ఏమాత్రం రాజకీయ సంకల్పం లేకపోతే ఇలాగే ఉంటుంది. ఈ బడ్జెట్ రైతులకు ఎంతో కొంత మేలు చేస్తుందని ఎదురుచూసినవారికి దింపుడు కళ్లం ఆశలే మిగిలాయి. ఇలా ఆశ పెట్టుకోవడానికి కారణాలు లేకపోలేదు. అందులో మొదటిది– వ్యవసాయం పరిస్థితి ఎంతమాత్రం ఆశాజనకంగా లేదన్న వాస్తవాన్ని ఆర్థిక సర్వే గుర్తించింది. ఈ పరిస్థితితో సేద్యం భవిష్యత్తు మరింత క్లిష్టతరం కాగలదని కూడా సర్వే అంగీకరించింది. రెండు– గడచిన ఆరు మాసాలుగా దేశంలో పలుచోట్ల రైతాంగ ఆందోళనలు మిన్నంటు తున్నాయి. ఇది రైతుల ఆగ్రహాన్ని ప్రతిబింబించే పరిణామమే. మూడు– గ్రామీణ ప్రాంతాలవారు అసంతృప్తికి లోనైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ బడ్జెట్ పరిగణనలోనికి తీసుకుంటుందని అంతా ఆశ పడ్డారు. పోనీ ఇవేమీ కాకున్నా, వచ్చే ఎన్నికల కోసమైనా తాజా బడ్జెట్ రైతులు కంటున్న కొన్ని కలలను నెరవేరుస్తుందని అంతా ఎదురుచూశారు.
ఇలాంటి ఎదురుచూపులకు ఇంకొన్ని కారణాలు కూడా దోహదం చేశాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భవంతార్ యోజన’ పథ కాన్ని దేశ వ్యాప్తంగా విస్తరిస్తారని చాలా నివేదికలు వెల్లడించాయి. కేంద్ర, రాష్ట్రాల మద్దతుతో ‘మార్కెట్ జోక్యం కలిగిన పథకం’ అమలు చేస్తారని కూడా నివేదికలు వచ్చాయి. బేషరతుగా లేదా పాక్షికంగా రుణమాపీ పథ కాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని కూడా చాలామంది ఆశించారు. సేద్యానికి అయిన వ్యయానికి యాభయ్ శాతం కలిపి, దిగుబడులకు హామీగా ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుందని కూడా చాలామంది భావించారు. నిజానికి ఇలాంటి ధరల హామీ బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. అంతేకాకుండా చాలాకాలం నుంచి ఈ హామీని ఎటూ తేల్చకుండా ఉంచింది.
దీనికే ఇప్పుడు మోక్షం వస్తుందని ఆశించారు. ఇన్ని అంశాల గురించి ఎదురు చూసినప్పటికీ అందులో ఒక్కటి కూడా సంతృప్తికరంగా లేదు. ఈ బడ్జెట్‌కు మనం పది మార్కులు వేయాలని నిర్ణయించారు. అయితే ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ముగించాక ఎన్ని మార్కులు సాధించారో మనకే అర్థం కాలేదు. నాలుగు అంశాలు భారత రైతాంగానికి ఎంతో కీలకమైనవి. అయినా కూడా వాటి గురించిన ప్రస్తావనే లేదు. అవి– బీమా, పంటలకు నష్ట పరిహారం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాగు నీటి వ్యవస్థ. మొత్తం బడ్జెట్‌లో జరిగిన కేటాయింపులను గమనించిన తరు వాత ఆ నాలుగు అంశాలను ఆర్థికమంత్రి ప్రస్తావించలేదన్న సంగతి తెలు స్తుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చట్టబద్ధంగా కనీసం జరగవలసిన కేటాయింపు మొత్తం రూ. 80,000 కోట్లు. ఇక పంటల నష్టపరిహారం, సాగునీటి వ్యవస్థలకు జరిగే కేటాయింపులు మామూలే. అలాగే ప్రధాని ఫసల్ బీమా యోజన అంత ప్రోత్సాహకరంగా లేదు.
మొత్తంగా సేద్యానికి కేటాయించిన బడ్జెట్‌లో 13 శాతం పెరిగింది. మొత్తం బడ్జెట్‌లో కూడా సేద్యం వాటా అంతే. అయితే ఈ పెంపు రైతాం గానికి ఏ విధంగా ఊతం ఇవ్వగలదు? మత్స్య, పశుసంవర్థక శాఖకు, గ్రామీణ మండీల మెరుగుదలకు ప్రకటించిన సానుకూల చర్యలు మేలు చేకూర్చే ఆలోచనే. అయితే మిగిలిన రంగాలకు ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో చూస్తే ఇది తక్కువ. నిజం చెప్పాలంటే భారతీయ రైతాంగం కోరుకుంటున్న చేయూత ఈ స్థాయిలోది కాదు. గడచిన ఏడెనిమిది మాసాలుగా భారతీయ రైతాంగం ఆందోళనలు చేస్తూ, సంఘర్షించడానికి వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావా లనీ, రుణ బాధ నుంచి విముక్తం కావాలనీ వారు కోరుకుంటున్నారు. సరిగ్గా ఈ విషయంలోనే రైతాంగం మనసును తాజా బడ్జెట్ తీవ్రంగా గాయపరి చింది. పూర్తిస్థాయిలో లేదా పాక్షికంగా గానీ, షరతులతో కూడిన లేదా బేష రతుగా గానీ రుణ మాఫీ గురించి ఈ బడ్జెట్‌లో ప్రకటించలేదు. బ్యాంకుల ద్వారా కార్పొరేట్ సంస్థలకు, చిన్న పరిశ్రమలకు రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం రైతుల విషయంలో మాత్రం అలాంటి ఔదార్యం చూపకపోవ డంతో వారి మనోభావాలు తీవ్రస్థాయిలో గాయపడినాయి.
రైతులను పెద్దగా నిరాశపరిచిన మరొక అంశం– దిగుబడుల ధరల గురించి ప్రభుత్వం చేసిన అట్టహాసపు ప్రకటన. సేద్యపు ఖర్చులు + 50 శాతం కలిపి రైతులకు భరోసాగా ధర నిర్ణయిస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో చేసిన ప్రకటనను నెరవేరుస్తున్నట్టుగానే పటాటోపంగా ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు. కానీ ఈ ప్రకటనలో అంత పస లేదని ఆర్థిక మంత్రికి కూడా బాగా తెలుసు. నిజానికి సేద్యపు వ్యయం + 50 శాతం అనే సూత్రాన్ని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించింది. దీని స్వరూపం గురించి ఆ కమిషన్ ఎలాంటి శషభిషలు లేకుండా వివరించింది కూడా. ఇక్కడ వ్యయం అంటే సమగ్ర వ్యయం. అంటే, చెల్లించిన మొత్తం, కుటుం బం అందించిన శ్రమ, కౌలు అద్దె, కౌలు వడ్డీ. సాంకేతిక పరిభాషలో దీనినే సీ2 అంటారు.
అలాగే రైతులు కనీస మద్దతు ధరను ఎలా పొందగలరు అన్న కీలక ప్రశ్న జోలికి కూడా ఆర్థికమంత్రి వెళ్లలేదు. మొత్తంగా గమనిస్తే ఈ బడ్జెట్ ఇస్తున్న సందేశం సుస్పష్టమే. రైతుల దయనీయ స్థితిని ఈ ప్రభుత్వం పట్టించుకోదు. అలాంటి ఉద్దేశం కూడా లేదు. రైతులకు ఎటువంటి మేలు చేయకున్నా వారి ఓట్లు తమకే దక్కుతాయన్న ధోరణిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతుల కోణం నుంచి ఈ బడ్జెట్‌ను పరిశీలిస్తే రాజకీయ సంకల్పం కాస్త కూడా లేని వాస్తవం తెలుస్తుంది. ఇక వ్యవసాయం చేయాలా వద్దా అనేది రైతులు నిర్ణయించుకోవాలి. ఇదికాకుండా వారికి మిగిలివున్న ఏకైక మార్గం ఆందో ళన బాట పట్టడమే.
- యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు
మొబైల్ : 98688 88986
Comments
Please login to add a commentAdd a comment