రోడ్డేస్తూ.. నిధులు నొక్కేస్తూ.. | Disruption In Road Construction In Singarayakonda | Sakshi
Sakshi News home page

రోడ్డేస్తూ.. నిధులు నొక్కేస్తూ..

Published Wed, Mar 20 2019 9:41 AM | Last Updated on Wed, Mar 20 2019 9:41 AM

Disruption In Road Construction In Singarayakonda - Sakshi

జేసీబీతో రోడ్డు తొలగిస్తున్న దృశ్యం

సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): రూపాయి..రెండు రూపాయలు కాదు..ఏకంగా రూ.80 లక్షలు..అందులో రూ.40 లక్షలు దాతలు ఇచ్చినవి.. మరో రూ.40 లక్షలు రూర్బన్‌ నిధులు. ఆ డబ్బులతో ఏం చేస్తున్నారో..ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆ పనులకు ఓ పద్ధతి పాడు ఉండదు. ఇక నాణ్యత అనేది బూతద్దం వేసి వెతికినా కనిపించదు. కాంట్రాక్టర్‌ ఏం చేసినా ఎవ్వరూ అడ్డుచెప్పరు. పనులను పర్యవేక్షించే అధికారులు లేరు..బాధ్యత వహించే ప్రజాప్రతినిధులు కనిపించరు.

సింగరాయకొండలో జాతీయ రహదారిని దాతల సహాయంతో స్మార్ట్‌ రోడ్డుగా నిర్మించేందుకు సుమారు రూ.40 లక్షలకుపైగా నిధులు వసూలు చేశారు. ఆ నగదుతో రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయకుండానే అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు రూర్బన్‌ పథకం కింద సుమారు రూ.40 లక్షలు నిధులు మంజూరు చేయించి అదే రోడ్డును తారుతో వెడల్పు చేయడంతో పాటు, మధ్యలో డివైడర్‌ను నిర్మిస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో కమీషన్ల కారణంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆ నిధులు ఏమయ్యాయో..?
మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాతల సహాయంతో గ్రామాల్లో స్మార్ట్‌ రోడ్లు నిర్మించి ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి స్థానికంగా ఉన్న జాతీయరహదారిని వెడల్పు చేయడంతో పాటు మధ్యలో డివైడర్‌ నిర్మించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు సుమారు రూ.40 లక్షల అవసరమవుతుందని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రకారం మండలంలోని ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, దాతల నుంచి నిధులు సమీకరించే పనిచేపట్టారు. ఓ పక్క నిధులు సమీకరిస్తూనే మరో పక్క రోడ్డు పనులు చేపట్టారు. నిధులు సేకరణ పూర్తయినా రోడ్డు మాత్రం ఇరువైపులా తవ్వి కంకర వేసి రోలింగ్‌ చేసి వదిలేశారు. ఇప్పుడు మరలా అదే రోడ్డుకు మరల రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో సుమారు 1.20 కిలోమీటర్ల దూరం స్టేట్‌ బ్యాంకు దగ్గర నుంచి పాకల రోడ్డు వరకు ఇరువైపులా తారురోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. ఇటీవల టెండర్లు వేసిన కాంట్రాక్టరు పనులు ప్రారంభించాడు. అయితే రోడ్డు వెడల్పుకు రూ.18 లక్షలు, డివైడర్, సెంట్రల్‌ లైటింగ్‌కు రూ.22 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.

ఇష్టారాజ్యంగా డివైడర్‌ నిర్మాణం..
డివైడర్‌ నిర్మాణంపై కూడా ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డివైడర్‌ నిర్మించే చోట గతంలో ఉన్న రోడ్డును పూర్తిగా తొలగించాల్సి ఉంది. అప్పుడే డివైడర్‌ మధ్యలో మొక్కలు వేసినపుడు అవి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రైల్వేస్టేషన్‌ రోడ్డులో వేసినట్లు రోడ్డు తొలగించకుండానే డివైడర్‌ నిర్మిస్తుండటాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక విద్యుత్‌ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పు చేయటంతో లారీల వంటి వాహనాలను రోడ్డు పై నిలుపుతున్నారని, దీనికి తోడు డివైడర్‌ కారణంగా రోడ్డు కుదించుకుపోయి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు అధికారుల పనితీరును విమర్శిస్తున్నారు.

నాసిరకంగా అభివృద్ధి పనులు.. 
ఎట్టకేలకు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారని అందరు ఆనందపడ్డారు. అయితే వీరి ఆశలు అడియాశలయ్యాయి. వాస్తవానికి మొదట రోడ్డు మార్జిన్లో ఉన్న కరెంటు స్తంభాలను, విద్యుత్‌ ట్రాన్స్‌ఫారాలను తొలగించి దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ తరువాతే రోడ్డు పనులు ప్రారంభించాలి. కానీ అవేమి చేయకుండా రోడ్డు పనులు చేపట్టారు. దీంతో అజాగ్రత్తగా ఉంటే విద్యుత్‌ ట్రాన్స్‌ఫారాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో పనులు ప్రారంభించగా..మొదట జేసీబీతో రోడ్డును తవ్విన తర్వాత క్యూరింగ్‌ చేయకుండా తూతూ మంత్రంగా రోలింగ్‌ చేసి వదిలేశారు. తరువాత ఒకటిన్నర నెలల తరువాత రోడ్డు మార్జిన్లలో ఉన్న మట్టి పైనే నీటితో నామమాత్రంగా క్యూరింగ్‌ చేసి తరువాత తారు చల్లి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన తారులో నాణ్యత లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేసిన తరువాత రోజే తారు లేచిపోతుందని మోటార్‌సైకిల్‌ స్టాండ్‌ వేస్తేనే గుంటలు పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాక రోడ్డు నిర్మాణం కూడా ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో సిమెంట్‌ రోడ్డు కన్నా తారు రోడ్డు ఎత్తుగా ఉంటుందని, దీంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు రోడ్డు పై నిలిచి రోడ్డు ధ్వంసమయ్యే అవకాశ ముందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పనులు అధ్వానంగా ఉన్నాయి 
జాతీయరహదారి అభివృద్ధి  పనులు అధ్వాన్నంగా ఉన్నాయి. నాసిరకం తారు వాడుతున్నారు. దీన్ని ఎవ్వరూ పట్టించుఐకోవడం లేదు. దీనికి తోడు మార్జిన్లో వేసే రోడ్డు ఎత్తుగా ఉంది. దీంతో చిన్న వర్షానికి కూడా రోడ్డు పై నీరు నిలిచి రోడ్డు పాడయ్యే అవకాశం ఉంది.
- తెనాలి రామస్వామి, సింగరాయకొండ

నాణ్యత లోపించింది
జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. కొత్తగా వేసిన రోడ్డుపై మోటారుసైకిల్‌ స్టాండు వేస్తేనే గుంట పడుతుంది. రోడ్డు మార్జిన్లలోని విద్యుత్‌ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డు ఎన్నికల కోసం వేస్తున్న రోడ్డులాగా ఉంది తప్ప ప్రజలకొరకు వేస్తున్న రోడ్డులా లేదు.
- షేక్‌ లియాఖత్, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్, సింగరాయకొండ

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

రోడ్డు మార్జిన్లలో తారు పోసి రోలింగ్‌ చేస్తున్న దృశ్యం

2
2/3

రోడ్డు తొలగించకుండానే డివైడర్‌ నిర్మిస్తున్న దృశ్యం

3
3/3

రోడ్డు మార్జిన్లలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫారాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement