Mla swamy
-
మాటలు ఘనం.. చేతలు శూన్యం
అంతన్నారు..ఇంతన్నారు..అది చేస్తాం..ఇది చేస్తామంటూ ఎన్నో హామీలిచ్చారు. తీరా మళ్లీ ఎన్నికలకు వచ్చే నాటికి ఏం చేశారంటే చేసింది శూన్యం. ఐదేళ్ల టీడీపీ పాలనలో మత్స్యకారుల అభివృద్ధి చేసింది ఏం లేదు. బోట్ ల్యాండింగ్, చేపల మార్కెట్, హేచరీ, రెసిడెన్షియల్ స్కూల్ అంటూ ఎన్నో హామీలిచ్చిన స్థానిక ఎమ్మెల్యే స్వామి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. తమ సమస్యలపై నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఊదరగొట్టే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో వారి కోసం చేసింది శూన్యమనే చెప్పాలి. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్వామి మా గురించి ఏనాడూ పట్టించుకోలేదని స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ ల్యాండింగ్, చేపల హేచరీ ఎక్కడ..? మండలంలోని మత్స్యకారుల కోసం సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో బోట్ ల్యాండింగ్ సదుపాయం, సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపల హేచరీ ఏర్పాటు చేస్తానని సుమారు ఏడాది క్రితం హడావుడి చేశారు. ఈ రెండు పాకల పల్లెపాలెం వద్ద ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే చేపల హేచరీ ఏర్పాటుచేస్తే ఉన్న కాస్త ఇంటిస్థలం హేచరీకి పోతుందని పల్లెపాలెం మత్స్యకారులు హేచరీ ఏర్పాటుకు నిరాకరించారు. అయితే పక్కనే ఉన్నపోతయ్యగారి పట్టపుపాలెం మత్యకారులు ఆ హేచరీ మా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఆ ప్రాంతంలో ఏర్పాటుకు ఎమ్మెల్యే స్వామి పట్టించుకోలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. చివరికి ఈ రెండు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయకుండానే పక్క జిల్లాలకు తరలిపోయాయి. తీవ్ర తాగునీటి ఎద్దడి మత్స్యకార పాలెంలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. సుమారు 6 నెలలుగా పాకల పల్లెపాలెంలోని రక్షిత మంచినీటి పథకం నిరుపయోగంగా ఉంది. వాస్తవానికి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తోలాల్సి ఉన్నా కాంట్రాక్టరు సక్రమంగా సరఫరా చేయడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒక్క ఇంటి పట్టా అయినా ఇచ్చారా..? మత్స్యకారపాలెంలో ఒక్కో ఇంటిలో నాలుగైదు కుటుంబాలు నివాసం ఉంటున్నారు. దీంతో మాకు ఇంటి పట్టా ఇచ్చి పక్కా గృహం కట్టించి ఇవ్వాలని ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ప్రయోజనం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.. అరకొరగా వేట నిషేధ భత్యం.. వేట నిషేధ భత్యం ఇవ్వడంలోనూ అన్యాయం జరుగుతోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మండలంలో సుమారు 1,200 మందికి మాత్రమే వేట నిషేధ భత్యం లభిస్తోంది. వాస్తవానికి చేపల వేటలో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానీ సుమారు 5 వేల మంది వరకు ఆధారపడి ఉన్నారు. కానీ వీరెవరికి వేటనిషేధ భత్యం లభించడం లేదు. చేపల వేటపై ఆధారపడే ప్రతి ఒక్కరికీ వేటనిషేధ భత్యం ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారుల కోసం చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అవి నిర్మాణ దశలో ఉన్నాయే తప్ప ప్రారంభానికి నోచుకోలేదు. పాకల బీచ్‌లో చేపల కేంద్రం నిర్మించినా అది కూడా ప్రారంభానికి నోచుకోలేదు. అంతేకాక బీచ్‌లో మాత్రం సుమారు రూ.4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో రెస్టారెంటు మాత్రం నిర్మిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. శిథిలావస్థలో తుఫాన్ షెల్టర్లు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం తుఫాన్షెల్టర్లను ఏర్పాటు చేసింది. అయితే పాకల పల్లెపాలెం, ఊళ్లపాలెం దేవలం పల్లెపాలెం తుఫానుషెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటి నిర్మాణంపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా 10 ఏళ్ల క్రితం మత్స్యకారపాలెంలో ఏర్పాటు చేసిన తుఫాన్ హెచ్చరికల కేంద్రం నిరుపయోగంగా మారింది. దాని గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. అద్దె భవనంలోనే రెసిడెన్షియల్ స్కూలు.. మత్స్యకారుల పిల్లల కోసం సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో గురుకుల పాఠశాలల తరహాలో వసతి గృహాన్ని నిర్మిస్తామని సుమారు మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే స్వామి వాగ్దానం చేశారు. ఈ వసతి గృహం కోసం అప్పటి తహశీల్దార్ షేక్ దావూద్‌హుస్సేన్ ఉళ్లపాలెం పంచాయతీ పరిధిలోని వడ్డెరకాలనీ పక్కన ఉన్న 9 ఎకరాల స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని అప్పటి కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునరావు కూడా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. వాస్తవానికి గతంలో ఈ స్థలాన్ని ఊళ్లపాలెం గ్రామస్తులకు ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. అయితే వీరికి మరోచోట స్థలం ఇస్తామని చెప్పటంతో పట్టాదారులు అంగీకారం తెలిపారు. అయితే ఈ స్థలంలో నేటికి వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేయలేదు. అయితే ఈ వసతి గృహాన్ని టంగుటూరులో అద్దె భవనంలో ఏర్పాటు చేశానని. త్వరలో శంకుస్థాపన చేస్తానని ఎమ్మెల్యే చెబుతున్నారని మత్స్యకారులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి మండలంలో ఏర్పాటు చేయకుండా టంగుటూరులో ఏర్పాటు చేయడమేంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక టంగుటూరులో ఏర్పాటు చేయడంతో మత్స్యకారుల పిల్లలు 80 శాతం ఉండాల్సి ఉండగా కేవలం 30 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొంటున్నారు. దీనికి తోడు ఈ భవనంలో వసతులు కూడా సక్రమంగా లేవని, అది కూడా కేవలం బాలికలకు మాత్రమే ఏర్పాటు చేశారంటున్నారు. ఒక్క హామీ అమలు చేయలేదు టీడీపీ ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఎటువంటి పథకాలు సక్రమంగా అమలు చేయలేదు. చివరికి మా పిల్లల కోసం శాశ్వత వసతిగృహæం ఏర్పాటు చేస్తామని చెప్పి టంగుటూరులో అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థినులకు పూర్తిస్థాయిలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. - ప్రళయకావేరి రోశయ్య, పాకల పట్టించుకున్న వారు లేరు మా పాలెంలో చేపల హేచరీ ఏర్పాటు చేయాలని కోరాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. కానీ విజ్ఞప్తి పట్టించుకున్న నాథుడు లేడు. చివరికి బాపట్ల ప్రాంతానికి ఈ హేచరీ వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. - వాయిల రమేష్, పోతయ్యగారి పట్టపుపాలెం మత్స్యకారులకు తీవ్ర అన్యాయం టీడీపీ ప్రభుత్వంలో సాంప్రదాయ మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. చేపలు అమ్ముకోవటానికి ఎటువంటి వాహనాలు ఇవ్వలేదు. మాకన్నా ఇతర కులాల వారికి అధిక సంఖ్యలో ఇచ్చారు. ప్రస్తుతం మాకు మోపెడ్లు మంజూరైనా ఎన్నికల కోడ్ అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. వీటిని ఎప్పుడు పంపిణీ చేస్తారో అర్థం కావడం లేదు. - రాసాని కృపారావు, పాకల -
అట్లేరు.. ఆలకించేదెవరు..?
సాక్షి, కొండపి: ఐదేళ్ల టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. ఓ పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పరో పక్క ప్రభుత్వ ప్రోత్సాహం కరువు, చెక్‌డ్యాంల నిర్మాణంపై నిర్లక్ష్యం...వెరసి పంటల సాగు చతికిలబడింది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ తీసుకున్న చర్యలు శూన్యం. ఫలితంగా రైతులు పంటలు పండక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రైతులకు ఎంతో ఉపయోగపడే అట్లేరు వాగు పై చెక్‌డ్యాం నిర్మాణాన్ని గాలికొదిలేశారు. దీంతో సాగుభూములు నీటికి కరువై బీడు భూములుగా తయారయ్యాయి. మహానేత హయాంలో వ్యవసాయం అంటే పండుగ వాతావరణం. ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, చెక్‌డ్యాంల నిర్మాణం..సబ్సిడీలు..ఇలా ఒకటేంటి.. ఏది కావాలంటే అది చేశారు. అందుకే ఆయన పాలనను రైతు రాజ్యమన్నారు. కానీ టీడీపీ పాలన రైతులకు శాపంలా తయారైంది. ఒక్క ప్రాజెక్టు గానీ..ఒక్క చెక్‌డ్యాం గానీ, ఒక్క కాలువ గానీ నిర్మించింది లేదు. ఫలితంగా వ్యవసాయం రంగం కుదేలైంది. ఇలా టీడీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెక్‌డ్యాంలలో అట్లేరు ఒకటి. మహానేత హయాంలో మంజూరైన ఈ చెక్‌డ్యాం నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. ఐదేళ్లలో ఈ చెక్‌డ్యాం నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. ఎందుకింత నిర్లక్ష్యం.. కొండపి పంచాయతీలోని కొండపి, దాసిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాల మెట్ట భూములు గ్రామానికి ఉత్తరం వైపున అట్లేరు ఒడ్డున విస్తరించి ఉన్నాయి. ఇక్కడి రైతులంతా 5 ఎకరాల లోపు ఉన్న సన్న, చిన్న కారు రైతులే. ఐదు దశాబ్దాలకు పైగా వర్షం మీద ఆధారపడి మెట్ట పంటలు వేసుకుంటున్నారు. అయితే సరైన వర్షాలు లేక మెట్టపంటలు సైతం పండక రైతులు నష్టాల ఊబిలో కూరుకపోయారు. ఈ పరిస్థితిల్లో తొలిసారి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అట్లేరు మీద యేటికి అడ్డంగా చెక్ డ్యాం నిర్మించుకుంటే చెక్‌డ్యాంలో నీరు నిలిచి మెట్ట పొలాలకు ఆరుతడులైనా వేసుకోవచ్చని కొండపి పంచాయతీలోని రైతులు కలిసి మాట్లాడుకున్నారు. రైతులు సంఘటితంగా హైదరాబాద్ వెళ్లి సీఎం రాజశేఖర్‌రెడ్డికి తమ పరిస్థితిని విన్నవించుకున్నారు. రైతుల బాధలు ఆలకించిన అప్పటి ముఖ్యమంతి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెక్‌డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.1.35కోట్లు నిధులు మంజూరు చేశారు. మైనర్ ఇరిగేషన్ శాఖ చెక్‌డ్యాం నిర్మాణం కోసం పనులకు టెండర్ పిలిచింది. హైదరాబాద్‌కి చెందిన దీపిక కన్స్ట్రక్షన్ 2007 చివరిలో పనులు దక్కించుకుంది. అట్లేరు మీద 200 మీటర్ల పొడవుతో చెక్‌డ్యాం పనులు 2008లో ప్రారంభించారు. బాడీవాల్ పనులు, స్పిల్‌వే, చెవులు కట్టే పనులు కాంట్రాక్టర్ రూ.1.40కోట్లకు పనులు పూర్తి చేశారు. కాగా నిర్మాణ వ్యయం పెరగడంతో ఇంజినీరింగ్ శాఖ రూ.2.40కోట్లతో మళ్లీ రివైజ్డ్ ప్రతిపాదనలు తయారు చేసింది. కాగా అందుకు సంబంధించి నిధులు తరువాత మంజూరు కాలేదు. నూతనంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు స్థానిక ఎమ్మెల్యే స్వామి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదు. చెక్‌డ్యాం నిర్మాణం పనులు పూర్తి చేస్తే వైఎస్సార్ సీపీ రైతులు సైతం ప్రయోజనం పొందుతారని గ్రామ టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే స్వామికి చెప్పుడు మాటలు చెప్పటంతో చెక్‌డ్యాం నిర్మాణం పనులు గురించి స్వామి పట్టించుకోలేదు. దీంతో 200 ఎకరాల భూమి పంటలు లేక ఖాళీగా బీడు వారి ఉన్నాయి. ప్రకృతితో పోరాటం చేస్తు రైతులు మెట్ట పైర్లు వేసుకుంటున్నా నిలువునా ఎండిపోతున్నాయి తప్ప ప్రయోజనం లేదు. రైతులు ఏటికేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పరోక్షంగా వంద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సైతం కూలి పనులు దొరక్క ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కొండపిలో రైతులు, కూలీలు పనులు చేసుకుని గ్రామం పచ్చగా పాడి పంటలతో కళకళలాడాలంటే చెక్‌డ్యాం పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చెక్‌డ్యాం నిర్మాణం ఎంతో ఉపయోగం అట్లేరుపై చెక్‌డ్యాం నిర్మాణం రైతులకు చాలా ఉపయోగం. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేశారు. కానీ టీడీపీ హయాంలో ఎమ్మెల్యే స్వామి ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం లేదు. చెక్‌డ్యాం పనులు పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. - ఏ కోట్లింగయ్య, కొండపి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి అట్లేరుపై చెక్‌డ్యాం పనులు పూర్తయితే రైతులతో పాటు కూలీలకు ఉపాధి దొరుకుతుంది. కౌలు రైతులే ఇప్పుడు భూములు సాగు చేస్తున్నారు. కూలీలకు సైతం పని దొరికి ఇబ్బంది పడే పని ఉండదు. చెక్‌డ్యాం నిర్మాణం పనులు పూర్తి చేయాలి. - బాలకోటయ్య జీవాలకు సైతం నీరు లేదు ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 200 ఎకరాల పొలంలో ఎక్కడా చుక్క నీరులేదు. జీవాలకు, పశువులకు తాగునీరు లేదు. ఉదయం ఇంటి వద్ద తాగిన నీరు సాయంత్రం ఇంటికి పోయే వరకు జీవాలకు నీరు లేదు. చెక్‌డ్యాం పనులు పూర్తి చేస్తే నీరు నిలిచి పొలాల్లో పశువులకు నీరుకు ఇబ్బంది తీరుతుంది. - దేవరాల రమణయ్య, డీసీపాలెం -
రోడ్డేస్తూ.. నిధులు నొక్కేస్తూ..
సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): రూపాయి..రెండు రూపాయలు కాదు..ఏకంగా రూ.80 లక్షలు..అందులో రూ.40 లక్షలు దాతలు ఇచ్చినవి.. మరో రూ.40 లక్షలు రూర్బన్ నిధులు. ఆ డబ్బులతో ఏం చేస్తున్నారో..ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆ పనులకు ఓ పద్ధతి పాడు ఉండదు. ఇక నాణ్యత అనేది బూతద్దం వేసి వెతికినా కనిపించదు. కాంట్రాక్టర్ ఏం చేసినా ఎవ్వరూ అడ్డుచెప్పరు. పనులను పర్యవేక్షించే అధికారులు లేరు..బాధ్యత వహించే ప్రజాప్రతినిధులు కనిపించరు. సింగరాయకొండలో జాతీయ రహదారిని దాతల సహాయంతో స్మార్ట్ రోడ్డుగా నిర్మించేందుకు సుమారు రూ.40 లక్షలకుపైగా నిధులు వసూలు చేశారు. ఆ నగదుతో రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయకుండానే అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు రూర్బన్ పథకం కింద సుమారు రూ.40 లక్షలు నిధులు మంజూరు చేయించి అదే రోడ్డును తారుతో వెడల్పు చేయడంతో పాటు, మధ్యలో డివైడర్‌ను నిర్మిస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో కమీషన్ల కారణంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో..? మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాతల సహాయంతో గ్రామాల్లో స్మార్ట్ రోడ్లు నిర్మించి ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి స్థానికంగా ఉన్న జాతీయరహదారిని వెడల్పు చేయడంతో పాటు మధ్యలో డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు సుమారు రూ.40 లక్షల అవసరమవుతుందని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రకారం మండలంలోని ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, దాతల నుంచి నిధులు సమీకరించే పనిచేపట్టారు. ఓ పక్క నిధులు సమీకరిస్తూనే మరో పక్క రోడ్డు పనులు చేపట్టారు. నిధులు సేకరణ పూర్తయినా రోడ్డు మాత్రం ఇరువైపులా తవ్వి కంకర వేసి రోలింగ్ చేసి వదిలేశారు. ఇప్పుడు మరలా అదే రోడ్డుకు మరల రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో సుమారు 1.20 కిలోమీటర్ల దూరం స్టేట్ బ్యాంకు దగ్గర నుంచి పాకల రోడ్డు వరకు ఇరువైపులా తారురోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. ఇటీవల టెండర్లు వేసిన కాంట్రాక్టరు పనులు ప్రారంభించాడు. అయితే రోడ్డు వెడల్పుకు రూ.18 లక్షలు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.22 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా డివైడర్ నిర్మాణం.. డివైడర్ నిర్మాణంపై కూడా ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ నిర్మించే చోట గతంలో ఉన్న రోడ్డును పూర్తిగా తొలగించాల్సి ఉంది. అప్పుడే డివైడర్ మధ్యలో మొక్కలు వేసినపుడు అవి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రైల్వేస్టేషన్ రోడ్డులో వేసినట్లు రోడ్డు తొలగించకుండానే డివైడర్ నిర్మిస్తుండటాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పు చేయటంతో లారీల వంటి వాహనాలను రోడ్డు పై నిలుపుతున్నారని, దీనికి తోడు డివైడర్ కారణంగా రోడ్డు కుదించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు అధికారుల పనితీరును విమర్శిస్తున్నారు. నాసిరకంగా అభివృద్ధి పనులు.. ఎట్టకేలకు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారని అందరు ఆనందపడ్డారు. అయితే వీరి ఆశలు అడియాశలయ్యాయి. వాస్తవానికి మొదట రోడ్డు మార్జిన్లో ఉన్న కరెంటు స్తంభాలను, విద్యుత్ ట్రాన్స్‌ఫారాలను తొలగించి దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ తరువాతే రోడ్డు పనులు ప్రారంభించాలి. కానీ అవేమి చేయకుండా రోడ్డు పనులు చేపట్టారు. దీంతో అజాగ్రత్తగా ఉంటే విద్యుత్ ట్రాన్స్‌ఫారాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభించగా..మొదట జేసీబీతో రోడ్డును తవ్విన తర్వాత క్యూరింగ్ చేయకుండా తూతూ మంత్రంగా రోలింగ్ చేసి వదిలేశారు. తరువాత ఒకటిన్నర నెలల తరువాత రోడ్డు మార్జిన్లలో ఉన్న మట్టి పైనే నీటితో నామమాత్రంగా క్యూరింగ్ చేసి తరువాత తారు చల్లి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన తారులో నాణ్యత లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేసిన తరువాత రోజే తారు లేచిపోతుందని మోటార్‌సైకిల్ స్టాండ్ వేస్తేనే గుంటలు పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాక రోడ్డు నిర్మాణం కూడా ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో సిమెంట్ రోడ్డు కన్నా తారు రోడ్డు ఎత్తుగా ఉంటుందని, దీంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు రోడ్డు పై నిలిచి రోడ్డు ధ్వంసమయ్యే అవకాశ ముందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పనులు అధ్వానంగా ఉన్నాయి జాతీయరహదారి అభివృద్ధి పనులు అధ్వాన్నంగా ఉన్నాయి. నాసిరకం తారు వాడుతున్నారు. దీన్ని ఎవ్వరూ పట్టించుఐకోవడం లేదు. దీనికి తోడు మార్జిన్లో వేసే రోడ్డు ఎత్తుగా ఉంది. దీంతో చిన్న వర్షానికి కూడా రోడ్డు పై నీరు నిలిచి రోడ్డు పాడయ్యే అవకాశం ఉంది. - తెనాలి రామస్వామి, సింగరాయకొండ నాణ్యత లోపించింది జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. కొత్తగా వేసిన రోడ్డుపై మోటారుసైకిల్ స్టాండు వేస్తేనే గుంట పడుతుంది. రోడ్డు మార్జిన్లలోని విద్యుత్ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డు ఎన్నికల కోసం వేస్తున్న రోడ్డులాగా ఉంది తప్ప ప్రజలకొరకు వేస్తున్న రోడ్డులా లేదు. - షేక్ లియాఖత్, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్, సింగరాయకొండ -
ఈ సారైనా నాకు ఓటేయండి!
సుంకిరెడ్డిపాలెం(పొన్నలూరు): మీ గ్రామంలో అభివృద్ధి పనులు చేశాను. గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదు కనీసం ఈ సారైన నాకు ఓట్లు వేయండని ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి గ్రామస్తులకు విన్నవించారు. మండలంలోని సుంకిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటికైన మీరు మారి ఈ సారైన నాకు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే పలుమార్లు గత ఎన్నికల్లో మీరు నాకు ఓట్లు వేయలేదని అనడంతో అవాక్కైన గ్రామస్తులు మీరు దగ్గరుడి చూసినట్లు పదే పదే నాకు ఓటు వేయలేదంటున్నారేమిటని ప్రశ్నించారు. స్థానిక సర్పంచ్ వరికూటి బ్రహ్మారెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరైన అభివృద్ధి పనులను తనను చేయనివ్వకుండా పక్క గ్రామాలకు చెందిన అధికారపార్టీ నాయకులతో చేయించడం ఏమిటంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ మట్టి తోలించి బిల్లులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్యక్రమంలో కందుకూరు డీఎస్పీ ప్రకాశరావు, ప్రత్యేక అధికారి ఉమాదేవి, ఎంపీపీ వీరకుమారి, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ మహ్మద్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
కొండపి ఎమ్మెల్యే స్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఎమ్మెల్యే కారు స్వల్ప గాయాలతో బయటపడిన ఎమ్మెల్యే కారులో ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు ఒంగోలు క్రైం : కొండపి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామికి నగరానికి సమీపంలోని చెర్వుకొమ్ముపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ప్రమాదం త్రుటిలో తప్పింది. వేగంగా వస్తున్న ఎమ్మెల్యే కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. కారులోని బెలూన్లు ఓపెన్ కావటంతో పెను ప్రమాదం నుంచి ఎమ్మెల్యే బయట పడగలిగారు. ఎమ్మెల్యే స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ముఖం మీద దవడ ఎముక స్వల్పంగా దెబ్బతింది. హుటాహుటిన మరో కారులో చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. టంగుటూరు నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఒంగోలు వస్తుండగా ప్రమాదం జరిగింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంగా వస్తున్న ఎమ్మెల్యే కారు బలంగా లారీని ఢీకొంది. చెరువుకొమ్ముపాలెం జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీకి ఓ ఆటో అడ్డం వచ్చింది. దీంతో లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఆ వెనుకే వస్తున్న ఎమ్మెల్యే కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎమ్మెల్యే స్వామి ముందు సీట్లో కూర్చొని ఉన్నారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు గన్మన్లు ఉన్నారు. కారులో ఉన్న మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పలువురు అధికారులు, నాయకులు వైద్యశాలకు వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.