-స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ అధ్యక్షుడు యేగేంద్రయాదవ్
మాగనూర్ (మహబూబ్‌నగర్ జిల్లా): రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాలతో పాటూ సమాజం కూడా బాధ్యత వహించాలని స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ అధ్యక్షుడు యేగేంద్రయాదవ్ అన్నారు. దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల ఘటనలపై, వర్షాభావ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక బృందం శనివారం మాగనూర్ మండలంలో పర్యటించింది. ఈ సందర్భంగా మండలంలోని గురావ్ లింగంపల్లి గ్రామంలో గత నెల 18న ఎల్లప్ప అనే రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్వరాజ్ అభియాన్, జైకిసాన్ ఆందోళన్ అధ్యక్షుడు యేగేంద్రయాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ జయంతి రోజున ఈ యాత్రను ప్రారంభించామన్నారు. మొదట కర్ణాటకలో పరిశీలించి తర్వాత తెలంగాణకు వచ్చామన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాలతో పాటూ, సమాజం కూడ బాధ్యత వహించాలని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి సారిగా రైతుల పక్షాన ఉండి, రైతు ఆత్మహత్యల కుటుంబాలకు పరిహారం ప్రకటించడం గర్వకారణమన్నారు. ఈ యాత్ర మహబూబ్‌నగర్ తో పాటూ, రంగారెడ్డి, మెదక్, నిజామ్‌బాద్ జిల్లాలో రెండు రోజుల పాటూ కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్ర పూర్తి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు తెలిపారు.
'ఆత్మహత్యల పై సమాజం కూడా బాధ్యత వహించాలి'
Published Sat, Oct 3 2015 3:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement