్నాయి. ఇందులో తమిళనాడు ధాన్యాగారం కావేరీ డెల్టా కూడా ఉంది. అక్కడ కూడా మేం పర్యటించాం.
ఎక్కడ చూసినా రైతాంగం అనుభవిస్తున్న దుఃఖం కళ్లకు కడుతోంది. ఎకరాలకు ఎకరాలు బీళ్లు పడి ఉన్నాయి. నదులు, కాలువలు, చెరువులు ఎండిపోయాయి. బీడువారిన నేల మీదే గడ్డిపరకల కోసం వెతుకుతున్న పశువులు కనిపించాయి. ఈ ప్రాంతంలో ప్రధాన పంట వరి. ఈ సీజన్‌లో ఆ పంట పూర్తిగా పాడైందని ప్రతి చోట రైతులు చెప్పారు. పంట నష్టం కలిగించిన దిగ్భ్రాంతి, ఫలితంగా పెరిగిన రైతుల బలవన్మరణాల గురించే ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టిన రైతులు ఎలుగెత్తి చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో సన్నగిల్లిన ఉపాధి అవకాశాలు వ్యవసాయ కూలీల మీద మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పంట నష్టం వెంటే తీవ్ర స్థాయి పశుగ్రాసం కొరత కూడా ఉంటుంది. దీనితో రైతులు ఆవులనీ, మేకలనీ అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల తాగునీటి కొరత కూడా ఉంది.
నిజానికి దీనికంతటికీ కారణం ప్రకృతి వైపరీత్యమని చెప్పలేం. మేం ఆయా ప్రాంతాలలో జరిపిన పర్యటన తరువాత ఇదంతా మానవ కల్పిత లేదా విధానాలతో ముడిపడి ఉన్న సమస్య అని అర్థమైంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జలాల వివాదం కారణంగా ఆ డెల్టా ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులు సమస్యకు సానుకూల పరిష్కారాన్ని వెదికే పని చేయకుండా ఉద్రిక్తతలను మరింత ఎగదోయడానికే యత్నిస్తున్నారు. ఇందుకు సంబం«ధించి ట్రిబ్యునల్ తన తీర్పును ప్రకటించింది. దీనికి అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలి. అయితే తీర్పు అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జాతీయవాదం గురించి గొప్పగా ప్రబోధిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదంలో జోక్యం చేసుకోవడం లేదు. తమిళనాడు ప్రాంతంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు భూగర్భ జలాల వృద్ధిని నిరోధిస్తున్నాయి. అలాగే సరిపడని పంటలతో పరిమితంగా ఉన్న జలాలు దుర్వినియోగమవుతున్నాయి.
ప్రభుత్వ చేయూత కోసం రైతులు ఎదురు చూసే సమయం సరిగ్గా ఇదే. ఈ పరిస్థితులలో రైతులు, తమిళ ప్రజలు ప్రభుత్వ స్పందన కోసం ఆశించడానికి సరైన కారణాలే ఉన్నాయి. అయితే హిందీ భాషా ప్రాంతాలలోని రాష్ట్రాలలో జరిగే నాసిరకం పరిపాలనతో తమిళనాడు పరిపాలనా ప్రమాణాలను అంచనా వేయలేం. తమిళనాట విపరీత స్థాయిలో రాజకీయ విన్యాసాలు కనిపించే మాట నిజమే అయినా, మిగతా రాష్ట్రా లతో పోల్చినప్పుడు ఆ రాష్ట్రం చక్కని సంక్షేమ పథకాలను అమలు చేసిన వాస్తవం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ఆరంభమైంది ఆ రాష్ట్రంలోనే. రేషన్ దుకాణాల ద్వారా చౌక ధరలకు సరుకులు అందించి ఉన్నతమైన ప్రజా పంపిణీ విధానాన్ని అమలు చేసిన రాష్ట్రాలలో తమిళనాడు చెప్పుకోదగినదిగా ఉంది. సునామీ అనంతర చర్య లతో ప్రకృతి వైపరీత్యాలను వేగంగా ఎలా ఎదుర్కోవచ్చో చూపించి, ఒక నమూనా రాష్ట్రంగా కూడా తమిళనాడు నిలబడింది. అయితే రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, ఈ దుర్భిక్ష పరిస్థితులలో ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న అక్కడి రైతాంగానికి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిరాశే ఎదురైంది. ఇదంతా రాజకీయ సంకల్పం లేదనడానికి ప్రబల నిదర్శనం.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా చర్చినీయాంశంగానే ఉంది. దుర్భిక్ష పరిస్థితులు ఉన్నప్పుడు వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి పనికి పూనుకోలేదు. ఇలాంటి కరువు పరిస్థితులలో తన బిడ్డ పాఠశాలలో అయినా కడుపునిండా తినే అవకాశం ఉంటుందని ప్రతి తల్లి ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే ఆ తల్లితో ప్రభుత్వం ఏకీభవించేటట్టు లేదు.
కరువు తాండవిస్తున్న ప్రాంతాలలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. తమకు కొత్త జాబ్ కార్డులు గానీ, ఉపాధి కానీ ఇవ్వలేదని పర్యటనలో మేం కలుసుకున్న వ్యవసాయ కూలీలు చెప్పారు. ఒకవేళ పనిచేసినా సొమ్ము చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నదంటూ అనేక ఫిర్యాదులు విని పించాయి. ప్రభుత్వం లాంఛనంగా పంట నష్టం పరిహారాన్ని ప్రకటించింది. అయితే ఆ కొద్ది నష్ట పరిహారమైనా ప్రకటించిన దానికంటే చాలా తక్కువగానే ఇస్తున్నారని మేం కలుసుకున్న గ్రామీణులు ఆరోపించారు. అలాగే ఏ రైతూ కూడా ఇంతవరకు బీమా మొత్తాన్ని కూడా అందుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా చాలాచోట్ల వాణిజ్య, సహాకార బ్యాంకులు రుణ వసూళ్లకోసం నోటీసులు జారీ చేస్తూనే ఉన్నాయి. జాతీ యవాదం అంటే బాహ్య శత్రువును కనుగొనడం కాదు. నిజమైన జాతీ యవాదం అంటే దేశాన్ని కలిపి ఉంచడం. తమిళనాడు రైతులు సాగి స్తున్న హక్కుల యాత్ర సానుకూల జాతీయవాదాన్ని ప్రకటిస్తున్నది.
వ్యాసకర్త: యోగేంద్ర యాదవ్
స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్ : 98688 88986
Twitter : @_YogendraYadav