రైతు బడ్జెట్‌... అబ్రకదబ్ర | Ummareddy Venkateswarlu Writes on Farmers Budget | Sakshi
Sakshi News home page

రైతు బడ్జెట్‌... అబ్రకదబ్ర

Published Wed, Feb 28 2018 12:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Ummareddy Venkateswarlu Writes on Farmers Budget - Sakshi

విశ్లేషణ
ఒకవైపు రైతు ఆదాయం రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నా.. రైతుల ఆదాయాలు దిగజారిపోతున్నాయి. ప్రత్యామ్నాయం ఉంటే 69% మంది రైతులు వ్యవసాయం నుంచి బయటకి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

‘‘ముసుగుల్ని తొలగిస్తేనే గానీ వాస్తవాలు బయటపడవన్నది ఓ నానుడి’’.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ యేడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌కు ‘రైతు బడ్జెట్‌’ అనే ముసుగు తగిలించారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.

నిజంగా జైట్లీ బడ్జెట్‌ రైతులకు మేలు చేసేదే అయితే సంతోషమే! రైతాంగాన్ని మభ్యపెట్టేది అయితే మాత్రం.. అది ఆత్మవంచనే అవుతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఏ మేరకు ఉంటుందో... ఆ చందంగానే జైట్లీ బడ్జెట్‌లో రైతు సంక్షేమం ఉందని రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిట్టూర్చుతున్నాయి.
    
కేంద్ర బడ్జెట్‌ కంటే ఒకరోజు ముందుగా విడుదలైన ఆర్థిక సర్వే దేశ వ్యవసాయరంగ స్థితిగతుల్ని ఎత్తిచూపింది. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయరంగం వాటా క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ, ఇప్పటికీ అది మెజారిటీ ప్రజల జీవనాధారంగానే కొనసాగుతున్నదని, భారత ఆర్థిక వ్యవస్థకు అదొక చోదకశక్తి అని ఆర్థిక సర్వే పేర్కొంది.

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కొన్ని జాతీయ పత్రికలు సైతం వ్యవసాయ బడ్జెట్‌ అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. నిధుల కేటాయింపులను, కనీస మద్దతు ధరలను ఖర్చులపై 50% (డా. స్వామినాథన్‌ సిఫార్సు మేరకు) పెంచి ఇస్తామంటూ చేసిన ప్రకటనల నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాలు, ఆఖరుకు మీడియాతో సహా భ్రమల్లో మునిగిపోయారు.

కేటాయింపుల పరంగా చూస్తే.. దాదాపు పాతిక లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించి ఇచ్చింది రూ. 68,836 కోట్లు. ఈ అంకెలు ఘనంగా మేడిపండును తలపించేటట్లున్నాయి. ఉదాహరణకు పంటల బీమా పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయింపులు చేశారు. రెండేళ్ల క్రితం 2016–17 బడ్జెట్‌లో ఇదే పథకానికి రూ. 5,500 కోట్లు కేటాయించారు. ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా 30% సాగు విస్తీర్ణానికి బీమా చేయించాలన్నది అప్పటి లక్ష్యం. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 22%, తెలంగాణలో 10% విస్తీర్ణానికే రైతులు బీమా ప్రీమియం చెల్లించారు.

దేశం మొత్తంమీద 30% విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టారని ఇందుకోసం చివరికి రూ. 13,240 కోట్లు ఇచ్చినట్లు సవరించిన 2016–17 బడ్జెట్‌ లెక్కల్లో చూపించారు. 30% విస్తీర్ణానికి బీమా చేయిస్తేనే కేంద్రానికి రూ. 13,240 కోట్లు అవసరం అయినప్పుడు బీమా పరిధిలోకి ఈ ఏడాది 50% సాగు విస్తీర్ణాన్ని తేవాలని పెట్టుకున్న లక్ష్యానికి రూ. 13,000 కోట్లు ఏవిధంగా సరిపోతాయి? కనీసం 22,000 కోట్లు పైనే కావాలి గదా! ఇటువంటి విచిత్రాలు జైట్లీ బడ్జెట్‌లో చాలానే కనిపిస్తాయి.

కౌలుదారులకు బ్యాంకుల రుణ వితరణ ఈ సారి కూడా ఎండమావిగానే మిగిలిపోనుంది. దేశంలో కౌలుదారీ వ్యవసాయం గణణీయంగా పెరిగిన విషయం తెలిసికూడా వరుస ప్రభుత్వాలు కౌలుదారులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి. గుర్తింపుకార్డులు లేవనే నెపంతో బ్యాంకులు వారికి రుణాలివ్వడం లేదు. కౌలు దారులకు గుర్తింపు కార్డులిచ్చే ప్రక్రియ నత్తనడక కంటే హీనంగా తయారైంది.

రైతుల ఆదాయాన్ని పెంచడానికి, రెట్టింపు చేయడానికి ఏకైక మార్గం.. డా.ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సుల మేరకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి కనీస మద్దతు ధర ఇవ్వడమే! అయితే, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే.. ఉత్పత్తి వ్యయంపై 50% కలిపి ఇవ్వడం సాధ్యపడదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే.. తాజా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పంట ఉత్పత్తి ఖర్చుపై 50% కలిపి ఇస్తామంటూ ప్రకటన చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయిన మాట నిజం.

ఎంఎస్‌పీ నిర్ధారణకు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి ఎంతమాత్రం అంగీకారం కాదు. సమగ్రమైన ఉత్పత్తి ఖర్చు డా.స్వామినాథన్‌ అంచనావేసిన సి2 కాకుండా, కొన్ని ఖర్చులను మినహాయించి ఏ2+ఎఫ్‌ఎల్‌ను ప్రాతిపదికన తీసుకోవడం రైతాంగాన్ని మోసగించడమే. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నివేదికను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నిర్ణయిస్తున్న మద్ధతుధరలు.. ఏ2 పద్ధతి ప్రకారం కూడా ఉండడంలేదు. ఉదాహరణకు, వచ్చే ఖరీఫ్‌కు సంబంధించి సీఏసీపీకి పంపిన నివేదికలో ఏ2 ప్రాతిపదికనే ధాన్యం ఉత్పత్తి ధర క్వింటాల్‌కు రూ. 2,022గా ఉంది. కానీ, ప్రస్తుతం ఏ గ్రేడ్‌ రకం ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు కేవలం రూ. 1,590గా ఉంది.

అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ధరల సరాసరి క్వింటాల్‌కు రూ. 1,100గా నిర్ణయించి.. ఆ మేరకు మద్దతు ధరను కేంద్రం నిర్ణయిస్తున్నది. దాని ప్రకారమే మద్దతు ధరలు ఒకటిన్నర రెట్లు ఉన్నాయని ఆర్థికమంత్రి జైట్లీ చెప్పుకుంటున్నారు. జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతుకు భరోసా లభించిందని, క్లిష్టపరిస్థితుల్లో ఉన్న వ్యవసాయరంగానికి ఊతమిచ్చేదిలా ఉందంటూ చేస్తున్న శాస్త్రీయత లేని ప్రకటనలు మోసపూరితమైనవి. ఇవే విధానాలు కొనసాగితే 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఎన్డీఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

వ్యాసకర్త ఏపీ శాసనమండలి
డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ప్రతిపక్ష నాయకులు ‘ 9989024579

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement