అట్లేరు.. ఆలకించేదెవరు..? | Atleru Checkdam Is Not Completed | Sakshi
Sakshi News home page

అట్లేరు.. ఆలకించేదెవరు..?

Published Thu, Apr 4 2019 8:13 AM | Last Updated on Thu, Apr 4 2019 8:13 AM

Atleru Checkdam Is Not Completed - Sakshi

మధ్యలో నిలిచిన అట్లేరు మీద చెక్‌ డ్యాం పనులు

సాక్షి, కొండపి: ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. ఓ పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పరో పక్క ప్రభుత్వ ప్రోత్సాహం కరువు, చెక్‌డ్యాంల నిర్మాణంపై నిర్లక్ష్యం...వెరసి పంటల సాగు చతికిలబడింది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ తీసుకున్న చర్యలు శూన్యం. ఫలితంగా రైతులు పంటలు పండక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రైతులకు ఎంతో ఉపయోగపడే అట్లేరు వాగు పై చెక్‌డ్యాం నిర్మాణాన్ని గాలికొదిలేశారు. దీంతో సాగుభూములు నీటికి కరువై బీడు భూములుగా తయారయ్యాయి. 
మహానేత హయాంలో వ్యవసాయం అంటే పండుగ వాతావరణం. ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం..సబ్సిడీలు..ఇలా ఒకటేంటి.. ఏది కావాలంటే అది చేశారు. అందుకే ఆయన పాలనను రైతు రాజ్యమన్నారు. కానీ టీడీపీ పాలన రైతులకు శాపంలా తయారైంది. ఒక్క ప్రాజెక్టు గానీ..ఒక్క చెక్‌డ్యాం గానీ, ఒక్క కాలువ గానీ నిర్మించింది లేదు. ఫలితంగా వ్యవసాయం రంగం కుదేలైంది. ఇలా టీడీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెక్‌డ్యాంలలో అట్లేరు ఒకటి. మహానేత హయాంలో మంజూరైన ఈ చెక్‌డ్యాం నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. ఐదేళ్లలో ఈ చెక్‌డ్యాం నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.

ఎందుకింత నిర్లక్ష్యం..
కొండపి పంచాయతీలోని కొండపి, దాసిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాల మెట్ట భూములు గ్రామానికి ఉత్తరం వైపున అట్లేరు ఒడ్డున విస్తరించి ఉన్నాయి. ఇక్కడి రైతులంతా 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్న కారు రైతులే. ఐదు దశాబ్దాలకు పైగా వర్షం మీద ఆధారపడి మెట్ట పంటలు వేసుకుంటున్నారు. అయితే సరైన వర్షాలు లేక మెట్టపంటలు సైతం పండక రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. ఈ పరిస్థితిల్లో తొలిసారి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

అట్లేరు మీద యేటికి అడ్డంగా చెక్‌ డ్యాం నిర్మించుకుంటే  చెక్‌డ్యాంలో నీరు నిలిచి మెట్ట  పొలాలకు ఆరుతడులైనా వేసుకోవచ్చని కొండపి పంచాయతీలోని రైతులు కలిసి మాట్లాడుకున్నారు. రైతులు సంఘటితంగా హైదరాబాద్‌ వెళ్లి సీఎం  రాజశేఖర్‌రెడ్డికి తమ పరిస్థితిని విన్నవించుకున్నారు. రైతుల బాధలు ఆలకించిన అప్పటి ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చెక్‌డ్యాం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.35కోట్లు నిధులు మంజూరు చేశారు.  మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ చెక్‌డ్యాం నిర్మాణం కోసం  పనులకు టెండర్‌ పిలిచింది.

హైదరాబాద్‌కి చెందిన దీపిక కన్‌స్ట్రక్షన్‌ 2007 చివరిలో పనులు దక్కించుకుంది. అట్లేరు మీద 200 మీటర్ల పొడవుతో చెక్‌డ్యాం పనులు 2008లో  ప్రారంభించారు. బాడీవాల్‌ పనులు, స్పిల్‌వే, చెవులు కట్టే పనులు కాంట్రాక్టర్‌ రూ.1.40కోట్లకు పనులు పూర్తి చేశారు. కాగా నిర్మాణ వ్యయం పెరగడంతో ఇంజినీరింగ్‌ శాఖ రూ.2.40కోట్లతో మళ్లీ రివైజ్డ్‌ ప్రతిపాదనలు తయారు చేసింది. కాగా అందుకు సంబంధించి నిధులు తరువాత  మంజూరు కాలేదు. నూతనంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు స్థానిక ఎమ్మెల్యే స్వామి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదు.

చెక్‌డ్యాం నిర్మాణం పనులు పూర్తి చేస్తే వైఎస్సార్‌ సీపీ రైతులు సైతం ప్రయోజనం పొందుతారని గ్రామ టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే స్వామికి చెప్పుడు మాటలు చెప్పటంతో  చెక్‌డ్యాం నిర్మాణం పనులు గురించి స్వామి పట్టించుకోలేదు. దీంతో 200 ఎకరాల భూమి పంటలు లేక ఖాళీగా బీడు వారి ఉన్నాయి. ప్రకృతితో పోరాటం చేస్తు రైతులు మెట్ట పైర్లు వేసుకుంటున్నా నిలువునా ఎండిపోతున్నాయి తప్ప ప్రయోజనం లేదు. రైతులు ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పరోక్షంగా వంద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సైతం కూలి పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కొండపిలో రైతులు, కూలీలు పనులు చేసుకుని గ్రామం పచ్చగా పాడి పంటలతో కళకళలాడాలంటే చెక్‌డ్యాం పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చెక్‌డ్యాం నిర్మాణం ఎంతో ఉపయోగం
అట్లేరుపై చెక్‌డ్యాం నిర్మాణం రైతులకు చాలా ఉపయోగం. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేశారు. కానీ టీడీపీ హయాంలో ఎమ్మెల్యే స్వామి ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదు. చెక్‌డ్యాం పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. 
- ఏ కోట్లింగయ్య, కొండపి

నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి
అట్లేరుపై చెక్‌డ్యాం పనులు పూర్తయితే రైతులతో పాటు కూలీలకు ఉపాధి దొరుకుతుంది. కౌలు రైతులే ఇప్పుడు భూములు సాగు చేస్తున్నారు. కూలీలకు సైతం పని దొరికి  ఇబ్బంది పడే పని ఉండదు. చెక్‌డ్యాం నిర్మాణం పనులు పూర్తి చేయాలి. 
- బాలకోటయ్య

జీవాలకు సైతం నీరు లేదు
ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 200 ఎకరాల పొలంలో ఎక్కడా చుక్క నీరులేదు. జీవాలకు, పశువులకు తాగునీరు లేదు. ఉదయం ఇంటి వద్ద తాగిన నీరు సాయంత్రం ఇంటికి పోయే వరకు జీవాలకు నీరు లేదు. చెక్‌డ్యాం పనులు పూర్తి చేస్తే నీరు నిలిచి పొలాల్లో పశువులకు నీరుకు ఇబ్బంది తీరుతుంది. 
- దేవరాల రమణయ్య, డీసీపాలెం 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

మోడు వారుతున్న రైతు వేసిన నిమ్మ చెట్లు

2
2/3

బీళ్ళుగా మారిన రెండు వందల ఎకరాల భూములు

3
3/3

నిలిచిన బాడీవాల్‌ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement