checkdam
-
మానేరు నదికి పర్యాటక శోభ : మంత్రి గంగుల
సాక్షి, కరీంనగర్ : చెక్ డ్యామ్ ల నిర్మాణంతో మానేరు నదికి పర్యాటక శోభ లభిస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మానేర్ నది 365 రోజులు జలకళతో పర్యాటకులను ఆకర్షించనున్నదని చెప్పారు. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీ దిగువన మానేరు నది పై 87.90 లక్షలతో నిర్మిస్తున్న 5 చెక్ డ్యామ్ ల నిర్మాణానికి తీగలవంతెన వద్ద మంత్రి గంగుల కమలాకర్ శంఖుస్థాపన చేశారు. చెక్ డ్యామ్ ల నిర్మాణంతో రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలకు తాగు.. సాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వృధాగా గోదావరిలో కలిసే నీటిని అరికట్ట వచ్చని తెలిపారు. అలాగే ఏడాది పొడవున మానేరు నదిలో 10 కిలో మీటర్ల వరకు నీరు నిల్వ ఉంటుందని.. తద్వారా భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ఈ ఐదు చెక్ డ్యాంలతో పాటు ఇరుకుల్ల వాగు పై మరో మూడు చెక్ డ్యాంలు కరీంనగర్ నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని చెప్పారు. వాగులో నీళ్లు నిలపడం వల్ల కేబుల్ బ్రిడ్జి చుట్టూ పర్యాటక ప్రాంతంగా మారడంతో పాటు శివారు కాలనీల్లో, చుట్టూ పక్కల గ్రామాలకు భూగర్బ జలాలు పుష్కలంగా పెరుగుతాయని తెలిపారు. సాగు ,తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం పూర్తిఅయితే రేటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రోపోజల్ పంపిస్తామని తెలిపారు. చెక్ డ్యాం ల నిర్మాణం తో మానెరు రివర్ ఫ్రంట్ కు తొలి అడుగు పడిందని రానున్న రోజుల్లో మానేరు నది పర్యాటక రంగంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. -
ఈత సరదా ప్రాణలు తీసింది
సాక్షి, ప్రకాశం : ఇటీవల మంచి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం వాతావరణం అహ్లాదకరంగా ఉంది. ఐదుగురు స్నేహితులు సరదా అలా ఊరి బయటకు వెళ్లి కాసేపు కాలక్షేపం చేసి వద్దామనుకున్నారు. సమీపంలోని చెక్ డ్యాంలో నీరు పుష్కలంగా ఉండటం చూసి వారికి ఈత కొట్టాలనిపించింది. ఒకరి తరువాత ఒకరుగా ఈతకు దిగారు. అప్పటిదాకా ఉల్లాసంగా గడిపిన వారు ఒక్కసారిగా ప్రమాదంలో పడ్డారు. వారిలో ఇద్దరు నీట మునిగి మృతి చెందగా మిగిలిన ముగ్గురూ ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన సోమా రవి, మద్దూరి ఓబులకొండారెడ్డి, ఇళ్లూరి మహేంద్రరెడ్డి, మీనిగ నరేంద్ర, వసంతపురం బాలకృష్ణలు వీరంతా మంచి స్నేహితులు.. బుధవారం వాతావరణం చల్లగా ఉండటంతో సరదాగా గడుపుదామనుకొని స్నేహితులంతా ఊరి బయట పొలాల్లోకి వెళ్లారు. కొద్ది సేపు సరదాగా గడిపి కొండకు దగ్గర్లోని జంగమూడిశెల చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. చెక్‌డ్యాంలో పుష్కలంగా నీరు ఉండటంతో ఈత కొడదామనుకున్నారు. ఇళ్లూరి మహేంద్ర లోతుకు వెళ్లి మునిగి పోతున్నాడని గమనించిన మిగతా నలుగురు అతడిని కాపాడే యత్నం చేశారు. వీరిలో రవి(24), ఓబులకొండారెడ్డి(23) ఇద్దరు లోతుకు వెళ్లి నీట మునిగిపోయారు. మిగిలిన ముగ్గురూ ఒకరికొకరు చేయి అందించుకొని ఎలాగో బతికి బయట పడ్డారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లి రవి, కొండారెడ్డిల మృతదేహాలను వెలికితీసి గ్రామంలోకి తీసుకొచ్చారు. ఒంటరి అయిన చిన్నారులు.. ప్రమాదంలో మృతి చెందిన సోమా రవి గ్రామంలో వెల్డింగ్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. రవికి భార్య నాగలక్ష్మి, మూడేళ్ల పాప తేజశ్రీ, ఏడాదిలోపు బాబు నరేంద్రలు ఉన్నారు. రవి మృతితో నాగలక్ష్మి దిక్కుతోచని స్థితిలో ఉంది. నాన్న లేరని తెలియని చిన్నారులు ఏమి తెలియక అమాయకంగా చూస్తున్నారు. రవి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఇటీవలే మృతి చెందడం, ఇప్పుడు రవి కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంభాన్ని పోషిస్తున్న ఓబులకొండారెడ్డి.. గ్రామానికి చెందిన మద్దూరి ఓబులరెడ్డి, తిరపతమ్మ దంపతుల ఏకైక కుమారుడు ఓబులకొండారెడ్డి కొద్దిగా చదువుకొని బేల్దారి పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కొన్నాళ్లు హైదరబాద్‌లో బేల్థారి పని చేసి ఇటీవల గ్రామానికి వచ్చి ఇంటి దగ్గర ఉంటూ బేల్దారి పని చేస్తున్నాడు. వివాహం చేద్దమనుకున్న సమయంలో సరదాగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఓబులకొండారెడ్డి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అదృష్టవంతులు వీరు.. తోటి స్నేహితులతో సరదాగా గడుపుదామని ఈతకు వెళ్లి ఇద్దరు స్నేహితులు కళ్లముందే మృత్యువడికి చేరటం, అదృష్ట వశాత్తు బతికి బయటపడిన ఇళ్లూరి మహేంద్రరెడ్డి, మీనిగ నరేంద్ర, వసంతపురం బాలకృష్ణలు అదృష్టవంతులు.. మహేంద్రరెడ్డి లారి డ్రైవర్‌గా పని చేస్తుండగా, నరేంద్ర బేల్థారి పని చేస్తుంటాడు. బాలకృష్ణ మాత్రం డిగ్రీ చదువుతున్నాడు. తమ కళ్ల ముందే తోటి స్నేహితులు మృతి చెందారని వారు విలపించటం కనిపించింది. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటావుటిన చెక్‌డ్యాం దగ్గరకు వెళ్లారు. లోపల ఉన్న మృత దేహాలను వెళికి తీసేందుకు గ్రామానికి చెందిన ఎదురు కొండారెడ్డి, బాపతు ఎర్రారెడ్డి మరికొంతమంది సాహసించి చెక్‌డ్యాంలోకి దిగారు. లోపల ఉన్న మృతదేహాలను వెళికి తీసి ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాలను గ్రామంలోని మృతుల నివాసాలకు చేర్చారు. ఒకే రోజు గ్రామంలో ఇద్దరు యువకులు మృతి చెందటంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా జరిగిన సంఘటన తెలుసుకున్న కొనకనమిట్ల ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తన సిబ్బందితో గ్రామంలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనపై విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, మృతేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తామని ఎస్ఐ అన్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన టిక్‌టాక్
భీమ్‌గల్: టిక్‌టాక్ మోజు ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పుల్ గ్రామ శివారులో గల కప్పలవాగు పొంగిపొర్లుతోంది. చెక్‌డ్యాం నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేశ్ (22) ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్‌గౌడ్‌తో కలసి శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ముగ్గురు వరద నీటిలోకి దిగి టిక్‌టాక్ వీడియోలు తీసుకున్నారు. అనంతరం చేపలు పట్టారు.తర్వాత ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో స్నేహితులు నీటిలో కొట్టుకుపోసాగారు. ఒడ్డున ఉన్నవారు గమనించి చీరలను విసరడంతో మనోజ్, గంగాజలంను తీసుకొని బయటకు వచ్చాడు. వరదకు ఎదురీదుతూ వాగు మధ్యలోకి వెళ్లిన దినేశ్ గల్లంతయ్యాడు. అతడి కోసం అధికార యంత్రాంగం 24 గంటల నుంచి గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు. ఇంద్రపురం చిన్న గంగారం, లక్ష్మి దంపతుల ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన దినేశ్ బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి 3 నెలల క్రితం తిరిగి వచ్చాడు. నెలరోజుల్లో దుబాయ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘోరం జరిగిపోయింది. -
అట్లేరు.. ఆలకించేదెవరు..?
సాక్షి, కొండపి: ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. ఓ పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పరో పక్క ప్రభుత్వ ప్రోత్సాహం కరువు, చెక్‌డ్యాంల నిర్మాణంపై నిర్లక్ష్యం...వెరసి పంటల సాగు చతికిలబడింది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ తీసుకున్న చర్యలు శూన్యం. ఫలితంగా రైతులు పంటలు పండక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రైతులకు ఎంతో ఉపయోగపడే అట్లేరు వాగు పై చెక్‌డ్యాం నిర్మాణాన్ని గాలికొదిలేశారు. దీంతో సాగుభూములు నీటికి కరువై బీడు భూములుగా తయారయ్యాయి. మహానేత హయాంలో వ్యవసాయం అంటే పండుగ వాతావరణం. ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం..సబ్సిడీలు..ఇలా ఒకటేంటి.. ఏది కావాలంటే అది చేశారు. అందుకే ఆయన పాలనను రైతు రాజ్యమన్నారు. కానీ టీడీపీ పాలన రైతులకు శాపంలా తయారైంది. ఒక్క ప్రాజెక్టు గానీ..ఒక్క చెక్‌డ్యాం గానీ, ఒక్క కాలువ గానీ నిర్మించింది లేదు. ఫలితంగా వ్యవసాయం రంగం కుదేలైంది. ఇలా టీడీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెక్‌డ్యాంలలో అట్లేరు ఒకటి. మహానేత హయాంలో మంజూరైన ఈ చెక్‌డ్యాం నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. ఐదేళ్లలో ఈ చెక్‌డ్యాం నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఎందుకింత నిర్లక్ష్యం.. కొండపి పంచాయతీలోని కొండపి, దాసిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాల మెట్ట భూములు గ్రామానికి ఉత్తరం వైపున అట్లేరు ఒడ్డున విస్తరించి ఉన్నాయి. ఇక్కడి రైతులంతా 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్న కారు రైతులే. ఐదు దశాబ్దాలకు పైగా వర్షం మీద ఆధారపడి మెట్ట పంటలు వేసుకుంటున్నారు. అయితే సరైన వర్షాలు లేక మెట్టపంటలు సైతం పండక రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. ఈ పరిస్థితిల్లో తొలిసారి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అట్లేరు మీద యేటికి అడ్డంగా చెక్ డ్యాం నిర్మించుకుంటే చెక్‌డ్యాంలో నీరు నిలిచి మెట్ట పొలాలకు ఆరుతడులైనా వేసుకోవచ్చని కొండపి పంచాయతీలోని రైతులు కలిసి మాట్లాడుకున్నారు. రైతులు సంఘటితంగా హైదరాబాద్ వెళ్లి సీఎం రాజశేఖర్‌రెడ్డికి తమ పరిస్థితిని విన్నవించుకున్నారు. రైతుల బాధలు ఆలకించిన అప్పటి ముఖ్యమంతి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెక్‌డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.35కోట్లు నిధులు మంజూరు చేశారు. మైనర్ ఇరిగేషన్ శాఖ చెక్‌డ్యాం నిర్మాణం కోసం పనులకు టెండర్ పిలిచింది. హైదరాబాద్‌కి చెందిన దీపిక కన్స్ట్రక్షన్ 2007 చివరిలో పనులు దక్కించుకుంది. అట్లేరు మీద 200 మీటర్ల పొడవుతో చెక్‌డ్యాం పనులు 2008లో ప్రారంభించారు. బాడీవాల్ పనులు, స్పిల్‌వే, చెవులు కట్టే పనులు కాంట్రాక్టర్ రూ.1.40కోట్లకు పనులు పూర్తి చేశారు. కాగా నిర్మాణ వ్యయం పెరగడంతో ఇంజినీరింగ్ శాఖ రూ.2.40కోట్లతో మళ్లీ రివైజ్డ్ ప్రతిపాదనలు తయారు చేసింది. కాగా అందుకు సంబంధించి నిధులు తరువాత మంజూరు కాలేదు. నూతనంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు స్థానిక ఎమ్మెల్యే స్వామి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదు. చెక్‌డ్యాం నిర్మాణం పనులు పూర్తి చేస్తే వైఎస్సార్ సీపీ రైతులు సైతం ప్రయోజనం పొందుతారని గ్రామ టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే స్వామికి చెప్పుడు మాటలు చెప్పటంతో చెక్‌డ్యాం నిర్మాణం పనులు గురించి స్వామి పట్టించుకోలేదు. దీంతో 200 ఎకరాల భూమి పంటలు లేక ఖాళీగా బీడు వారి ఉన్నాయి. ప్రకృతితో పోరాటం చేస్తు రైతులు మెట్ట పైర్లు వేసుకుంటున్నా నిలువునా ఎండిపోతున్నాయి తప్ప ప్రయోజనం లేదు. రైతులు ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పరోక్షంగా వంద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సైతం కూలి పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కొండపిలో రైతులు, కూలీలు పనులు చేసుకుని గ్రామం పచ్చగా పాడి పంటలతో కళకళలాడాలంటే చెక్‌డ్యాం పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణం ఎంతో ఉపయోగం అట్లేరుపై చెక్‌డ్యాం నిర్మాణం రైతులకు చాలా ఉపయోగం. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేశారు. కానీ టీడీపీ హయాంలో ఎమ్మెల్యే స్వామి ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదు. చెక్‌డ్యాం పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. - ఏ కోట్లింగయ్య, కొండపి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి అట్లేరుపై చెక్‌డ్యాం పనులు పూర్తయితే రైతులతో పాటు కూలీలకు ఉపాధి దొరుకుతుంది. కౌలు రైతులే ఇప్పుడు భూములు సాగు చేస్తున్నారు. కూలీలకు సైతం పని దొరికి ఇబ్బంది పడే పని ఉండదు. చెక్‌డ్యాం నిర్మాణం పనులు పూర్తి చేయాలి. - బాలకోటయ్య జీవాలకు సైతం నీరు లేదు ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 200 ఎకరాల పొలంలో ఎక్కడా చుక్క నీరులేదు. జీవాలకు, పశువులకు తాగునీరు లేదు. ఉదయం ఇంటి వద్ద తాగిన నీరు సాయంత్రం ఇంటికి పోయే వరకు జీవాలకు నీరు లేదు. చెక్‌డ్యాం పనులు పూర్తి చేస్తే నీరు నిలిచి పొలాల్లో పశువులకు నీరుకు ఇబ్బంది తీరుతుంది. - దేవరాల రమణయ్య, డీసీపాలెం -
సరిహద్దులో చెక్‌డ్యాం చిచ్చు
► చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్న తమిళ రైతులు ► ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు ► రైతుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేత ► తమిళనాడు, ఆంధ్రా సరిహద్దులో ఘటన పళ్లిపట్టు/శ్రీరంగరాజపురం: కుశస్థలీ నదిపై సరిహద్దు ప్రాం తంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న చెక్‌డ్యాం నిర్మాణాన్ని తమిళ రైతులు అడ్డుకున్నారు. దీంతో చోటుచేసుకున్న ఉద్రిక్తతతో ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి చెక్‌డ్యాం నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. పళ్లిపట్టు సమీపంలోని ఆంధ్రా అటవీ ప్రాంతం నుంచి, కృష్ణాపురం జలాశయం నుంచి నీరు లవ, కుశ కాలువల ద్వారా కుశస్థలి నదిలో కలుస్తుంది. ఈ నీరు పళ్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రజల దాహార్తిని తీర్చుతూ పంట పొలాలకు అందుతోంది. ఈ నీరు ఎస్ఆర్.పురం మండలం పాలసముద్రం నుంచి 4కి.మీ ప్రవహించి తమిళనాడులోని కుశస్థలి నది తీరం మార్గంలో వెలిగరం చెరువుకు చేరుతుంది. ఈ నీటి ద్వారా 10గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 2వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలసముద్రం, నెలవాయి మధ్యలో వెలిగరం కాలువపై నాలుగు ప్రాంతాల్లో చెక్‌డ్యాం పనులు ప్రారంభించింది. చెక్‌డ్యాంలు నిర్మిస్తే పంట పొలాలు బీడుగా మారుతాయనే ఆగ్రహంతో పళ్లిపట్టు మండల మాజీ చైర్మన్ రాజేశ్వరి రవీంద్రనా«థ్ ఆధ్వర్యంలో 4గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది రైతులు మంగళవారం ఉదయం చెక్‌డ్యాం నిర్మాణ పనులు అడ్డుకున్నారు. దీంతో చోటుచేసుకున్న ఉద్రిక్తతతో ఇరు రాష్ట్రాల అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పళ్లిపట్టు తహసీల్దారు వెంకటేశన్, ప్రజాపనులశాఖ అదనపు ఇంజినీర్ వెంకటేశన్, డీఎస్పీ బాలచందర్ అలాగే ఆంధ్రా అధికారులు ఎస్ఆర్.పురం ఎంఆర్ఓ వెంకటలక్ష్మమ్మ, పుత్తూరు డీఎస్పీ నాగభూషణంరావు, కార్వేటినగరం సీఐ మోహన్, ఎస్ఆర్.పురం ఎస్ఐ వాసంతి, పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రైతుల నిరసనతో అధికారులు రెండు రోజుల పాటు చెక్‌డ్యాం నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఇరు రాష్ట్రాల అధికారులు, రైతుల సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అధికా రుల హామీ మేరకు రైతులు ఆందోళన విరమించారు. -
నీటి వృథాకు ‘చెక్’ ఎప్పుడో?
మానేరుపై ఐదు చోట్ల చెక్‌డ్యాంలు.. నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు మంత్రి ఈటల చొరవతో రూ.19కోట్ల నిధులు మంజూరు టెండర్లు పూర్తయినా ప్రారంభం కాని పనులు ఆందోళనలో రైతులు వీణవంక : కరువుతో వేసవిలో వాగులు వట్టిపోయాయి. చుక్క నీరులేక ఏడారిని తలపించాయి. మానేరు తలాపున ఉన్నా తాగునీటికి గోస తప్ప లేదు. వర్షాలు కురిసినప్పుడు కళకళలాడే వాగులున్నా.. ఏడాది తిరగక ముందే నీటి గండం ఏర్పడుతోంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చెక్‌డ్యాంలు నిర్మించాలని మానేరు పరివాహాక ప్రాంత ప్రజలు ఎనిమిది నెలల క్రితం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి వెంటనే చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.19కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వాగుపై ఐదు చోట్ల నిర్మించేందుకు స్థలాలు కూడా గుర్తించారు. అయితే వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మానేరులో నీరంతా వృథాగా పోతోంది. టెండర్లు పూరై్తనా..? చెక్‌డ్యాంల నిర్మాణం ఏడాది లోపు పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గతంలోనే అధికారులను ఆదేశించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేయగా, టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించలేదు. ముగ్గురు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. కల్వల ప్రాజెక్ట్ నుంచి వీణవంక మీదుగా జమ్మికుంట మండలం కోరపల్లి వరకు, మామిడాలపల్లి గ్రామం నుంచి పోతిరెడ్డిపల్లి వరకు మానేరు ప్రవహిస్తోంది. వర్షాలు కురిసినప్పుడు వాగుల్లో నీరంతా వృథాగా పోతోంది. దీంతో వీణవంక, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి, కోర్కల్, పోతిరెడ్డిపల్లి వాగుల వద్ద చెక్‌డ్యాంలు నిర్మిస్తే నీటి కొరతను తీర్చవచ్చునని అధికారులు గుర్తించారు. మానేరు ఆయకట్టు కింద 16 వేల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతోంది. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే 940 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. పనుల్లో జాప్యం జరుగుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. వర్షాకాలం ముగిసే లోపు పనులు ప్రారంభిస్తే ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా టెండర్లు పూర్తయ్యాయని, ఇంకా కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉందని తెలిపారు. రెండు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
చెక్‌డ్యాంలో పడి బాలుడి మృతి
దర్శి: ప్రకాశం జిల్లాలో చెక్‌డ్యాంలో పడి బాలుడు మృతిచెందాడు. దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(10) అనే బాలుడు బహిర్భూమి నిమిత్తం గ్రామశివార్లలో ఉన్న చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు డ్యాంలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న గ్రామస్తులు బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు. బాలుడు మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా): స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈతకెళ్లాడు. అయితే, ఈతకెళ్లిన ఫయాజ్ ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.