వీరి వైఫల్యమే వారి వైభవం
నేడు రాజకీయ శూన్యమనే అంధకారంలో మోదీ తారలా వెలిగిపోతున్నాడు. మోదీ దూకుడును ప్రదర్శిస్తుండగా, విపక్షాలు కేవలం ప్రతిస్పందనల వరకే పరిమితమవుతున్నాయి. చూసేవాళ్లకు మోదీ సానుకూలమైన వ్యక్తిగా కనిపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు ప్రతికూల వైఖరితో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవన్నీ మోదీ అనే గాలిబుడగ ఏదో ఒక రోజున తనంతట తానే పేలిపోక తప్పదనే అపోహలో కాలం గడుపుతున్నాయి. కేవలం మోదీని వ్యతిరేకించడం ద్వారానే మోదీని ఎదుర్కోవచ్చని వారు భ్రమ పడుతున్నారు.
మూడేళ్ల మోదీ పాలనలో మూడు మౌలిక వాస్తవాలను గమనించవచ్చు. వీటిలో ఏ ఒక్క వాస్తవాన్నైనా చూడకపోవడమంటే అది దేశ రాజకీయాలను చూడకపోవడమే అవుతుంది. మొదటి వాస్తవం: నేడు నరేంద్ర మోదీ యావత్ దేశంలో ప్రజాదరణ గల ప్రధానమంత్రిగా గుర్తింపు పొందారు. రెండో వాస్తవం ఏమిటంటే, ఈ ప్రజాదరణ ఆయన చేసిన పనుల వల్లా, సాధించిన ఫలితాల వల్లా లభించింది కాదు, ఆయన ఇమేజ్ ఆధారంగా వచ్చింది. ఇక మూడో వాస్తవం, ఆయనకు ఇలాంటి ఇమేజ్ ఏర్పడడానికి మీడియా మెహర్బానీ కారణం కాగా, విపక్షాల దివాళాకోరుతనం వల్ల అది దినదినం వృద్ధి చెందింది.
ఇలాంటి సర్వేలు సరే.....!
మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత కొద్ది రోజులుగా అనేక సర్వేలు వెలువడ్డాయి. ఈ సర్వేలన్నింటిలోనూ సామాన్య ప్రజలతో జరిపిన సంభాషణల ఆధారంగా ప్రధాని నరేంద్ర మోదీకి జనాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడే లోక్‌సభ ఎన్నికలు జరిగినట్టయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు అనే లెక్కలు కూడా దాదాపు అందరూ కట్టారు. ఒకానొక కాలంలో నేనూ అనేక సర్వేలు నిర్వహించిన వాడినే.
కాబట్టి ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిపే ఇలాంటి సర్వేలలో వెల్లడయ్యే జోస్యాలను తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదని నేను చెప్పగలను. అయితే ప్రజాభిప్రాయం ఏ రీతిలో ఉందో, గాలి ఎటు వీస్తుందో అంచనా వేసుకోవడానికి మాత్రం ఈ సర్వేలు బాగా ఉపయోగపడతాయి. వేర్వేరు సర్వేల ఫలి తాలలో కొద్దో గొప్పో తేడాలున్నందున నేనిక్కడ అన్నింటికన్నా విశ్వసనీయమైనదని భావించే సీఏస్‌డీఏస్ (ఇఈ) లోక్‌నీతి సర్వేపై ఆధారపడుతున్నాను.
నోట్ల రద్దు తరువాత అదే ఆదరణ
మూడేళ్ల క్రితం అపూర్వ విజయం సాధించి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీకీ, అతని ప్రభుత్వానికీ ప్రజాదరణ నేటికీ బాగానే ఉందని ఈ సర్వేలన్నీ తేల్చాయి. అంతేకాదు, ప్రజాదరణలో ఎనిమిది శాతం పెరుగుదల ఉందని కూడా అవి నిర్ధారించాయి. 2014 నాటితో పోలిస్తే బీజేపీకి ఒడిశా, బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలలో ఎక్కువ ఆధిక్యం లభించింది. అయితే ఇక్కడొక విషయం గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, గతంలో యూపీఏ ప్రభుత్వాల ప్రజాదరణ కూడా మూడేళ్ల దాకా చెక్కు చెదరలేదు. కాకపోతే మన్మో హన్Sసింగ్ కన్నా నరేంద్ర మోదీకి లభించిన ప్రజాదరణ ఎక్కువ అనేది కాదనలేని వాస్తవం. ప్రత్యేకించి గమనించాల్సిన విషయం ఏమిటంటే, నోట్ల రద్దు తర్వాత మోదీ ప్రజాదరణ తగ్గకపోగా, అది మరింత పెరిగింది.
ఎవరి దృష్టి వారిది
అయితే బీజేపీ వ్యతిరేకులు పై వాస్తవాల్లో మొదటిదాన్ని చూడడానికి ఇష్టపడరు. ఇక బీజేపీ మద్దతుదారుల విషయానికొస్తే, వారు రెండో వాస్తవాన్ని చూడడానికి నిరాకరిస్తారు. మోదీ ప్రజాదరణ ఇప్పటికీ తగ్గలేదంటే, దానికి కారణం తమ ప్రభుత్వం బాగా పని చేయడమేనని వారు భావిస్తారు. కానీ అసలు వాస్తవం అది కాదు. మోదీ ప్రభుత్వం తన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. ఉదాహరణకు, రైతులు పెట్టే పెట్టుబడికి ఒకటిన్నర రెట్ల పంట ధరలు, దేశంలోని యువజనులందరికీ ఉపాధి, మహిళలకు భద్రత, అవినీతిని రూపుమాపడం, విద్య, వైద్య సదుపాయాల్లో పెద్ద సంస్కరణలు... ఇలాంటి హామీలేవీ నేటికీ నెరవేరలేదు.
ఇక సర్కారు వారు బాగా ప్రచారం చేసుకున్న స్వచ్ఛ్ భారత్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా, పంటల బీమా వంటి పథకాలేవీ నిర్దేశిత లక్ష్యాలకు చేరువలోకైనా చేరుకోలేదు. అయితే మోదీకి ప్రజాదరణ అపారంగా ఉందని చెప్పిన సర్వేలు సైతం నేడు దేశంలో నెలకొన్న నిరుద్యోగం పట్ల ఆందోళన వ్యక్తం చేశాయన్నది గమనార్హం. గత మూడేళ్లలో ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయన్నది జనవాక్యం. రైతుల పరిస్థితి మునుపటికన్నా చాలా దయనీయంగా తయారైంది.
మీడియా మద్దతుతోనేనా?
సాధించిన ఘనతేదీ లేకున్నా మోదీ ప్రభుత్వానికి ఇంత జనాదరణ ఎలా వచ్చిందన్నది అసలు ప్రశ్న. మోదీ పలుకుబడిని మీడియా తీర్చిదిద్దడం వల్లే ఇది సాధ్యమైందని ఆయన వ్యతిరేకులంటారు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఈరోజున దేశంలో మీడియా మోదీని ఎంతగా ఆకాశానికెత్తుకుంటోందంటే, రాజీవ్ గాంధీ పాలనలో తొలి ఒకటి, రెండేళ్ల తర్వాత ఇంతగా మనం ఎన్నడూ చూడలేదు. దేశంలో మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నడూ కనీ, వినీ ఎరుగని స్థాయిలో కొనసాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియా మోదీని ఆరాధిస్తోంది. ఆయన పాలనలోని ప్రతి లోపంపైనా అది పరదా కప్పెయ్యడానికే ఆత్రుత కనబరుస్తోంది. అది బీజేపీ కనుసన్నల్లో మసలుతూ, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఎడతెరపి లేని క్యాంపెయిన్ కొనసాగిస్తోంది.
రాబర్ట్ వాద్రా పాల్పడ్డ తప్పుడు పనులను బట్టబయలు చేయడానికి అది ఎంతో దూకుడును ప్రదర్శిస్తుంది కానీ బిర్లా సహారా డైరీల వ్యవహారంలో అంతులేని మౌనం దాలుస్తుంది. కపిల్ మిశ్రా లేవనెత్తే ప్రతి ఆరోపణనూ అలుపు లేకుండా ప్రచారం చేస్తుంది కానీ వ్యాపమ్ కుంభకోణం విషయంలో అది పల్లెత్తు మాట మాట్లాడదు. ఇంతటి పెంపుడు మీడియా దేశ చరిత్రలో బహుశా ఏ ప్రధానికీ లభించకపోవచ్చు. అయితే మోదీకి ఉన్న ప్రతిష్ట పూర్తిగా మీడియా దయాదాక్షిణ్యాల ఫలి తంగానే రూపుదిద్దుకుందనుకోవడం సరికాదు. సరుకు అసలు అమ్ముడుపోయే రకమే కానప్పుడు, వాణిజ్య ప్రకటన ఎంత గొప్పగా ఉన్నా సరే దాన్నెవరూ కొనరు కదా. నిజానికి మోదీ విజయం వెనుక దాగున్న రహస్యం ఆయన ప్రతిపక్షాలే. ఆయనను రాహుల్ గాంధీతో లేదా ఇతర నేతలతో పోల్చినప్పుడు తారలా మెరిసిపోతాడు.
దిగజారిన కేజ్రీవాల్ ప్రతిష్ట
జనాలకు ఎవరి పేర్లూ చెప్పకుండా తమకు ఇష్టమైన ప్రధానమంత్రి పేరు చెప్పమని అడగగా, 44 శాతం మంది నరేంద్ర మోదీ పేరు చెప్పారని సీఎస్‌డీఎస్ సర్వే వెల్లడి చేసింది. ఆయన తర్వాతి స్థానం రాహుల్ గాంధీది కాగా, ఆయన పేరు చెప్పింది 9 శాతం మంది మాత్రమే. రాహుల్, సోనియా, మన్మోహన్‌లను ముగ్గురిని కలిపినా వారి శాతం 14 మాత్రమే. మూడేళ్ల క్రితం ఈ వ్యత్యాసం ఇంత ఎక్కువగా లేదు. మోదీ పేరును 36 శాతం మంది చెప్పగా, రాహుల్, సోనియా, మన్మోహన్‌సింగ్‌ల ఉమ్మడి శాతం 19 వరకు ఉండింది. ప్రజలు ప్రధానిగా కోరుకునే వారిలో వీరు కాకుండా మిగతా ప్రతిపక్ష నాయకులెవరూ 3 శాతాన్ని దాటలేదు. రెండేళ్ల క్రితం 6 శాతం మంది తమ ఇష్టమైన ప్రధానిగా అరవింద్ కేజ్రీవాల్ పేరును సూచించగా, ఇటీవలి కాలంలో ఆయన మూటగట్టుకున్న అపఖ్యాతి మూలంగా ఆయనను మెచ్చేవారి శాతం 1 కన్నా తక్కువకు దిగజారింది.
విపక్షాల దివాళాకోరుతనం
నేడు రాజకీయ శూన్యమనే అంధకారంలో మోదీ తారలా వెలిగిపోతున్నాడు. మోదీ దూకుడును ప్రదర్శిస్తుండగా, విపక్షాలు కేవలం ప్రతిస్పందనల వరకే పరిమితమవుతున్నాయి. చూసేవాళ్లకు మోదీ సానుకూలమైన వ్యక్తిగా కనిపిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు ప్రతికూల వైఖరితో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవన్నీ మోదీ అనే గాలిబుడగ ఏదో ఒక రోజున తనంతట తానే పేలిపోక తప్పదనే అపోహలో కాలం గడుపుతున్నాయి. కేవలం మోదీని వ్యతిరేకించడం ద్వారానే మోదీని ఎదుర్కోవచ్చని వారు భ్రమ పడుతున్నారు. వారి వ్యూహం కేవలం మోదీ వ్యతిరేక మహాకూటమి వరకే పరిమితం. ఆలోచిస్తే అసలు మోదీ వ్యతిరేకులు చరిత్రను ఏ మాత్రం చదవలేదనిపిస్తుంది. అధికార పక్షపు అహంకారం కాదు, విపక్షాల దివాళాకోరుతనమే నేటి మన ప్రజాస్వామ్యంలో నెలకొన్న అసలైన విషాదం.
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్: 98688 88986 ‘ Twitter: @_YogendraYadav