సరిహద్దులో చెక్‌డ్యాం చిచ్చు
► చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్న తమిళ రైతులు
► ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు
► రైతుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేత
► తమిళనాడు, ఆంధ్రా సరిహద్దులో ఘటన
పళ్లిపట్టు/శ్రీరంగరాజపురం: కుశస్థలీ నదిపై సరిహద్దు ప్రాం తంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణాన్ని తమిళ రైతులు అడ్డుకున్నారు. దీంతో చోటుచేసుకున్న ఉద్రిక్తతతో ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి చెక్‌డ్యాం నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్రా అటవీ ప్రాంతం నుంచి, కృష్ణాపురం జలాశయం నుంచి నీరు లవ, కుశ కాలువల ద్వారా కుశస్థలి నదిలో కలుస్తుంది. ఈ నీరు పళ్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రజల దాహార్తిని తీర్చుతూ పంట పొలాలకు అందుతోంది.
ఈ నీరు ఎస్‌ఆర్.పురం మండలం పాలసముద్రం నుంచి 4కి.మీ ప్రవహించి తమిళనాడులోని కుశస్థలి నది తీరం మార్గంలో వెలిగరం చెరువుకు చేరుతుంది. ఈ నీటి ద్వారా 10గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 2వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసముద్రం, నెలవాయి మధ్యలో వెలిగరం కాలువపై నాలుగు ప్రాంతాల్లో చెక్‌డ్యాం పనులు ప్రారంభించింది. చెక్‌డ్యాంలు నిర్మిస్తే పంట పొలాలు బీడుగా మారుతాయనే ఆగ్రహంతో పళ్లిపట్టు మండల మాజీ చైర్మన్ రాజేశ్వరి రవీంద్రనా«థ్ ఆధ్వర్యంలో 4గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది రైతులు మంగళవారం ఉదయం చెక్‌డ్యాం నిర్మాణ పనులు అడ్డుకున్నారు.
దీంతో చోటుచేసుకున్న ఉద్రిక్తతతో ఇరు రాష్ట్రాల అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పళ్లిపట్టు తహసీల్దారు వెంకటేశన్, ప్రజాపనులశాఖ అదనపు ఇంజినీర్ వెంకటేశన్, డీఎస్పీ బాలచందర్ అలాగే ఆంధ్రా అధికారులు ఎస్‌ఆర్.పురం ఎంఆర్‌ఓ వెంకటలక్ష్మమ్మ, పుత్తూరు డీఎస్పీ నాగభూషణంరావు, కార్వేటినగరం సీఐ మోహన్, ఎస్‌ఆర్.పురం ఎస్‌ఐ వాసంతి, పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతుల నిరసనతో అధికారులు రెండు రోజుల పాటు చెక్‌డ్యాం నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఇరు రాష్ట్రాల అధికారులు, రైతుల సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అధికా రుల హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు.