-
మానేరుపై ఐదు చోట్ల చెక్‌డ్యాంలు..
-
నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు
-
మంత్రి ఈటల చొరవతో రూ.19కోట్ల నిధులు మంజూరు
-
టెండర్లు పూర్తయినా ప్రారంభం కాని పనులు
-
ఆందోళనలో రైతులు
వీణవంక : కరువుతో వేసవిలో వాగులు వట్టిపోయాయి. చుక్క నీరులేక ఏడారిని తలపించాయి. మానేరు తలాపున ఉన్నా తాగునీటికి గోస తప్ప లేదు. వర్షాలు కురిసినప్పుడు కళకళలాడే వాగులున్నా.. ఏడాది తిరగక ముందే నీటి గండం ఏర్పడుతోంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చెక్‌డ్యాంలు నిర్మించాలని మానేరు పరివాహాక ప్రాంత ప్రజలు ఎనిమిది నెలల క్రితం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి వెంటనే చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.19కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వాగుపై ఐదు చోట్ల నిర్మించేందుకు స్థలాలు కూడా గుర్తించారు. అయితే వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మానేరులో నీరంతా వృథాగా పోతోంది.
టెండర్లు పూరై్తనా..?
చెక్‌డ్యాంల నిర్మాణం ఏడాది లోపు పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గతంలోనే అధికారులను ఆదేశించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేయగా, టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించలేదు. ముగ్గురు కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నట్లు తెలిసింది. కల్వల ప్రాజెక్ట్ నుంచి వీణవంక మీదుగా జమ్మికుంట మండలం కోరపల్లి వరకు, మామిడాలపల్లి గ్రామం నుంచి పోతిరెడ్డిపల్లి వరకు మానేరు ప్రవహిస్తోంది. వర్షాలు కురిసినప్పుడు వాగుల్లో నీరంతా వృథాగా పోతోంది. దీంతో వీణవంక, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి, కోర్కల్, పోతిరెడ్డిపల్లి వాగుల వద్ద చెక్‌డ్యాంలు నిర్మిస్తే నీటి కొరతను తీర్చవచ్చునని అధికారులు గుర్తించారు. మానేరు ఆయకట్టు కింద 16 వేల ఎకరాల వ్యవసాయ భూమి సాగవుతోంది. చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే 940 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. పనుల్లో జాప్యం జరుగుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. వర్షాకాలం ముగిసే లోపు పనులు ప్రారంభిస్తే ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని తగు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా టెండర్లు పూర్తయ్యాయని, ఇంకా కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చేసుకోవాల్సి ఉందని తెలిపారు. రెండు నెలల్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.