విశ్లేషణ
ఈ భువి మీద నివసించే ప్రజలంతా కలసి ఎన్నుకునే ఒక ప్రపంచ పార్లమెంట్, ఒక ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ వలసవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచం మీద అందరికీ సమాన హక్కులు ఉండాలని భావించారు. పౌరహక్కుల కోసం అమెరికాలో సాగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అందులో పాల్గొని అరెస్టయిన భారతీయుడు బహుశా లోహియా ఒక్కరే. మనిషి రంగు ఆధారంగా చెలరేగే జాత్యహంకారాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
‘ప్రజలు నేను చెప్పేది వింటారు. కానీ అది నేను మరణించాక జరుగుతుంది’ ఈ మాటను రామ్ మనోహర్ లోహియా తరచూ చెప్పేవారు. ఈ సునిశిత వ్యాఖ్యను గురించి లోతుగా ఆలోచించడానికి ఆయన యాభయ్యో వర్ధంతి (అక్టోబర్ 12)కి మించిన సందర్భం మరొకటి ఉండదు. నిజం చెప్పాలంటే రామ్ మనోహర్ లోహియా 21వ శతాబ్దపు చింతనాపరుడు. తన కాలానికి అతీతంగా ఆలోచించినవారు. ఆధునిక భారత మహోన్నత రాజకీయ చింతనా సంప్రదాయంలో చివరివాడు కూడా ఆయనే. ఆ చింతనా ధోరణికి చెందిన వారిలో ప్రస్తుతం భారతదేశానికి తగిన ఆలోచనాపరుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే నిస్సంశయంగా మళ్లీ లోహియా అనే చెప్పవచ్చు. కొత్త తరాల వారికి ఆయన ఎవరో కూడా తెలియదు కాబట్టి, అసలు లోహియా అంటే ఎవరు అన్న అంశం దగ్గర నుంచి మొదలుపెట్టడం అవసరం.
1910లో పుట్టిన లోహియా స్వాతంత్య్ర సమరయోధుడు. సోషలిస్ట్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరాన్ని ఐక్యం చేయడానికి స్ఫూర్తిగా నిలిచినవారాయన. స్వతఃసిద్ధంగా విద్యావంతుడైన లోహియా జర్మనీలో పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన విరివిగా రచనా వ్యాసంగాన్ని నిర్వహించారు. ఒక్క రాజకీయ పరిణామాలను, సిద్ధాంతాలను విశ్లేషించడమే కాదు, చరిత్ర, పురాణాలు, తత్వశాస్త్రం గురించి కూడా ఆయన ఎన్నో రచనలు అందించారు. ఎందరో రచయితలకు, కళాకారులకు కూడా స్ఫూర్తి కేంద్రంగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లోహియా నాయకుడు, ఆలోచనాపరుడు. ఇవాళ్టి రాజకీయాలలో అలాంటివారు అత్యంత అరుదు.
మొదట అపోహలు తొలగించుకోవాలి
లోహియా జీవితం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే మొదట ఒక పనిచేయాలి. లోహియాకు సంబంధించి మన సమష్టి జ్ఞాపకాల నిండా పరుచుకుని ఉన్న గందరగోళాన్నీ, దురభిప్రాయాలనూ తుడిచి పెట్టాలి. ఆయన కాలంలోను, ఆయన తదనంతరం కూడా మేధావి వర్గం ఒక పద్ధతి ప్రకారం ఆయన పట్ల దురభిప్రాయాలను ఏర్పరుచుకుంది. ఆయన చేసిన మూడు ‘పాపాల’ను బట్టి మేధావి వర్గం ఎప్పటికీ క్షమించదేమో! యావద్భారతం అవతార పురుషునిగా, దైవాంశసంభూతునిగా ఆరాధిస్తున్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూను లోహియా విమర్శించారు. అలాగే కులం గురించి మాట్లాడడానికి ఎవరూ అంగీకరించని కాలంలో ఆయన అగ్రకుల ఆధిపత్యం గురించి నిలదీశారు. చివరిగా–ఇంగ్లిష్ భాష రద్దుకు ఉద్యమించారు. ఈ మూడు అంశాలే లోహియాను ఆయన సమకాలీన విధాన రూపశిల్పులకే కాదు, ఉదారవాదులకు, వామపక్షవాదులకు కూడా ఏమాత్రం గిట్టని వ్యక్తిగా నిలబెట్టాయి. ఈ కారణంగానే లోహియా విస్మృత నేతగా మిగిలారు. లేదంటే అసంగతాల ఆధారంగా గుర్తు చేసుకునే వ్యక్తిగా ఉండిపోయారు.
రిజర్వేషన్లు అంటే!
మూడు కారణాల వల్ల లోహియాను మనం తరచూ స్మరించుకుంటాం. మొదటిది– ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత. రెండు– ఓబీసీలకు రిజర్వేషన్లు, మూడు– ఇంత క్రితం పేర్కొన్న ‘అంగ్రేజీ హఠావో’ నినాదం. లోహియా అసలు ఉద్దేశమేమిటో సరిగా అర్థం చేసుకోలేదనడానికి ఈ మూడు అంశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇందులో ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత లేదా కాంగ్రెసేతర వాదం 1960 దశాబ్దం నాటి ఒక వ్యూహం మాత్రమే. అప్పుడు ప్రతిపక్షాల అనైక్యత కారణంగా కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించేది. ‘శూద్రు’లకు రిజర్వేషన్ కల్పించాలని మొదటిగా వాదించినవారిలో లోహియా ఒకరు. ఆయన ఉద్దేశంలో ఈ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించవలసిన వారు ఓబీసీలతో పాటు దళితులు, ఆదివాసీలు, స్త్రీలు కూడా. ఇందులో మళ్లీ కులం, వర్గం విభేదాలు కూడా ఉండవు. ఆయన దృష్టిలో రిజర్వేషన్ల అంతిమ లక్ష్యం సామాజిక న్యాయాన్ని సాధించడం ఒక్కటే కాదు. రిజర్వేషన్లు అంటే లోహియా దృష్టిలో స్త్రీపురుష సమానత్వాన్ని సాధించేందుకు, అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన విస్తృత పోరాటం. అధికార భాషగా ఇంగ్లిష్ భాషను కొనసాగించడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వాస్తవిక అధికార భాషగా ఇక్కడి ప్రజా జీవితం మీద ఇంగ్లిష్ భాష సాగి స్తున్న స్వారీని మాత్రమే లోహియా వ్యతిరేకించారు. ఒక భాషగా ఇంగ్లిష్‌ను వ్యతిరేకించలేదు. ఆ భాషా సాహిత్యాన్ని కూడా నిరసించలేదు. ఆయనకు అందులో ఎంతో ప్రవేశం ఉంది. అలా అని ఆయన ఇంగ్లిష్ స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలని కూడా భావించలేదు. ఇంగ్లిష్ స్థానంలో భారతీయ భాషలను ఉపయోగించాలని ఆశించారు. ఈ అంశాల గురించిన దురభిప్రాయాలను మనం వదిలించుకుంటే లోహియా అంటే ఏమిటో చూడడానికి అవకాశం కలుగుతుంది.
గొప్ప చింతనాపరుడు లోహియా
లోహియా యథాతథ స్థితిని ఛిద్రం చేయాలనుకునే తత్వం కలిగినవారు. ఒక ద్రష్ట. వలసవాద అనంతర కాలానికి చెందిన గొప్ప చింతనాపరుడు. నిఖార్సయిన భారతీయుడు. అదే సమయంలో సహేతుకమైన అంతర్జాతీయవాది. పెట్టుబడిదారీ విధానం –కమ్యూనిజం, జాతీయవాదం– అంతర్జాతీయ వాదం, సంప్రదాయం– ఆధునికత అనే 20వ శతాబ్దపు ద్వైదీభావపూరిత∙సూత్రాలకు అతీతంగా లోహియా మనకు మూడో మార్గాన్ని చూపారు. ఐరోపా చరిత్రలో మరోసారి జీవించాలని ఐరోపాయేతర సమాజాలు ఆలోచించలేవని, నిజానికి ముమ్మాటికీ అలా ఆలోచించరాదని కూడా ఆయన చెప్పారు. భారత వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి తాజాగా ఆలోచించడానికి ఆయన వాకిలి తెరిచారు. సామ్యవాదం అనేది పెట్టుబడిదారీ విధానానికీ, కమ్యూనిజానికి భిన్నమైన సిద్ధాంతమని లోహియా భావన. 20వ శతాబ్దానికి చెందిన ఆ రెండు ఆర్థిక సిద్ధాంతాలు భారీ పరిశ్రమలు, విస్తృత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, కేంద్రీకరణల యావలో పడినాయని ఆయన అన్నారు. అలాంటి నమూనా రావాలంటే వలస దోపిడీతోనే సాధ్యమని, మిగిలిన ప్రపంచంలో సమత్వానికి అవి ఉపకరించవని లోహియా వ్యాఖ్యానించారు. అందుకు ప్రత్యామ్నాయంగా, లేదా మూడో మార్గంగా ఆయన చిన్న తరహా సాంకేతిక పరిజ్ఞానం, గ్రామీణ పరిశ్రమలు, వికేంద్రీకరణలు పునాదిగా ఉండే సోషలిజాన్ని ప్రతిపాదించారు. ఉత్పత్తి సాధనాల మీద ప్రభుత్వం, ప్రైవేట్ ఆధిపత్యం గురించిన చర్చను పూర్వపక్షం చేసి, దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తుల మీద సహకార యాజమాన్యాన్ని ప్రతిపాదించారు.
ఆధునికతకు అర్థం చెప్పినవాడు
సాంస్కృతిక పరమైన ఉనికిని గురించి వర్తమానంలో జరుగుతున్న చర్చల విషయంలో కూడా లోహియా మూడో మార్గాన్ని చూపించారు. యుద్ధోన్మాద జాతీయ వాదానికీ, విధ్వంసక కాస్మొపోలిటన్ సంస్కృతికీ మధ్య సాంస్కృతిక పునాది కలిగిన అంతర్జాతీయ వాదం మెరుగైనదని లోహియా భావించారు. భారతీయ స్త్రీవాదానికి ద్రౌపది ప్రతీక అని ఆయన చెప్పారు. ఉత్తర, దక్షిణ భారతాల వారధిగా ఆయన రామాయణాన్ని పరిగణించారు. అలాగే మహా భారతం తూర్పు, పడమర ఐక్యతకు చిహ్నమని చెప్పారు. సంప్రదాయబద్ధమైన, సంప్రదాయ విరుద్ధమైన రెండు తరహాల రామాయణాలను ప్రవచించే విధంగా ఒక మేళాను నిర్వహించాలన్నది ఆయన కల. భారతదేశంలో నదుల దుస్థితిని గురించి మొదట గొంతెత్తినది కూడా ఆయనే.
అలాగే పుణ్యక్షేత్రాల పరిశుభ్రత గురించి ఆయనే వివరించారు. చైనా కుట్రల గురించి మొదట హెచ్చరించినవారు, హిమాయల సరిహద్దుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం గురించి నెహ్రూను నిలదీసిన వారు కూడా లోహియానే. సాంస్కృతిక మూలాలే పునాదిగా రాజీలేని లౌకికవాద భావనలకు, ఆధునిక దృష్టికి, అంతర్జాతీయ దృష్టికి నిబద్ధునిగా కనిపించే వ్యక్తి లోహియా. అసలు ఈ భువి మీద నివసించే ప్రజలంతా కలసి ఎన్నుకునే ఒక ప్రపంచ పార్లమెంట్, ఒక ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ వలసవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచం మీద అందరికీ సమాన హక్కులు ఉండాలని భావించారు. పౌరహక్కుల కోసం అమెరికాలో సాగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అందులో పాల్గొని అరెస్టయిన భారతీ యుడు బహుశా లోహియా ఒక్కరే. మనిషి రంగు ఆధారంగా చెలరేగే జాత్యహంకారాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
వీటన్నిటితో పాటు లోహియా ఆధునికత గురించి కూడా ఒక కొత్త ఆలోచనా ధోరణికి శ్రీకారం చుట్టారు. అది 20వ శతాబ్దాన్ని శాసించిన ద్వైదీభావాలకు అతీతమైనది. అనుకరణతో కూడిన ఆధునికతను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనినే మనం పట్టణ ప్రాంత, విదేశీ భావాలు ఉన్న భారతీయులలో గమనిస్తూ ఉంటాం. పురాతనమైన ప్రతి అంశం కూడా ఔదలదాల్చదగినదని వాదించే సంప్రదాయవాదులను కూడా ఆయన నిరసించారు. ప్రతి ఆధునిక ఆవిష్కరణ పురాతన కాలంలోనే ఉన్నదని వాదించే వారి ధోరణిని వ్యతిరేకించారు. ఆయన దేశీయమైన ఆధునికత గురించి స్వప్నిం చారు. ఐరోపాకు ఇప్పటివరకు తెలియని ఒక ఆధునికతను సృష్టించాలని లోహియా విశ్వవిద్యాలయ స్నాతకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒకసారి బోధించారు. యాదృచ్ఛికమేమిటంటే, ఆ ఉపన్యాసం ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చారు.
యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986
Comments
Please login to add a commentAdd a comment