Ram Manohar Lohia
-
లోహియా లోకదర్శన సులోచనాలు!
తెలుగువారికి రామమనోహర్ లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ మనకు దూరంగానే ఉండిపోయాయి. లోహియా ఇతిహాస వ్యాసాల పుస్తకం ఆయనలోని ఈ కోణాన్ని చేరువ చేస్తుంది. పురాణ పాత్రల మీద వెలుగు అన్నట్టేగానీ, ఆ పేరుతో అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు చాటారు. ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోరణిని తూర్పారబట్టారు. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక. ‘‘నాకు అవకాశం దొరకాలే గానీ ఈ భూమండలం సహా, యావత్తు గ్రహరాశిని సొంతం చేసుకొని ఏలుబడిలోకి తెచ్చుకొంటాను.’’ – భూస్వామ్య వ్యవస్థలో కూలి నాలి చేసుకొని బతికే శ్రమజీవుల కాయకష్టానికి విలువ కట్టిన ప్రసిద్ధ ఆర్థికవేత్త రికార్డో ప్రకటన. పరాయి వలస పాలనకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలతో పోరాడి దాన్నుంచి విముక్తి సాధించుకున్నారు వివిధ ఖండాల ప్రజలు. అయితే విమోచన తరువాత కూడా (స్వతంత్ర భారతం సహా) స్థానిక పాలకుల స్వార్థ ప్రయోజనాల వల్ల దోపిడీ వ్యవస్థలో మౌలికమైన మార్పు రాలేదు. ఈ సత్యాన్ని చాటినవారు భారత స్వాతంత్య్ర పోరాటంలో తలమునకలై తన సమకాలీన రాజకీయ సహచరుల పోకడలనూ, సైద్ధాంతిక రంగంలో ఆటుపోట్లనూ దగ్గ రుండి గమనించిన రామమనోహర్ లోహియా. ఇటీవల లోహియా ఇతిహాస వ్యాసాల పేరిట ‘పురాణ పాత్రలపై కొత్త వెలుగు’ మకు టంతో లోహియా సమతా ట్రస్ట్ నిర్వాహకులు, నిరంతర అధ్యయన శీలి రావెల సోమయ్య ఒక ఉత్తమ సంకలన గ్రంథాన్ని ప్రచురించారు. రిషితుల్యుడు, ఆసియాలో తొలి సామ్యవాదిగా పేరెన్నికగన్న స్వామి వివేకానందకు ఈ సంపుటిని అంకితమిచ్చారు. పేరుకు ‘పురాణ పాత్ర’లపై ప్రసరించిన కొత్త వెలుగే. కానీ దాని చాటున అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు ఉన్నాయి. ఇంతవరకూ తెలుగువారికి లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ హిందీ భాషా ప్రియులకు మాత్రమే లభ్యమవుతూ వచ్చాయి. ఆ లోటు ప్రస్తుత తెలుగు సంకలనంతో కొంతవరకు తీరుతుంది. పురాణ పాత్రల ప్రస్తావనలో కూడా లోహియా ఆధారపడింది ‘రొడ్డ కొట్టుడు’ సరుకు మీద కాదు. ఎకాఎకిని ఏ మహోన్నతుని భావదీప్తిని అందిపుచ్చుకోవాలో సరిగ్గా ఆ ఉద్దండుని ‘సహవాసాన్నే’ లోహియా కోరుకున్నాడు. ‘అవధి’ అనే స్థానిక ప్రజల భాషకు వ్యతి రేకులైన సంస్కృత ఛాందసుల ఆగడాలను అతి కష్టం మీద వ్యతి రేకించి నిలబడిన పండిత తులసీదాస్ రామాయణ రచనను ప్రేమిం చినవాడు లోహియా! స్థానిక భాష ‘అవధి’లో రచించిన రామాయ ణాన్ని కాపాడుకోవడానికి తులసీదాస్ పడిన కష్టాలు వర్ణనాతీతం. ఆ సమయంలో తులసీదాస్ గ్రంథాన్ని భద్రంగా కాపాడిన వ్యక్తి ముస్లిం సోదరుడు. రామలీల ఉత్సవాల్ని జరిపే ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోర ణిని తూర్పారబట్టినవాడు లోహియా. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక. ఛాందసుల మాటేమోగానీ, లోహియాకు మాత్రం హిందూ మతంలోనే లోపాయికారిగా పాతుకుపోయిన రాజకీయ దూరదృష్టి ఆశ్చర్యం కల్గించింది. ఎందుకంటే, లోహియా భావనలో మతం, రాజనీతి పరిధులు, ఆశయాలు, వాటి పాటింపు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని కలపకూడదు. ఎందుకని? ‘‘మతం దీర్ఘకాలం ఉండే రాజనీతి కాగా, రాజనీతి అనేది కొంతకాలం మాత్రమే సాగే మతం’’! మతం, రాజనీతుల్లో వివేకం లేకుంటే అవి రెండూ కలిసిపోయినప్పుడు దేశం నాశనమవుతుం దన్నాడు లోహియా! ‘‘రాజకీయ క్షేత్రంలో మతం చొరబడిపోయి దేశంలో ఎంత ఉద్వేగం, ఉద్రేకం, హింస, ద్వేషాలు ప్రబలిపోతు న్నాయో నేను కళ్లారా చూస్తున్నాను. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే మత కార్యకలాపాల్ని అరికట్టక తప్పదు’’! చరిత్రకారుడు విల్ డూరాంట్ తన ‘లెసన్స్ ఆఫ్ హిస్టరీ’లో సోష లిస్టు, క్యాపిటలిస్టు పరిణామ దశల గురించి వెలిబుచ్చిన భావాలతో లోహియా ఏకీభవిస్తున్నట్టు కన్పిస్తుంది: ‘‘పెట్టుబడిదారీ విధాన వ్యాప్తి గురించిన భీతితో సోషలిజం తన స్వేచ్ఛా పరిధిని విస్తృతం చేసుకొనక తప్పని స్థితి ఏర్పడినట్టే, సోషలిస్టు వ్యవస్థ విస్తృతిని గమనించి పెట్టుబడీదారి వ్యవస్థ కూడా తన సమానత్వ పరిధిని విస్తృత పరుచుకొనక తప్పలేదు. ఫలితంగా రెండు విభిన్న ధృవాలూ త్వరలో ఏకమయ్యే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చు’’! సోషలిజానికి శాశ్వత నిర్వచనాలుండవు, దాని నిత్య పరిణా మంలో కొత్తగా అన్వేషిస్తూ ఉండవలసిందేనని లోహియా భావన. అంతేగాదు, మన తెలుగు భాషకు లోహియా అర్థవంతమైన భాష్యం కూడా చెప్పడం విశేషం! ‘‘తెలుగు భాషలో ‘ఉ’కారాంత పదాలు తర చుగా దొరకడానికీ, తులసీదాస్ రాసిన ‘అవధి’ భాషలోనూ, తులసీ రామాయణంలోనూ ఈ ‘ఉ’కారాంత పదాలు ఎక్కువగా ఉండటాన్నీ లోహియా పేర్కొంటాడు. పదాల చివర్లో ‘ఉ’ కలిపితే పదానికి తీపి దనం ఎక్కువవుతుందనీ, ఈ పద మాధుర్యం వెనుక విజయపురిని పాలించిన ఇక్ష్వాకు రాజుల భాషా ప్రభావం ఉండి ఉండవచ్చనీ, ఈ కారణం వల్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఉ’ అయోధ్యకు చేరిందో, లేదా అయోధ్య నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందో తాను చెప్పలేననీ, కానీ, అవధి, తెలుగు భాషా పదాల పరస్పర వాడకం నిజంగా జరిగిందా అని మాత్రం తెలుసుకోవడం తనకిష్టమనీ అంటాడు. దీనివల్లే లోహియా అనేక ప్రాంతీయ భాషా శాసనాలను ఆసక్తితో చూడటం విశేషం. కానీ ఒక్క అనుమానం – ఎన్నో విషయాలపైన ఇంతగా సాధి కార వ్యాఖ్యలు అందించగల్గిన లోహియాకు క్రీస్తుపూర్వం 2100 సంవత్సరం నాటికే సుమేరియా నాగరికత సంపన్న పాలకుల ఆస్తిపాస్తులను, సేద్య యోగ్యమైన భూసంపదను ఎలా, ఏ పద్ధతుల ద్వారా పేద ప్రజలకు పంచి దుర్భిక్ష పరిస్థితులు తలెత్తకుండా చేయ గలిగిందో అవగాహన లేకపోవడం ఒక మహా సోషలిస్టు నాయకుడిలో లోపంగా భావించవచ్చా?! ఎందుకంటే, అమెరికన్ మహా కోటీశ్వ రుల్లో బలవంతుడైన రాక్ఫెల్లర్ కొడుకు జాన్ డి. రాక్ఫెల్లర్ అమెరికా లోని ఘరానా ప్రయివేట్ ట్రస్ట్ కంపెనీల గురించి ప్రస్తావిస్తూ ఓ గొప్ప నిజాన్ని బహిర్గతం చేశాడు: ‘‘అందమైన అమెరికన్ గులాబీ రోజాను దాని అందచందాలతో, మధుర సువాసనలతో పెంచడం మహా సులభమే. కానీ ఎలా? ఈ పెద్ద గులాబీని ఆసరా చేసుకొని దాని చుట్టూ మొగ్గ తొడుగుతూన్న చిన్న గులాబీలను కాస్తా తుంచి పారేయడం ద్వారా. ఆ పద్ధతిలో ఎదిగినవే అమెరికన్ ట్రస్టు కంపెనీ లన్నీ.’’ జూనియర్ రాక్ఫెల్లర్ మార్క్సిజం పరీక్షకు తనను తాను గురి చేసుకొన్నాడో లేదో తెలియదుగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించే అసమ సామాజిక, అరాచక పరిస్థితులను బలైపోయిన శిశు ‘రోజా’ ఉదాహరణ ద్వారా బహిర్గతం చేయగలిగాడు. నూరేళ్ల క్రితమే ఇంగ్లండ్ మహాకవి షెల్లీ ‘ఇంగ్లండ్ ప్రజలకు విన్నపం’ పేరిట ఇచ్చిన సందేశం విశ్వగీతికగా మార్మోగిపోయింది. పారిశ్రామిక విప్లవానంతరం పెట్టుబడిదారీ విధాన ఫలితాల వల్ల కష్ట జీవులైన కార్మిక కుటుంబాలు అనుభవిస్తున్న వ్యథలను గమనించి, ఆ కష్టాలకు కర్మ సాక్షిగా ఆయన నిలబడ్డాడు. ‘‘కష్ట జీవులారా! మీరు నాటే విత్తనాన్ని మరొకడుఅనుభవిస్తున్నాడు, నీవు సృష్టించే సమాజ సంపదను మరొకడెవడో దొంగిలిస్తున్నాడు, నీవు నేసే బట్టలను మరొకడెవడో ధరిస్తున్నాడు, నీవు సృష్టించే ఆయుధాల్ని మరొకడు ధరిస్తున్నాడు. విత్తనం నువ్వే నాటు, కానీ నియంతకు అందనివ్వకు, సంపదను సృష్టించు, కానీ దుర్మార్గ పాలకుడికి అందనివ్వకు, దుస్తులు కుట్టు, కానీ సోమరిపోతుకు అందనివ్వకు ఆయుధాలు తయారుచెయ్యి, కానీ వాటిని నీ రక్షణకే ఉపయోగించు.’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
క్విట్ ఇండియా సీక్రెట్ సెగ ఏడు గుర్రాల రేడియో
‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలో 1942 ఆగస్టు 27 నుంచి నవంబర్ 12 వరకు.. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కనిపెట్టేవరకు 78 రోజుల పాటు రామ్ మనోహర్ లోహియా అజ్ఞాత ప్రదేశాల్లోంచి నడిపించిన సీక్రెట్ రేడియో (బ్రిటిష్‌వారి దృష్టిలో ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’).. అదే ఏడాది జర్మనీలో సుభాస్ చంద్రబోస్ ప్రారంభించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది. క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ తర్వాతి ఏడాది 2018లో కేంద్రప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ఇండియా మూవ్మెంట్’ అనే పుస్తకంలో ఆ సీక్రెట్ రేడియోకు సంబంధించి విస్మయకరమైన అనేక వివరాలు ఉన్నాయి. ఐదారు చోట్ల నుంచి! అంతరాయం లేకుండా వివిధ స్థలాల నుంచి కనీసం మూడు ట్రాన్స్మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71) రోజుల ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్‌మీటర్ పరికరాలను వేర్వేరు చోట్లకు బ్రిటిష్‌వాళ్ల కళ్లు కప్పడానికి తరలించేవారు. నవంబరు 12 దాకా ఈ ప్రసారాలు ఆగకపోవడం గమనార్హం. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్ల మీద ప్రసారాలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసారాలు సాగేవి. ‘హిందుస్థాన్ హమారా’ అనే పాటతో మొదలై వందేమాతరం గీతంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసారశక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఇక ఈ ప్రసారాలు నిర్వహించిన యువసైన్యం వివరాలు ఉత్తేజం కలిగిస్తాయి. బాబూ భాయ్ బొంబాయిలో ఫోర్త్ స్టాండర్డ్ దాకా మాత్రమే చదివిన 20 సంవత్సరాల గుజరాత్ యువకుడు బాబూ భాయ్.. (అసలు పేరు విఠల్దాస్ మాధవి ఖక్కడ్) కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం (కేరో గ్యాస్) తయారీ వ్యాపారంలో ఉన్నవాడు.. ఈ సీక్రెట్ రేడియోకు ముఖ్య నిర్వాహకుడిగా ఉన్నాడు. రామ్ మనోహర్ లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనుడు ఇతనే. 1943 మే తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇతను ఈ రేడియో ప్రసారాల కారణంగా అనుభవించాడు. నారీమన్ అబరాబాద్ నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ రావల్పిండిలో జన్మించి లాహోర్‌లో చదువుకున్నారు. మెట్రిక్యులేషన్ తరవాత వైర్లెస్ విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి బొంబాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ప్రారంభించి అందులో శిక్షణ ఇచ్చేవారు. ఇంగ్లండు వెళ్లి టెలివిజన్ గురించి అధ్యయనం చెయ్యాలని ప్రయత్నించి సఫలుడు కాలేక వెనక్కు వచ్చి బాబూభాయ్ కేరోగ్యాస్ వాణిజ్యంలో చేయి కలిపారు. దీన్ని కూడా నిషేధించాక, బాబూ భాయ్‌కు సీక్రెట్ రేడియో ట్రాన్స్‌మీటర్ నిర్మించి ఇచ్చారు ఈ ప్రింటర్ మహాశయుడు. మరో నలుగురు బాబూ భాయ్, ఉషా మెహతా, నారిమన్‌తో పాటు గుజరాత్ భావనగర్ ప్రాంతానికి చెందిన 28 సంవత్సరాల విఠల్దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్లెస్ నిపుణులు నానక్ ఘర్చంద్ మోత్వానే, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 సంవత్సరాల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్లు లోహియా రేడియోలో కీలకపాత్రలను పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజన్స్ రికార్డులలో ఉన్నాయి కనుక వారి పేర్లు మాత్రమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఎందరో అజ్ఞాత వీరుల సేవల గురించీ, ఈ సీక్రెట్ రేడియో గురించీ.. 1988 దాకా నేషనల్ ఆర్కైవ్స్‌లో దాగివున్న ఈ పోలీసు ఫైలు పరిశోధకులు గౌతమ్ ఛటర్జీ కంటపడకపోతే.. మనకు తెలిసి వుండేది కాదు. ఆ అజ్ఞాత వీరులు దేశవ్యాప్తంగా సమాచారం సేకరించి ఆ చీకటి రోజుల్లో రేడియో ప్రసారాల క్రతువుకు ఇచ్చేవారు. –డా నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: క్విట్ ఇండియా రేడియో! సీక్రెట్ ఫైల్స్) -
ఉద్యమశీల కార్యకర్త.. రామ్ మనోహర్ లోహియా
లోహియా కులాంతర వివాహాలయితేనే∙ఏ పెళ్లికయినా వెళ్లేవారు. విడాకులను సమర్థించారు. ఆస్తికి ఆయన వ్యతిరేకి. దానిని ఆచరణలో చూపించారు కూడా. ఆయన హరిజన దేవాలయాలకూ వెళ్లారు. జాతికి కొత్త జవ జీవాలను తీసుకురావడానికి ఆయన తాను చేయగలిగిందంతా చేశారు. ఆయన తన యాభై ఏడేళ్ల జీవితంలో మొత్తం ఇరవై సార్లు అరెస్టు అయినట్లు ఎక్కడో చదివాను. చదవండి: ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి లోహియా ఢిల్లీ వార్తాపత్రికలకు పెద్ద పెద్ద ఆదర్శాలతో వ్యాసాలు రాయడానికే పరిమితం కాలేదు. పేదల కోసం తన పోరాటాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. బహుశా అందుకే కావచ్చు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చాకే జరిగాయి! ఆయన బాగా చదువుకున్న, బాగా పర్యటనలు చేసిన రాజకీయ నాయకుడు. డాక్టర్ లోహియా అనే పేరులోని డాక్టర్ అనే మాట ఆయన చేసిన పరిశోధనలకు లభించింది. బెర్లిన్ నుంచి ఎకనామిక్స్‌లో ఆయనకు డాక్టరేట్ లభించింది. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్లు. పరిశోధనను జర్మనీ భాషలో చేశారు. బ్రిటన్‌లో చదువుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కులం, మతం, జాతి, రాజకీయాలు, సంగీతం, కళలు, అర్థశాస్త్రం, రాజ్యాంగం, న్యాయశాస్త్రం, సాహిత్యం వంటి అంశాలను సమదృష్టితో పరిశీలించి, విమర్శించారు. ఆయన ఢిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న తన ఇంటి తలుపులను అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తన మాట్లాడవచ్చు. మా నాన్నగారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆయనకు సహచరుడు. ఆయన తరచు లోహియా ఇంటికి వెళుతుండేవారు. లోహియా హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతుండేవారు. ఇంగ్లిషు మీద ఆయన పోరాటం సాగించినప్పటికీ, ఆ భాషలో కూడా నిష్ణాతుడే. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద మనుషుల మధ్య అసమానతలు ఉంటూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ అంతరం మరీ దుర్భరంగా ఉంటోంది’’ అని ఆయన ఆవేదన చెందేవారు. ఆయన బతికి ఉంటే ఇప్పుడు కూడా జైల్లోనే ఉండేవారేమో. – నిరంజన్ రామకృష్ణ, లోహియా వెబ్సైట్ రూపకర్త -
‘లోహియా’ పేరిట రాజకీయాలు
న్యూఢిల్లీ/లక్నో: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రామ్మనోహర్ లోహియా అనుచరులమని చెప్పుకునే పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. లోహియా సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పే పార్టీలు ఆయన పోరాడిన కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుకు ప్రయత్నాలు సాగించడం గర్హనీయమన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ‘అవకాశవాద కల్తీ కూటమి’గా ఏర్పడుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే లోహియా ఆత్మ నిజంగా క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. తలాక్ బిల్లును వ్యతిరేకించారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు తెలిస్తే లోహియా గర్వపడేవారని మోదీ తెలిపారు. ‘ లోహియా ఆలోచనలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సించాయ్ యోజన, ఈ–నామ్, భూసార పరీక్ష కార్డులు(ఎస్‌హెచ్‌సీ) జారీచేస్తున్నాం’ అని వెల్లడించారు. కులతత్వం, లింగ వివక్ష లోహియాను చాలా బాధించేవన్నారు. ‘కానీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయిన రాజకీయ పార్టీలు దీన్ని పట్టించుకోలేదు. వీరంతా లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నామని అబద్ధాలు చెప్పారు’ అని అన్నారు. దేశానికీ ద్రోహం చేస్తారు లోహియా ఎప్పుడూ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ భయంతో వణికిపోయేదని మోదీ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రైతులను వేధించింది. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచింది. కానీ కాంగ్రెస్ నేతల స్నేహితులు, బంధువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. దేశభద్రతను విస్మరించారు. లోహియా కరుడుకట్టిన కాంగ్రెస్ వ్యతిరేకి. ఈరోజు లోహియా తమకు స్ఫూర్తి అని చెప్పుకునే పార్టీలు ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఆయన్ను అవమానించే ఏ అవకాశాన్నీ విపక్ష నేతలు వదులుకోవడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని ఆయన చూసుంటే భయపడిపోయేవారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ విమర్శలను ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తిప్పికొట్టారు. బీజేపీ ప్రస్తుతం మనోవైకల్యంతో బాధపడుతోందన్నారు. ‘ఓవైపు మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేద్కర్, రామ్మనోహర్ లోహియా, భగత్‌సింగ్, సర్దార్ పటేల్ ఆదర్శాలను పాటిస్తున్నట్లు బీజేపీ చెబుతుంది. అంతలోనే ఈ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించే, అసహ్యించుకునే వ్యక్తులను అనుసరిస్తోంది. వాళ్లు ఏ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకావట్లేదు’ అని వ్యాఖ్యానించారు. -
అడ్మిట్ కార్డ్ మీద స్టార్ హీరో ఫోటో..!
అలహాబాద్ : విద్యార్థులకే కాక జంతువులకు అడ్మిట్ కార్డ్ ఇచ్చిన యూనివర్సిటీలు ఉన్న దేశం మనది. వాటికి పోటీగా మరో యూనివర్సిటీ వచ్చి చేరింది. అయితే ఈ యూనివర్సిటీ మాత్రం కాస్తా పద్దతిగా విద్యార్థి స్థానంలో జంతువుకు బదులు ఓ స్టార్ హీరో ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చింది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ గొండా జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ పరిధిలోని రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ్ కాలేజిలో అమిత్ ద్వివేది అనే విద్యార్థి బీ ఈడీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది పరీక్షల నిమిత్తం ఇచ్చిన అడ్మిట్ కార్డ్ మీద అమిత్ ఫోటోకు బదులుగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చారు. ఇది గమనించిన అమిత్ ఈ విషయాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అందుకు వారు పొరపాటున అలా జరిగి ఉంటుంది.. ఏం కాదు అంటూ పరీక్షలకు అనుమతిచ్చారని తెలిపాడు. అయితే అమితాబ్ బచ్చన్ ఫోటోతో ఉన్న అడ్మిట్ కార్డ్‌తో పరీక్షలు రాశాను.. ఇప్పుడు మార్క్స్ షీట్ మీద కూడా అమితాబ్ బచ్చన్ ఫోటో వస్తే నా పరిస్థితి ఏంటి అంటూ వాపోతున్నాడు అమిత్. ఈ విషయం గురించి రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ్కు చెందిన ఓ సీనియర్ అధికారిని ప్రశ్రించగా.. ‘అమిత్ ఇంటర్ నెట్ సెంటర్లో పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో తప్పిదం దొర్లడం వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. లేదా ఇది యూనివర్సిటీ తప్పిదం కూడా అవ్వొచ్చు. ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్ది, మార్క్స్ షీట్లో అమిత్ ఫోటో వచ్చేలా చేస్తాం’ అని తెలిపారు. -
రామ్మనోహర్ లోహియాకు భారతరత్న?
సాక్షి, న్యూఢిల్లీ : సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్నను ఇవ్వాలంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారత స్వతంత్రోద్యమంలో లోహియా ప్రాతను గురించి మూడు పేజీల సుదీర్ఘ లేఖను ప్రధానికి పంపారు. నెహ్రూ కాలంలో కాంగ్రెసేతర పార్టీలను లోహియా ఏకతాటిపైకి ఎలా తెచ్చారనే అంశాన్ని లేఖలో వివరించారు. పరిసరాల పరిశుభ్రత, మహిళల సాధికారతకు అప్పట్లో లోహియా చేసిన కృషిని వర్ణించారు. పోర్చుగీసు ఆధీనం నుంచి గోవా రాష్ట్రాన్ని విముక్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన కృషికి గుర్తుగా పణాజీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి లోహియా పేరు పెట్టాలని నితీశ్ కుమార్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మరుగుదొడ్లు నిర్మిస్తే నెహ్రూకు వ్యతిరేకంగా పోరాడటం మానేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి లోహియా అని చెప్పారు. ఇళ్లలోని వంటశాలల్లో చిమ్నీలను పెట్టుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుకోవచ్చని సూచించిన సహేతుకవాది లోహియా అని పేర్కొన్నారు. దేశం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన లోహియా వంటి వ్యక్తికి ఆయన జయంతి(అక్టోబర్ 12)న భారతరత్న ప్రకటించాలని లేఖలో నితీశ్ మోదీని కోరారు. -
నాయినికి ‘లోహియా’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: రామ్మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీవితసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బుధవారం రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. సోషలిస్టు నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి లోహియా అని కొనియాడారు. అలాంటి మనిషి అడుగు జాడలలో పని చేసిన నాయిని.. రామ్ మనోహర్ లోహియా పురస్కారానికి సరైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాలాతీత చింతనాపరుడు
విశ్లేషణ ఈ భువి మీద నివసించే ప్రజలంతా కలసి ఎన్నుకునే ఒక ప్రపంచ పార్లమెంట్, ఒక ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ వలసవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచం మీద అందరికీ సమాన హక్కులు ఉండాలని భావించారు. పౌరహక్కుల కోసం అమెరికాలో సాగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అందులో పాల్గొని అరెస్టయిన భారతీయుడు బహుశా లోహియా ఒక్కరే. మనిషి రంగు ఆధారంగా చెలరేగే జాత్యహంకారాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ప్రజలు నేను చెప్పేది వింటారు. కానీ అది నేను మరణించాక జరుగుతుంది’ ఈ మాటను రామ్ మనోహర్ లోహియా తరచూ చెప్పేవారు. ఈ సునిశిత వ్యాఖ్యను గురించి లోతుగా ఆలోచించడానికి ఆయన యాభయ్యో వర్ధంతి (అక్టోబర్ 12)కి మించిన సందర్భం మరొకటి ఉండదు. నిజం చెప్పాలంటే రామ్ మనోహర్ లోహియా 21వ శతాబ్దపు చింతనాపరుడు. తన కాలానికి అతీతంగా ఆలోచించినవారు. ఆధునిక భారత మహోన్నత రాజకీయ చింతనా సంప్రదాయంలో చివరివాడు కూడా ఆయనే. ఆ చింతనా ధోరణికి చెందిన వారిలో ప్రస్తుతం భారతదేశానికి తగిన ఆలోచనాపరుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే నిస్సంశయంగా మళ్లీ లోహియా అనే చెప్పవచ్చు. కొత్త తరాల వారికి ఆయన ఎవరో కూడా తెలియదు కాబట్టి, అసలు లోహియా అంటే ఎవరు అన్న అంశం దగ్గర నుంచి మొదలుపెట్టడం అవసరం. 1910లో పుట్టిన లోహియా స్వాతంత్య్ర సమరయోధుడు. సోషలిస్ట్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరాన్ని ఐక్యం చేయడానికి స్ఫూర్తిగా నిలిచినవారాయన. స్వతఃసిద్ధంగా విద్యావంతుడైన లోహియా జర్మనీలో పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన విరివిగా రచనా వ్యాసంగాన్ని నిర్వహించారు. ఒక్క రాజకీయ పరిణామాలను, సిద్ధాంతాలను విశ్లేషించడమే కాదు, చరిత్ర, పురాణాలు, తత్వశాస్త్రం గురించి కూడా ఆయన ఎన్నో రచనలు అందించారు. ఎందరో రచయితలకు, కళాకారులకు కూడా స్ఫూర్తి కేంద్రంగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లోహియా నాయకుడు, ఆలోచనాపరుడు. ఇవాళ్టి రాజకీయాలలో అలాంటివారు అత్యంత అరుదు. మొదట అపోహలు తొలగించుకోవాలి లోహియా జీవితం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే మొదట ఒక పనిచేయాలి. లోహియాకు సంబంధించి మన సమష్టి జ్ఞాపకాల నిండా పరుచుకుని ఉన్న గందరగోళాన్నీ, దురభిప్రాయాలనూ తుడిచి పెట్టాలి. ఆయన కాలంలోను, ఆయన తదనంతరం కూడా మేధావి వర్గం ఒక పద్ధతి ప్రకారం ఆయన పట్ల దురభిప్రాయాలను ఏర్పరుచుకుంది. ఆయన చేసిన మూడు ‘పాపాల’ను బట్టి మేధావి వర్గం ఎప్పటికీ క్షమించదేమో! యావద్భారతం అవతార పురుషునిగా, దైవాంశసంభూతునిగా ఆరాధిస్తున్న సమయంలో జవహర్లాల్ నెహ్రూను లోహియా విమర్శించారు. అలాగే కులం గురించి మాట్లాడడానికి ఎవరూ అంగీకరించని కాలంలో ఆయన అగ్రకుల ఆధిపత్యం గురించి నిలదీశారు. చివరిగా–ఇంగ్లిష్ భాష రద్దుకు ఉద్యమించారు. ఈ మూడు అంశాలే లోహియాను ఆయన సమకాలీన విధాన రూపశిల్పులకే కాదు, ఉదారవాదులకు, వామపక్షవాదులకు కూడా ఏమాత్రం గిట్టని వ్యక్తిగా నిలబెట్టాయి. ఈ కారణంగానే లోహియా విస్మృత నేతగా మిగిలారు. లేదంటే అసంగతాల ఆధారంగా గుర్తు చేసుకునే వ్యక్తిగా ఉండిపోయారు. రిజర్వేషన్లు అంటే! మూడు కారణాల వల్ల లోహియాను మనం తరచూ స్మరించుకుంటాం. మొదటిది– ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత. రెండు– ఓబీసీలకు రిజర్వేషన్లు, మూడు– ఇంత క్రితం పేర్కొన్న ‘అంగ్రేజీ హఠావో’ నినాదం. లోహియా అసలు ఉద్దేశమేమిటో సరిగా అర్థం చేసుకోలేదనడానికి ఈ మూడు అంశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇందులో ఆయన కాంగ్రెస్ వ్యతిరేకత లేదా కాంగ్రెసేతర వాదం 1960 దశాబ్దం నాటి ఒక వ్యూహం మాత్రమే. అప్పుడు ప్రతిపక్షాల అనైక్యత కారణంగా కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించేది. ‘శూద్రు’లకు రిజర్వేషన్ కల్పించాలని మొదటిగా వాదించినవారిలో లోహియా ఒకరు. ఆయన ఉద్దేశంలో ఈ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించవలసిన వారు ఓబీసీలతో పాటు దళితులు, ఆదివాసీలు, స్త్రీలు కూడా. ఇందులో మళ్లీ కులం, వర్గం విభేదాలు కూడా ఉండవు. ఆయన దృష్టిలో రిజర్వేషన్ల అంతిమ లక్ష్యం సామాజిక న్యాయాన్ని సాధించడం ఒక్కటే కాదు. రిజర్వేషన్లు అంటే లోహియా దృష్టిలో స్త్రీపురుష సమానత్వాన్ని సాధించేందుకు, అన్ని కులాలకు సమాన హక్కులు కల్పించడానికి ఉద్దేశించిన విస్తృత పోరాటం. అధికార భాషగా ఇంగ్లిష్ భాషను కొనసాగించడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ వాస్తవిక అధికార భాషగా ఇక్కడి ప్రజా జీవితం మీద ఇంగ్లిష్ భాష సాగి స్తున్న స్వారీని మాత్రమే లోహియా వ్యతిరేకించారు. ఒక భాషగా ఇంగ్లిష్‌ను వ్యతిరేకించలేదు. ఆ భాషా సాహిత్యాన్ని కూడా నిరసించలేదు. ఆయనకు అందులో ఎంతో ప్రవేశం ఉంది. అలా అని ఆయన ఇంగ్లిష్ స్థానంలో హిందీని ప్రవేశపెట్టాలని కూడా భావించలేదు. ఇంగ్లిష్ స్థానంలో భారతీయ భాషలను ఉపయోగించాలని ఆశించారు. ఈ అంశాల గురించిన దురభిప్రాయాలను మనం వదిలించుకుంటే లోహియా అంటే ఏమిటో చూడడానికి అవకాశం కలుగుతుంది. గొప్ప చింతనాపరుడు లోహియా లోహియా యథాతథ స్థితిని ఛిద్రం చేయాలనుకునే తత్వం కలిగినవారు. ఒక ద్రష్ట. వలసవాద అనంతర కాలానికి చెందిన గొప్ప చింతనాపరుడు. నిఖార్సయిన భారతీయుడు. అదే సమయంలో సహేతుకమైన అంతర్జాతీయవాది. పెట్టుబడిదారీ విధానం –కమ్యూనిజం, జాతీయవాదం– అంతర్జాతీయ వాదం, సంప్రదాయం– ఆధునికత అనే 20వ శతాబ్దపు ద్వైదీభావపూరిత∙సూత్రాలకు అతీతంగా లోహియా మనకు మూడో మార్గాన్ని చూపారు. ఐరోపా చరిత్రలో మరోసారి జీవించాలని ఐరోపాయేతర సమాజాలు ఆలోచించలేవని, నిజానికి ముమ్మాటికీ అలా ఆలోచించరాదని కూడా ఆయన చెప్పారు. భారత వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి తాజాగా ఆలోచించడానికి ఆయన వాకిలి తెరిచారు. సామ్యవాదం అనేది పెట్టుబడిదారీ విధానానికీ, కమ్యూనిజానికి భిన్నమైన సిద్ధాంతమని లోహియా భావన. 20వ శతాబ్దానికి చెందిన ఆ రెండు ఆర్థిక సిద్ధాంతాలు భారీ పరిశ్రమలు, విస్తృత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, కేంద్రీకరణల యావలో పడినాయని ఆయన అన్నారు. అలాంటి నమూనా రావాలంటే వలస దోపిడీతోనే సాధ్యమని, మిగిలిన ప్రపంచంలో సమత్వానికి అవి ఉపకరించవని లోహియా వ్యాఖ్యానించారు. అందుకు ప్రత్యామ్నాయంగా, లేదా మూడో మార్గంగా ఆయన చిన్న తరహా సాంకేతిక పరిజ్ఞానం, గ్రామీణ పరిశ్రమలు, వికేంద్రీకరణలు పునాదిగా ఉండే సోషలిజాన్ని ప్రతిపాదించారు. ఉత్పత్తి సాధనాల మీద ప్రభుత్వం, ప్రైవేట్ ఆధిపత్యం గురించిన చర్చను పూర్వపక్షం చేసి, దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తుల మీద సహకార యాజమాన్యాన్ని ప్రతిపాదించారు. ఆధునికతకు అర్థం చెప్పినవాడు సాంస్కృతిక పరమైన ఉనికిని గురించి వర్తమానంలో జరుగుతున్న చర్చల విషయంలో కూడా లోహియా మూడో మార్గాన్ని చూపించారు. యుద్ధోన్మాద జాతీయ వాదానికీ, విధ్వంసక కాస్మొపోలిటన్ సంస్కృతికీ మధ్య సాంస్కృతిక పునాది కలిగిన అంతర్జాతీయ వాదం మెరుగైనదని లోహియా భావించారు. భారతీయ స్త్రీవాదానికి ద్రౌపది ప్రతీక అని ఆయన చెప్పారు. ఉత్తర, దక్షిణ భారతాల వారధిగా ఆయన రామాయణాన్ని పరిగణించారు. అలాగే మహా భారతం తూర్పు, పడమర ఐక్యతకు చిహ్నమని చెప్పారు. సంప్రదాయబద్ధమైన, సంప్రదాయ విరుద్ధమైన రెండు తరహాల రామాయణాలను ప్రవచించే విధంగా ఒక మేళాను నిర్వహించాలన్నది ఆయన కల. భారతదేశంలో నదుల దుస్థితిని గురించి మొదట గొంతెత్తినది కూడా ఆయనే. అలాగే పుణ్యక్షేత్రాల పరిశుభ్రత గురించి ఆయనే వివరించారు. చైనా కుట్రల గురించి మొదట హెచ్చరించినవారు, హిమాయల సరిహద్దుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం గురించి నెహ్రూను నిలదీసిన వారు కూడా లోహియానే. సాంస్కృతిక మూలాలే పునాదిగా రాజీలేని లౌకికవాద భావనలకు, ఆధునిక దృష్టికి, అంతర్జాతీయ దృష్టికి నిబద్ధునిగా కనిపించే వ్యక్తి లోహియా. అసలు ఈ భువి మీద నివసించే ప్రజలంతా కలసి ఎన్నుకునే ఒక ప్రపంచ పార్లమెంట్, ఒక ప్రభుత్వం ఉండాలని ఆయన కోరుకున్నారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ వలసవాదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రపంచం మీద అందరికీ సమాన హక్కులు ఉండాలని భావించారు. పౌరహక్కుల కోసం అమెరికాలో సాగిన ఉద్యమానికి మద్దతు ఇచ్చి, అందులో పాల్గొని అరెస్టయిన భారతీ యుడు బహుశా లోహియా ఒక్కరే. మనిషి రంగు ఆధారంగా చెలరేగే జాత్యహంకారాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నిటితో పాటు లోహియా ఆధునికత గురించి కూడా ఒక కొత్త ఆలోచనా ధోరణికి శ్రీకారం చుట్టారు. అది 20వ శతాబ్దాన్ని శాసించిన ద్వైదీభావాలకు అతీతమైనది. అనుకరణతో కూడిన ఆధునికతను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనినే మనం పట్టణ ప్రాంత, విదేశీ భావాలు ఉన్న భారతీయులలో గమనిస్తూ ఉంటాం. పురాతనమైన ప్రతి అంశం కూడా ఔదలదాల్చదగినదని వాదించే సంప్రదాయవాదులను కూడా ఆయన నిరసించారు. ప్రతి ఆధునిక ఆవిష్కరణ పురాతన కాలంలోనే ఉన్నదని వాదించే వారి ధోరణిని వ్యతిరేకించారు. ఆయన దేశీయమైన ఆధునికత గురించి స్వప్నిం చారు. ఐరోపాకు ఇప్పటివరకు తెలియని ఒక ఆధునికతను సృష్టించాలని లోహియా విశ్వవిద్యాలయ స్నాతకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒకసారి బోధించారు. యాదృచ్ఛికమేమిటంటే, ఆ ఉపన్యాసం ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి ఇచ్చారు. యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు మొబైల్ : 98688 88986 -
చావుపుట్టుకలే ఆయనవి, బతుకంతా ప్రపంచానిది
సందర్భం పాతతరం కొత్తతరానికి కేవలం జ్ఞాప కాలనే కాకుండా స్ఫూర్తిని కూడా అంది స్తుంది. వారి భుజాలనెక్కి దూసుకొచ్చే కాలప్రవాహాన్ని అంచనా వేసి తగు చర్యలు తీసుకోమంటుంది. ఆ పాత తరం నాయకులు సత్యాన్వేషకులైతే, తాము దర్శించిన దర్శనాల్లోంచి, ఆచరణ బాటలోంచి భావితరాలవారికి మనోబలాన్ని సృష్టించిపోతారు. అటు వంటి హృదయ చక్షువులతో ప్రపంచాన్ని దర్శించిన అరుదైన నేతల్లో రామ్మనోహర్ లోహియా ఒకరు. ఈయన మహాత్మా గాంధీకి దగ్గరి అనుయాయే కానీ భావాలలో అవసరమైతే ఆయనతోనూ విభేదించే స్వతంత్రాలోచనా ఉంది. దగా పడుతున్న వాడికి న్యాయం జరగాలంటే తాను నమ్మిన సోషలిజం మూలాలనూ ప్రశ్నించే సాహస ప్రవృత్తి ఉంది. జర్మనీలో చదువుకున్నారు. ప్రపంచ మార్పులను గమనిం చారు. తిరిగివచ్చి గాంధీజీతో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. దేశమంతా సంచరించేందుకే సమయం సరిపోని వ్యక్తి గనుక పెళ్లి చేసుకోలేదు. దేశంలో సోషలిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు. ఆయన అనుభవాల్ని ‘రాజకీయాల మధ్య తీరికవేళలు’ అనే తన పుస్తకంలో పొందుపరిచారు. సమా జంలో ఘర్షణలు ఎందుకొస్తున్నాయ్? సమానత్వం ఎందుకు లేదు? వాటి మూలాలేంటి? వాటిని పరిష్కరించడం ఎట్లా ? అనేదే లోహియా సమగ్ర రచనల సారం. అందుకు తన పరిధిలో చేయాల్సినదంతా చేశారాయన. లోహియా లోకాన్ని వదిలి 50 ఏళ్లు కావొస్తుంది . కానీ ఇప్పటి సందర్భం, శకలాలు శకలాలుగా విడిపోయి ఉన్న సమాజ సందర్భం. గెలిస్తే అమెరికాకు ఎదురులేని ప్రపంచ సార్వభౌమాధికారాన్ని కట్టిపెడతానంటూ రంకెలేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌ని అమెరికన్ రిపబ్లికన్ సమాజం ఆమోదిస్తున్న సందర్భం. నీవు భారతమాతకు ైజై అనకపోతే ఈ దేశంలో ఉండొద్దు అని హుకుం జారీ చేసే నేతలకు చప్పట్లు కొడుతున్న సందర్భం. భారత్ మాతాకి జై అని ఎందుకు అనాలి? నేను అనను, అని మరో వర్గపు నేతలు అంటే కూడా చప్పట్లు కొడుతున్న సందర్భం. ఈ దేశంలో నా పుట్టుకే ఓ శాపం అని బాధపడుతున్న రోహిత్‌ల ఆగ్రహపు ఆందోళనలను టైస్ట్, యాంటి నేషనల్ అని ముద్రవేసి ప్రభుత్వాలే వారి గొంతును అణచివేస్తున్న సందర్భం. అధికారం కోసం మనుషులని కులాల పేరుతో రెచ్చగొట్టి, ఓట్లుగా మలచుకుని, ఆ ప్రజల బాగోగుల్ని గాలికి వదిలేస్తున్న సందర్భం. ఇది ఓ విచిత్రమైన గ్లోబలైజ్డ్, లిబరలైజ్డ్ సందర్భం. గాయం అవుతుంది. అందరూ శత్రువు ఎక్కడా అని వెతికేవాళ్లే. ఆ గాయంలో తన పాత్ర కూడా ఉందని తెలిసినా నిజాన్ని ఒప్పుకునే ధైర్యంలేక, నీవంటే నీవని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అటువంటప్పుడు ఏదైనా గాయానికి మూల కారణం కనుక్కోవాలంటే, సత్యం తెలుసుకోవాలంటే భయం. సత్యం తెలిస్తే తనకు అధికారం, గుర్తింపూ ఉండదనే అభద్రత. అతనికి ప్రజల్లో ఎంత గందరగోళం ఉంటే అంత లాభం కాబట్టి ప్రజలను కూడా విడగొట్టి గందరగోళ పరుస్తాడు. లోహియా కాలంలో శత్రువు బయటివాడు కాబట్టి, వాడు ఎవడో స్పష్టంగా గుర్తించే కాలం అది. దాని మీద పోరాడ డానికి ప్రజల్ని ైచైతన్యపరిచి కదిలించగలిగారు. ఈ గ్లోబలైజ్డ్, క్యాపిటైలైజ్డ్ కాలంలో శత్రువు ఫలానా అని గుర్తించడానికి వీలుండదు. ఇది అంతర్గతమైనది. స్తబ్దతకు, భద్రతకు, సౌక ర్యానికి, చైతన్య రాహిత్యం, స్వార్థం అనే విషపు కోరలో్ల చిక్కుకున్న మనిషి మనస్తత్వమే ఇపుడు దేశానికి శత్రువు, అందుకని అంతర్గతంగా ఉన్న శత్రువు బయట ఎట్లా దొరుకుతాడు? ఈ కాలం, వ్యక్తి కేంద్రీకృత పోటీ కాలం. ఒకడు ఇంకొకడి గురించి ఆలోచించడానికో, వినడానికో కూడా సమయం దొరకని కాలం లేదా విననట్లు నటిస్తున్న కాలం. ఏదో ఒక శకలంతో ఐడెంటిైఫై చేసుకుని భద్రతను కోరుకుంటున్న కాలం. నేను బాగుంటే చాలు అనుకునే కాలం. ఆ స్తబ్దత భూతమే మహా రాక్షసిగా మారి ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ అందరినీ గాయపరుస్తుంది. ఈ అంతర్గత శత్రువులను మేలొ్కల్పుతున్న ఈ గుర్తు తెలియని రాక్షస స్వైరవిహారంలో అందరం బాధితులమే, అందరం భాగస్వా మ్యులమే అయినా, దాని ఎరుక కూడా లేకుండా పరుగు తీస్తున్న కాలం ఇది. ఇటువంటప్పుడు లోహియాలు ఏం చేస్తారనేది ప్రశ్న? వ్యవస్థలోని ఈ ఒక్క ఉదాహరణతోనే ఈ పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇప్పుడు రాజకీయాలు లాభసాటి వ్యాపా రాలు. ఒక్కోడు ఎమ్మెల్యే కావడానికే 10 నుండి 20 కోట్ల పెట్టుబడి పెట్టి గెలవడానికి సిద్ధపడుతున్నప్పుడు దానికి కనీసం మూడు రెట్లన్నీ రిటర్న్స్ రాబట్టుకోకుండా ఎలా ఉంటాడు? క్యాపిటలిస్టు వ్యవస్థతో చేతులు కలుపుతాడు. ప్రజల భాగస్వామ్యమున్న సహజ వనరులతో పాటు, ప్రజల చైతన్యాన్ని , హక్కుల్ని, ఆత్మాభిమానాన్ని కబ్జా చేస్తాడు. అనేక రకాలుగా సమాజం చుట్టూరా అవినీతిని నాటుతాడు. దండ కారణ్యంలోని గిరిజనుల మీద లీగల్ గానే యుద్ధం చేసినట్లు గానే రేపు మన మీదా ఎదో రూపంలో లీగల్‌గానే యుద్ధం చేసి మనల్ని మనం తాకట్టు పెట్టుకునేలా చేస్తాడు. అప్పుడు ఎవడి గోడు ఎవడు వింటాడు. అంతా లీగల్ గానే జరుగు తుంటది కానీ శత్రువు దొరకడు. ఒక కోటి పెట్టుబడి అయిదేళ్ళలో కనీసం 5 కోట్లుగా మారుతున్న ఈ సమాజంలోకి వచ్చి లోహియా ఏం చేయగలడు? దేశానికి విధానాలు నిర్ణయించి, దిశానిర్దేశం చేసే రాజకీయ వ్యవస్థకే ఇలా వైరస్ పడితే, దాని ప్రభావం అన్నిటిమీదా పడి దేశాన్ని అతలా కుతలం చేస్తుంది. అటువంటి ఈ స్థితిలో, సాక్షాత్ లోహియానే ఎలక్షన్లో పోటీ చేస్తే డిపాజిట్ దొరకదు అనే అంశంలో సందేహం అక్కర్లేదు. డబ్బే, కులమే, మతమే గెలుస్తుంది అనే బలమైన నమ్మకం ప్రజలో్ల నాటుకుపోయింది. అది సరియైన దారి కాదు అని అంటూనే అందరం అందులో భాగస్వా మ్యులం కావడమే అత్యంత విషాదం. ఇటువంటపుడు లోహియాలు ఏం చేస్తారనేది ప్రశ్న? ఇలా వ్యవస్థలోనే లోపం ఉన్నప్పుడు లోహియా ఏం చేసేవాడో అనిపిస్తుంటుంది. ఓసారి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ దగ్గరికెళ్లి ‘ఇప్పుడు ప్రపంచాన్ని ఇద్దరు ఆకర్షిస్తున్నారు. ఒకరు గాంధీ, రెండోది మీరు. గాంధీ ప్రపంచాన్ని కలిపేందుకు అహింసా శాంతి మంత్రాల్ని బోధిస్తే మీరు హింసను, భయాన్ని కలిగించే ఆటంబాంబును కనుక్కున్నారు’ అని నిర్మొహమాటంగా లోహియా చెప్పేసరికి ఐన్‌స్టీన్ మొదట కంగుతిని తరువాత ప్రస్తుతించాడు. కమ్యూనిస్టు యుగో స్లేవియాకు వెళ్లి, అక్కడి కమ్యూనిజాన్ని విషపు కోరలు ఉన్న దానిగా, అమెరికాకు వెళ్లి, క్యాపిటలిజాన్ని భయంకర భూతంగా వర్ణించిన లోహియా జీవితాన్ని, నైజాన్ని తెలిసిన వారెవరైనా ఒకటి మాత్రం చెప్పగలరు. ఈ కాలంలో ఆయనే ఉంటే పదవులనే ఆశను నేలకు కొట్టి, ఇల్లిల్లు, వీధివీధి తిరుగుతూ మనకు పట్టిన చెదలు పురుగుల్ని విప్పి, మన జడత్వాన్ని బండకేసికొట్టేవాడు. రోహిత్, కన్హయ్యల పోరాట ఆగ్రహాన్ని ఇంకో కోణంలో దర్శించేవారు. ఈ లోహియానే ఒకప్పుడు, మంత్రి పదవిని ఇస్తాను తను కేబినెట్లోకి రమ్మని ఆహ్వానించిన నెహ్రూతో, ప్రతిపక్షమైతే ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడతాము అని తిరస్కరించి, ప్రభుత్వాన్ని నిరంతరం మేలుకునేట్లు చేశారు. అటువంటి లోహియా ఈ కాలంలో ఉంటే, ఈనాటి కలహాల ట్రంపులకు; జాతీయత గురించి తమకే పేటెంట్ హక్కున్నట్లు లక్ష్మణ రేఖల్ని గీస్తున్న మతతత్వపు నేతలకు బహుళత్వంలోని జీవన సౌందర్యాన్ని, భిన్నత్వంలోని ఏకత్వపు మాధుర్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించేవారు. ఆయన ఓసారి ‘‘మనుషులకు పునర్జన్మలున్నాయని నమ్మను కానీ, ఓ దేశానికి మాత్రం ఉంటుంది. ఎందుకంటే, దేశాన్ని బాగుచేసుకోవాలని చేపట్టే ఇప్పటి మంచి చర్యలే రేపటి తరాల వారికి మంచి ఫలితాల రూపంలో పునర్జన్మగా అందుతాయి’’ అన్నాడు. అందుకైనా అతను నిరంతరం మెళకు వతో ఉంటూ, సమాజాన్ని ఎరుకలో ఉంచేవాడు. ‘‘సోషలిజానికి శాశ్వత నిర్వచనాలు ఉండవంటూ, నిత్యం దాన్ని ఎవరికివారు కొత్తగా కనుక్కోవాల్సింది’’ అనే ఆయన మాట బుద్ధుడిలాంటి మాట. విశ్వమత హృదయంతో అంద రినీ తనలో, అందరిలో తనను చూసుకునే వారే మహానేతలు. వారి వెంట జనాలు ఉండనీ లేకపోనీ; పరిస్థితులు అనుకూ లించనీ, లేకపోనీ; పదవులు ఉండనీ లేకపోనీ కానీ వారు మాత్రం తానున్న మేర, తానున్న పరిసరాల్లో తన ఆచరణ జ్యోతి అనే కాగడాలను పట్టుకుని పొద్దునే విశ్వైక్యసమతా రాగాన్ని పాడుకుంటూ గడపగడపకు తిరిగి మనుషుల్ని మేల్కొ ల్పుతారు. ఈరోజు కాకున్నా రేపన్నా మార్పు రాకపోతుందా అనే ఆశని కల్పిస్తారు. అటువంటి మహానాయకుల్లో రామ్ మనోహర్ లోహియా ఒకరు. పుట్టుక ఆయనది, చావు ఆయ నది. కానీ బతుకంతా ప్రపంచానిది. (నేడు హైదరాబాద్‌లో లోహియా 106వ జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా) - ఎ. గంగారెడ్డి వ్యాసకర్త బెడ్ఫోర్డ్ యూనివర్సిటీ(యూకే) అలుమ్ని మొబైల్: 9000022443 -
లోహియా పరిచిన వసంతం చిగురించేనా?
ఏ దేశమైనా ఒక తాత్వికుడిని కోల్పోతే ఒక కన్ను కోల్పోయినంత లోటు. కానీ తాత్వికుడైన రాజకీయ నాయకుడిని కోల్పోతే మరింత లోటు. కానీ అతను తాత్విక రాజకీయ నాయకుడయ్యీ, కళా, కవి హృదయుడయ్యీ కర్మయోగి కూడా అయితే ఇక ఆ దేశానికి అలాం టి మనిషిని తిరిగి పొందడానికి సాపేక్షంగానైనా ఎంతకాలం పడుతుందో? అలా ఆ దేశం కోల్పోయిన మహనీయుల్లో రామ్ మనో హర్ లోహియా ఒకరు. ఈ దేశంలో సిద్ధాంతాలు సృష్టించేవారూ, పుస్తకాల సమాచారం మెదడులో నింపుకుని ఘర్షణలు సృష్టించే వారూ వేలల్లో ఉన్నారు. అయితే విశ్వమంత హృదయంతో చెప్పిం దే ఆచరించేవారు, తప్పులను సరిదిద్దుకుంటూ అందరినీ కలుపు కునిపోయి నూతన శక్తిని సమకూర్చుకుని విశ్వశాంతికి పరికరంగా మారేవారు అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో లోహి యా అగ్రగణ్యులు. సామాజిక అన్యాయాలు తరాలుగా పాదుకుని ఉన్న దేశంలో తాను చేయాల్సినదంతా చేసి వెళ్లిపోయారు. మిగతా తరాలకు దారి చూపించి వెళ్లిపోయారు. పుట్టింది అగ్రవర్ణ వైశ్యకుల మైనా, కలవరించి తపించింది మాత్రం వేల సంవత్సరాలుగా సామాజిక అన్యాయానికి గురైన జాతుల గురించి మాత్రమే. భారతీయ జీవితంలో అన్నింటికన్నా వినాశనకరమైంది కులం. తరతరాలుగా సామాజిక అన్యాయం పొందిన జాతుల వృద్ధి గురించి మొక్కకు ఎరువులాగా ఉపయోగపడండీ అని అగ్ర వర్ణాలకూ పిలుపు నిచ్చాడు. అధికారాన్ని అందుకునే క్రమంలో శూద్రులకు, హరిజనులకు, మహిళలకు, ముస్లిములకు వారి వారి యోగ్యతలను మించిన ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్నాడు. లోహియా కూడా అట్లాగే జీవించాడు. 1960ల్లో లోక్‌సభలో సోషలిస్ట్ పార్టీ లీడర్‌గా అన్ని అర్హతులున్నా తానో, మధులిమాయేనో కాకుండా బీసీ తరగతికి చెందిన రబీరేనూ, అట్లాగే రాజ్యసభలో రాజ్ నారా యణన్ని కాకుండా పెరిక కులానికి చెందిన మురహరి అనే తెలుగు వ్యక్తిని నియమించాడు. అట్లాగే కింది వర్గాలు అధికారంలోకి వచ్చిన తరువాత అగ్రవర్ణా లను ద్వేషించకుండా కలుపుకుపోవాలి. ఎం దుకంటే వారిలోనూ అన్నీ పోగొట్టుకున్న నిరు పేదలు ఉన్నారన్న విషయాన్ని మరువరాదనీ, కటుత్వం, ద్వేషం వల్ల అధమత్వానికి శాశ్వ తంగా పట్టం కట్టినట్లు అవుతుందని జాగ్ర త్తలు చెప్పాడు. ఆలోచనా స్థాయిలో ద్రౌపది ఏ నాడు కూడా పురుషునితో ఓటమిని అంగీక రించలేదు కాబట్టి భారత స్త్రీలు ఆమెను ఆద ర్శంగా తీసుకొని ధైర్యంగా పోరాడాలని అన్నారు. స్త్రీలను గుడ్డమూటలా తయారు చేయకూడదు. అవసరం వచ్చినప్పుడు పురు షుణ్ణి మూటకట్టుకుని తనవెంట తీసుకొని వెళ్లగల శక్తివంతురాలిగా స్త్రీని రూపొందించాలన్నాడు. ఎంతటి నిరుపేదలైనప్పటికీ ఉన్న దాంట్లో తృప్తిపడుతూ తమ సహజమైన ఆనందాన్ని కొనసాగిస్తున్న ఆదివాసుల నుంచి మిగతా భారతదేశ ప్రజలు ఆ ఆనందం ఎట్లా పొందాలో నేర్చుకోవలసి ఉంటుందని అన్నాడు. ఇలా అందరినీ కలుపుకొని, అందరి నుంచి నేర్చుకోవా లనుకున్నాడు. మార్క్స్ నుంచి గాంధీ వరకు నేర్చుకునేది ఎంతో ఉంది. అయితే నేర్చుకోవడం అనేది నీవు ఇంకొకరి ప్రభావ చట్రం లో ఉండకుండా ఉన్నప్పుడే సాధ్యపడుతుంది అన్న లోహియాలో నిర్మల సత్యాన్వేషిని చూడొచ్చు. అందుకనే అతను గాంధీకి దగ్గర య్యాడు, అంబేద్కరుకూ దగ్గరయ్యాడు. నిత్య నదీప్రవాహమై స్వచ్ఛంగా ప్రవహిం చాడు. ప్రవాహమంతా మెరుపులు కురి పించాడు. భారతదేశంలో అనేక జాతులుగా ఉన్న కుల సమస్యను పరిష్కరించకుండా సోషలి జాన్ని సాధించలేమన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకనే సామాజిక న్యాయం సాధించే క్రమంలో ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రా ల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి పునాది అయ్యాడు. లోహియా సిద్ధాంతాల ద్వారా ఆయన చెప్పిన ఈ సామాజిక సమ స్యలను రూపు మాపగలిగామా, లోహియా చింతనలో కూడా పరిమితులు ఉన్నాయా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు గాక, కానీ లోహియా స్వచ్ఛమైన మేధస్సును, ఆచర ణను శంకించలేము. ‘‘వెనుకబడిన తరగతుల వారు తమ చేతికి అధికారం వచ్చిన వెంటనే ఉన్నత కులాల వారి అలవాట్లను, దుర్గుణాలను అనుక రించాలన్న కోర్కెను అరికట్టుకోవాలి’’అని లోహియా పిలుపు నిచ్చాడు. సామాజిక న్యాయం పొందుతున్న అన్ని కులాల నాయ కులు తాము ఒకసారి అనుభవించిన ఫలాలతో సరిపెట్టుకుని తమలో అనుభవించని మిగతా వారికి అవకాశం ఇస్తేనే లోహియా భావించిన సామాజిక న్యాయం అనే మాటకు న్యాయం జరిగినట్లు అవుతుంది. లేదంటే ఇక్కడ కూడా అధికార కేంద్రీకరణ జరిగి దీంట్లోనూ ఒక రకమైన తక్కువా ఎక్కువా కులాలు ఏర్పడతాయి. సామాజిక న్యాయం పేరుతో అవకాశాలు పొందుతున్న ఓ తండ్రి తరువాత అతని కొడుకులు, వారి బంధువులే ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు కానీ అంతకంటే తక్కువస్థాయి కలిగిన మిగతా వారికి అవకాశం ఇవ్వరు. ఇది అంత మంచిది కాదు. ఇది జరగకుండా ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా పెద్దగా ఉప యోగం లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే ఈ కాలంలో కమ్యూనిస్టు.. కమ్యూ నిస్టుగా లేడు. గాంధీ పేరు చెప్పుకునే పార్టీ వారు గాంధేయులుగా లేరు. లెఫ్టిస్ట్ అనేవాడు లెఫ్టిస్ట్‌గా లేడు. ఒకరు ఇంకొకరితో ఏకం కారు. కాలం మహిమనా? లేదా సిద్ధాంతాలను పునర్ నిర్వచిం చుకోవాల్సిన అవసరమా? మనిషనే పదార్థమే స్వార్థపూరితంగా ఉందా? నిజాయితీగా కనుక్కోవాలి. వ్యక్తి తన స్వార్థం నుంచి విముక్తి కాకుండా, స్వార్థాన్ని అనుక్షణం కడుక్కోకుండా సమా జాన్ని ఉద్ధరిద్దామనే ప్రయత్నం చేయడమంటే తనలో ఊడలు దిగి ఉన్న అహం ఆడే నాటకానికి లొంగిపోవడమే అవుతుంది. సమస్య పరిష్కారం కాకుండా అక్కడక్కడే ఒక వలయం నుంచి ఇంకో వలయంలోకి తిరుగుతుంది కానీ పెద్దగా ఒరిగేదేమీ లేదు. నెపాన్ని శత్రువు అనే పేరుతో లేని వాడిని తయారు చేసుకుని వాడి మీద రుద్దాలని చూస్తుంది. అనుక్షణం ఆత్మవిమర్శ లేకపోతే వాస్తవం నుంచి పారిపోవడమే అవుతుంది. అందుకే చెప్పిందే ఆచ రించే మనుష్యుల కోసం లోహియా ఓ వసంతాన్ని పరిచాడు. ఆ వసంతం చిగురిస్తుందా, మోడుబారుతుందా చూడాలి. (23న రామ్ మనోహర్ లోహియా జన్మదినం) మోతె గంగారెడ్డి (లండన్‌లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి) మొబైల్: 9000022443 -
చంద్రబాబు దీక్ష భగ్నం
టీడీపీ నేతలతో పోలీసుల ముందస్తు సంప్రదింపులు అనంతరం హైడ్రామా నడుమ ఆస్పత్రికి సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దేశ రాజధానిలో చేపట్టిన నిరాహారదీక్షను హైడ్రామా మధ్య శుక్రవారం ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ను స్థానిక రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చంద్రబాబు దీక్ష కొనసాగిస్తున్నట్లు పార్టీ మీడియా కమిటీ చైర్మన్ లింగం వెంకట శివరామకృష్ణప్రసాద్ మీడియాకు పంపిన సంక్షిప్త సమాచారంలో వెల్లడించారు. వాస్తవానికి బాబు దీక్ష ప్రారంభం నుంచే హైడ్రామా మధ్య నడిచింది. ఏపీ భవన్లో ఆయన సోమవారం మధ్యాహ్నం దీక్ష ప్రారంభించగా బుధవారం మధ్యాహ్నం నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఏ క్షణంలోనైనా ఆసుపత్రికి తరలించవచ్చని పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. కానీ అదేరోజు సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మరణంతో మీడియా అటువైపు దృష్టి సారించింది. దీంతో ఆరోజు దీక్ష భగ్నం అయితే తమకు ఆశించిన ప్రచారం రాదని ఆ రోజుకు విరమించుకున్నారు. తీరా గురువారం దీక్ష భ గ్నానికి సిద్ధపడితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అడ్డుపడ్డాడు. క్రికెట్ కు గుడ్‌బై చెప్తున్నానని సచిన్ ప్రకటించటంతో ఆ రోజు మీడియా దృష్టి ఆ వైపు కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలోనే బాబు దీక్ష భగ్నం కార్యక్రమం శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వర్షం కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఉదయం 10.30 సమయంలో బాబు శిబిరంలోకి చేరుకుని పడుకున్నారు. కొద్ది సేపటికి సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానల్ ప్రతినిధి కరణ్ థాపర్ చంద్రబాబును ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చారు. దీంతో ఉత్సాహంగా లేచిన బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తరువాత అధినేత పడుకోగా పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య తదితరులు ఆవేశంగా ప్రసంగించారు. చంద్రబాబు దీక్ష భగ్నానికి కుట్ర జరుగుతోందని, ప్రాణత్యాగం చేసైనా దాన్ని అడ్డుకుంటామన్నారు. ఆ సమయంలోనే ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు ఎస్బీఎస్ త్యాగి, ఎంఎం మీనా, రాజా వీర్‌సింగ్‌లు వచ్చి టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. తాము బలవంతంగా దీక్షను భగ్నం చేయబోమని తమకు సహకరిస్తే ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. తమ కార్యకర్తలు కొద్దిసేపు నిరసన తెలుపుతారని, ఆ తరువాత మీరు చంద్రబాబును తీసుకెళ్లవచ్చని నేతలు చె ప్పారు. దీంతో వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహకరించాల్సిందిగా కోరారు. ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండా దీక్షా వేదిక నుంచి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో ఎక్కి కూర్చున్నారు. ఫ్లెక్సీలపై టీడీపీ నేతల ప్రతాపం: అంబులెన్స్ ఏపీ భవన్ నుంచి బైటకు రాకుండా కార్యకర్తలు సుమారు అరగంటపాటు అడ్డుకున్నారు. అంతకుముందు కూడా ఏపీ భవన్లో టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు హడావుడి చేశారు. అక్కడ ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియాగాంధీల బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, పీసీ చాకో తదితరులు చేసిన వ్యాఖ్యలను వారి ఫొటోలతో పాటు టీడీపీ నేతలు ఒక ఫ్లెక్సీలో ముద్రించారు. ఆ ఫ్లెక్సీని కూడా చింపి దహనం చేశారు. అయినా ఏపీ భవన్ సిబ్బంది, భద్రతా సిబ్బంది కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబును ఆసుపత్రికి తరలించిన తరువాత సోనియాగాంధీ నివాసం ముట్టడికి బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీ సీఎం రమేశ్, వైవీబీ రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు రక్షాభవన్ వద్ద బారికేడ్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కొందరు పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. పండుగ రోజు కుటుంబానికి దూరంగా: బాబు దీక్షను పోలీసులు భగ్నం చేయటాన్ని నిరసిస్తూ శనివారం జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఏఐసీసీ కార్యాలయం ముట్టడి చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ కారణంగా శనివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రత్యేక రైలును నిలిపి వేశారు. ఆ రైలు ఆదివారం బయలుదేరుతుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి వస్తున్న రైలు శనివారం ఢిల్లీ చేరుకుంటుంది. అందులో వచ్చే, ఇప్పటికే నగరంలో ఉన్న నేతలు, కార్యకర్తలతో ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రెండు రైళ్లు ఆదివారం బయలుదేరి మంగళవారం గమ్యస్థానాలకు చేరతాయి. దీనిపై ముఖ్యులు మినహా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఏదో ఢిల్లీ వెళ్లి వద్దామనుకుంటే.. దసరా రోజు కుటుంబసభ్యులతో సరదాగా గడపడానికి వీల్లేకుండా రైల్లో ప్రయాణించాల్సి ఉండటం బాధగా ఉందని పలువురు వాపోతున్నారు. ముఖ్య నేతలు మాత్రం విమానాల్లో గమ్యస్థానాలకు పండుగ రోజే చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారని, తమను మాత్రం ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.