- మండ్య జిల్లాలో నిరసనలు
సాక్షి ప్రతినిధి/బెంగళూరు/మండ్య : మండ్య జిల్లాలోని కృష్ణరాజ సాగర (కేఆర్‌ఎస్) జలాశయంలో నీటి మట్టం దారుణంగా పడిపోయిన పరిస్థితుల్లో కూడా తమిళనాడుకు వదిలే నీటి పరిమాణాన్ని పెంచడంపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. గత మూడు రోజులుగా కొడగు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా కేఆర్‌ఎస్‌లో ఇన్‌ఫ్లో 20,106 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచే అధికారులు 8,052 క్యూసెక్కులను విడుదల చేయడం ప్రారంభించారు.
జలాశయం నిండడానికి ముందే ఇలా నీటిని విడుదల చేయడంపై రైతులు మండిపడుతున్నారు. పంటలు కాపాడుకోవడానికి విశ్వేశ్వరయ్య కాలువకు నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపట్టినా, కాలువల ఆధునికీకరణ పేరిట జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. తమిళనాడుకు నీటి విడుదలను నిరసిస్తూ కేఆర్‌ఎస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నీటి విడుదల విషయం తెలిసిన వెంటనే రైతు సంఘం కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద గుమికూడారు. కొద్ది సేపు రాస్తా రోకో నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్య, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పెరుగుతున్న నీటి మట్టం
కేరళలోని వైనాడులో భారీ వర్షాల కారణంగా మైసూరు జిల్లాలోని కబిని జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. గరిష్ట నీటి మట్టం 2,284 అడుగులు కాగా ప్రస్తుతం 2,279 అడుగులకు చేరుకుంది. జలాశయం దాదాపుగా నిండిపోతున్నందున, నదిలోకి వదిలే నీటి పరిమాణాన్ని పెంచారు.
అయితే జలాశయం నుంచి అధికంగా నీటిని విడుదల చేయడం లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కేఆర్‌ఎస్, కబిని ఆయకట్టు రైతులు జలాశయాలు నిండుతాయనే ఆశతో చెరకు, వరి, రాగి, పంటలను పెట్టారు. నైరుతి రుతు పవనాలు ఆలస్యమవడంతో పంటలను కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమిళనాడుకు నీటిని విడుదల చేయడంపై రైతుల గుండెలు మండిపోతున్నాయి. కాగా కేఆర్‌ఎస్ జలాశయంలో గరిష్ట నీటి మట్టం 124.80 అడుగులు కాగా ప్రస్తుతం 86.65 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.