మణిశంకర్ నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ సేనాధిపతి, పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, ఢిల్లీలో పాక్ హైకమిషనర్, మరి 15 మంది సమక్షంలో గుజరాత్‌లో బీజేపీని ఓడించేందుకు గూడుపుఠాణీ జరిగినట్టు ఒక కథ అల్లుకొని అదే అక్షరసత్యమన్నంతగా ఆరోపణలు చేశారు మోదీ. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఈ విషయంలో ప్రధానికి బాసటగా నిలిచేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రంగంలో దిగారు.
ఎన్నికలలో విజయం సాధించేందుకు నరేంద్ర మోదీ దేనికైనా సిద్ధమేనా? వ్యక్తిగత ప్రతిష్ఠ, పార్టీ ప్రయోజనం, దేశ హితం కన్నా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలుపొందడమే ముఖ్యమా? గుజరాత్ ఎన్నికల క్షేత్రంలో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలూ, వ్యాఖ్యలూ దేశ పౌరులందరినీ ఈ ప్రశ్నలు అడిగేందుకు ప్రేరేపించాయి. ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరిగినా నరేంద్ర మోదీ తన పూర్తి శక్తిని వినియోగించి ప్రచారం చేస్తారు. అది ఆయన రాజనీతి విశేషం. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలలో దేశం నలుమూలలలోనూ మోదీ 300 సభలలో ప్రసంగించారు. సోషల్ మీడియానూ, ఎలక్ట్రానిక్ మీడియానూ సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు. నూటికి నూరుపాళ్ళు పోరాడారు. పూర్వ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇందుకు పూర్తిగా భిన్నం. తన పార్టీ ప్రచారపర్వంలోనే ఆయన అతిథిగా దర్శనమిచ్చేవారు. అటల్ బిహారీ వాజపేయి తన పార్టీలో అగ్రశ్రేణి ప్రచారకుడు. అత్యంత ప్రతిభాశాలి. గొప్ప వక్త. కానీ ఆయన రాష్ట్రాలలో జరిగే ఎన్నికలలో అంతగా విరగబడి ప్రచారం చేసేవారు కాదు. ఎన్నికలు జరిగే రాష్ట్రం చిన్నదైనా, పెద్దదైనా నరేంద్ర మోదీ పూర్తి శక్తియుక్తులను వినియోగిస్తారు. దీనివల్ల ప్రధాని పదవి చిన్నబోతుందని ఎవరైనా భావించవచ్చును. సమరశీలం కలిగిన నాయకుడు రంగంలో దిగి పోరాడటానికి వెనకాడడు అని కూడా అనుకోవచ్చు. ఎన్నికల ప్రచారానికి ప్రధాని అంత ఎక్కువ సమయం కేటాయిస్తే ప్రభుత్వ పనులు వెనకబడతాయి. కానీ ఇంతవరకూ ప్రభుత్వ కార్యక్రమాలు దెబ్బతిన్న దాఖలా కనిపించలేదు. ఆ విషయం ఎవ్వరూ చర్చనీయాంశం చేయలేదు. శాసనసభ ఎన్నికల కోసం పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయడం మాత్రం తప్పు. ఆ నిర్ణయం వెనుక ఏవో రాజకీయపరమైన ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.
మర్యాదలకు తిలోదకాలు
ఎన్నికల బరిలో పోరాటానికి దిగడం రాజకీయవాది సహజగుణం. అయితే, ఇది కేవలం గోదాలో జరిగే కుస్తీ కాదు. రాజనీతిలో నీతి అనివార్యం. ఇందులో మర్యాద అనేది విడదీయలేని భాగం. కుస్తీలు పట్టే గోదాలలో సైతం కొన్ని మర్యాదలు పాటిస్తారు. ఎన్నికలలో గెలిచినవారు మాత్రమే గొప్ప నేతలు కాజాలరు. ఎన్నికలలో పోటీ చేసిన తీరుతో తమతో పాటు దేశాన్నీ, సమాజాన్నీ సమున్నతంగా నిలిపినవారే సిసలైన రాజనీతిజ్ఞులు. నాలుగు సంవత్సరాల కిందట కోట్లాది ఓటర్లు నరేంద్రమోదీ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు. గుండెబలం ఉన్న వ్యక్తీ, ప్రభావవంతమైన వక్త మాత్రమే కాకుండా కాంగ్రెస్ కంటే మెరుగైన పాలన ఇస్తారనే ఉద్దేశంతో ఆయనను గెలిపించారు. తన కంటే, తన పార్టీ కంటే అధికంగా దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తారన్న భరోసాతో మోదీకి మద్దతు ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల ఫలితం ఏమైనా కావచ్చు. కోట్లమంది ఓటర్ల హృదయాలలో నరేంద్రమోదీ పట్ల విశ్వాసం నిస్సందేహంగా సన్నగిల్లింది.
పెద్దల పట్ల, సహచరుల పట్ల వినయంగా, సున్నితంగా వ్యవహరించడం అన్నది లేదు. అగ్రస్థానంలో ఉన్నవారి విషయంలో నరేంద్రమోదీ ఎన్నడూ మర్యాదగా ప్రవర్తించలేదు. ప్రత్యర్థుల గురించి తేలికగా మాట్లాడటం, వారిని పరిహసించడం మొదటి నుంచీ నరేంద్రమోదీ రాజకీయ శైలిలో భాగమే. ఒక దశలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి లింగ్డోను బహిరంగంగానే ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు పాటు తన పదవికి తగినట్టు హుందాగా వ్యవహరించారనే అభిప్రాయం కలిగించారు. తనను తాను నిగ్రహించుకున్నారు. కానీ పెద్దనోట్ల నిర్ణయం బెడిసికొట్టిన అనంతరం ఈ వైఖరికి ఆయన స్వస్తి చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ తన పదవికి గల ఔన్నత్యాన్ని మరచి అన్ని రకాల అడ్డగోలు మాటలూ మాట్లాడారు. తన స్థాయికి తగని ఆరోపణలూ, విమర్శలూ చేశారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం ఎంతో దూరంలో లేదు. శక్తివంచన లేకుండా కాంగ్రెస్ నాయకులు కూడా మాటకు మాట ఇచ్చుకున్నారు. మణిశంకర్ అయ్యర్ ప్రధానిని ఉద్దేశించి ‘నీచ్’అనే మాటను ప్రయోగించడం మర్యాదను ఉల్లంఘించడమే. ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు. ఒకటే వ్యత్యాసం ఏమంటే, పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు మణిశంకర్ ప్రధానికి క్షమాపణ చెప్పారు. కానీ ప్రధాని తాను అన్న అనరాని మాటలకు కానీ తన పార్టీ సహచరుల అవాకులు చవాకులకు కానీ చింతిస్తున్నట్టు చెప్పలేదు.
ఏమైంది సత్యసంధత?
రాజకీయాలలో హుందాగా వ్యవహరించడం కంటే సత్యం చెప్పడం ముఖ్యం. ఈ విషయంలో కూడా ప్రధాని తీరు చెప్పుకోదగినదిగా లేదు. అబద్ధాల చక్రవర్తిగా ఇంతవరకూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు తెచ్చుకున్నారు. ఈ కిరీటం కోసం మన ప్రధాని పోటీ పడుతున్నట్టు కొన్ని మాసాలుగా ఆయన తీరు చూసినవారికి అనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విషయంలో తప్పుడు లెక్కలు చెప్పడం, గుజరాత్ ఎన్నికలలో పాకిస్తాన్ సైన్యానికి ఆసక్తి ఉన్నట్లు కట్టుకథలు చెప్పడంతో మోదీ ప్రకటనలలో విశ్వనీయత బాగా తగ్గిపోయింది. సమీప ప్రయోజనం కోసం ప్రధాని ఎటువంటి అబద్ధమైనా చెప్పగలరని అనిపిస్తోంది. ఇటువంటి ప్రవర్తన వల్ల ప్రపంచ దేశాల దృష్టిలో మన దేశ గౌరవప్రతిష్ఠలు దెబ్బతింటాయనే ఆలోచన ఆయనకు ఉన్నదో లేదో తెలియదు. ట్రంప్ అసత్య ప్రసంగాలు విని అమెరికా పట్ల మనం చులకన అభిప్రాయం ఎట్లా ఏర్పరచుకుంటామో, అదే విధంగా మోదీ అసంగత ప్రసంగాలను గమనించిన ప్రపంచం ఇండియాను చూసి హేళనగా నవ్వదా? రాజకీయ ఎజెండా సత్యం, అసత్యం కంటే ముఖ్యమైనది. మోదీ ప్రధానిగా ప్రమాణం స్వీకరించిన సందర్భంలో దేశానికి మంచి రోజులు (అచ్చేదిన్) రాబోతున్నాయని హామీ ఇవ్వడం ద్వారా ఆయన దేశ ప్రజలకు సకారాత్మకమైన ఎజెండాను ప్రతిపాదించారు.
ఈ ఎజెండా ఫలితాలను దేశ ప్రజలకు అందించవలసిన సమయం వచ్చింది. కానీ ప్రధాని ఈ ఎజెండాకు దూరంగా జరిగినట్టు కనిపిస్తున్నారు. గుజరాత్ అభివృద్ధి నమూనాను దేశం అంతటా అమలు చేసి చూపిస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలోనే అభివృద్ధి గురించి మాట్లాడలేకపోయారు. అక్కడ వికాస్‌ను అటక ఎక్కించి మతపరమైన ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారు. గుజరాత్‌లో 22 సంవత్సరాలు అధికారంలో ఉండి బీజేపీ నాయకులు ఏమి సాధించారో, ఏమి సాధించలేకపోయారో లెక్క చెప్పవలసిన ప్రధానమంత్రి ఆ పని చేయకుండా రాహుల్‌గాంధీ మతం, పాకిస్తాన్, హిందూ–ముస్లిం వివాదం గురించి అదే పనిగా మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌కు చెందిన ఒక నాయకుడికి ఐఎస్‌ఐతో సంబంధాలు అంటగట్టారు. ప్రజలలో ఆశాభావం రేకెత్తించడానికి బదులు భయసందేహాలను పెంచడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌కు పాకిస్తాన్, ముస్లిం అనేవి పర్యాయపదాలుగా మార్చడం ఈ క్రీడ లక్ష్యం. ముస్లింలను విమర్శించడం ద్వారా హిందువులను ఏకం చేయడం ఇందలి ఆంతర్యం. అందుకోసం ఎంత దూరమైనా పోతారా? ఎవరిమీద పడితే వారి మీద బురద చల్లుతారా? రాబోయే తరాలపైన ఇటువంటి ప్రచారం ప్రభావం ఎట్లా ఉంటుందో ప్రధాని ఆలోచించారా? లేదా ఎన్నికలలో గెలిచేందుకు ఏమి చేసినా తప్పు లేదని భావించారా?
దేశ ప్రయోజనాలను దెబ్బతీసే ధోరణి
అన్నిటి కంటే ముఖ్యమైన ప్రశ్న దేశభక్తికీ, దేశద్రోహానికీ సంబంధించింది. మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్, తదితరులకు విందు ఇవ్వడంపైన ప్ర«ధాని చేసిన వ్యాఖ్యలు మన దేశ ప్రయోజనాలను నిశ్చయంగా దెబ్బతీస్తాయి. మణిశంకర్ పాకిస్తాన్ వెళ్ళి తనను అడ్డు తొలగించడానికి సుపారీ ఇచ్చారంటూ మరో దారుణమైన అరోపణ చేశారు. మణిశంకర్ పాకిస్తాన్‌లో భారత దౌత్యాధికారిగా కొన్ని సంవత్సరాలు పని చేశారు. అక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి కసూరీ భారత్‌కు మిత్రుడనే దౌత్యవేత్తల అభిప్రాయం. వారంతా కలిసి భారత్–పాకిస్తాన్ సంబంధాలను మెరుగుపరచడం ఎట్లా అన్న అంశంపైన మాట్లాడుకున్నారు. ఢిల్లీలోని మణిశంకర్ నివాసంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ సేనాధిపతి, పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, ఢిల్లీలో పాక్ హైకమిషనర్, మరి 15 మంది సమక్షంలో గుజరాత్ ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు గూడుపుఠాణీ జరిగిందని తన మనస్సులో ఒక కథ అల్లుకొని అదే అక్షరసత్యమన్నట్టు ఎన్నికల సభలలో ఆవేశంగా ఆరోపణలు చేశారు మోదీ. ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు. ఈ విషయంలో ప్రధానికి బాసటగా నిలిచేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రంగంలో దిగారు కానీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ జోక్యం చేసుకోకపోవడం విశేషం. పాకిస్తాన్‌పైన ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషనర్‌ను వెనక్కి పిలవవలసిందిగా పాక్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం డిమాండ్ చేయకపోతే దౌత్యరంగంలో భారత్ పరువు గంగలో కలసిపోతుంది. స్వరాష్ట్రంలో ఎన్నికలు గెలవడంకోసం దేశ ప్రధాని అసత్య ప్రచారం చేశారని ప్రపంచ దేశాలకు తెలిసిపోతుంది. ప్రధాని స్థాయి కుంచించుకుపోతుంది. 1971లో తూర్పు పాకిస్తాన్ విమోచనకోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న జనరల్ కపూర్ కూడా మణిశంకర్ నివాసంలో జరిగిన సమావేశంలో ఉన్నారు. ఆయనపైన కూడా గూడుపుఠాణీ నిందవేయడం ద్వారా ప్రధాని భారత సైన్యాన్ని అవమానించారని చెప్పుకోవాలి. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పాకిస్తానీయులతో కలసి కుట్ర చేశారన్న అరోపణ చేయడం సమంజమని మోదీ భావిస్తున్నారా?
ఈ ఆరోపణ నిజమే అయితే మన్మోçహన్‌సింగ్‌పైన దేశద్రోహం కేసు పెట్టి విచారణ జరిపించే సాహసం చేయగలరా? ఆ విధంగా చేయకపోతే ప్రధానమంత్రి దేశహితానికి విఘాతం కలిగించినట్టు కాదా? మన్మోహన్‌సింగ్ ఎన్నడూ లేనంత ఘాటుగా స్పందించి ప్రధాని దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ప్రజలు ఎన్నికలలో తమ తీర్పు ఇస్తారు. కానీ దేశప్రజలందరూ ప్రధాని ప్రవర్తన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలి.
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు
మొబైల్ : 98688 88986
యోగేంద్ర యాదవ్
Comments
Please login to add a commentAdd a comment