రామ్ మనోహర్ లోహియా(పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియాకు దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్నను ఇవ్వాలంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారత స్వతంత్రోద్యమంలో లోహియా ప్రాతను గురించి మూడు పేజీల సుదీర్ఘ లేఖను ప్రధానికి పంపారు. నెహ్రూ కాలంలో కాంగ్రెసేతర పార్టీలను లోహియా ఏకతాటిపైకి ఎలా తెచ్చారనే అంశాన్ని లేఖలో వివరించారు.
పరిసరాల పరిశుభ్రత, మహిళల సాధికారతకు అప్పట్లో లోహియా చేసిన కృషిని వర్ణించారు. పోర్చుగీసు ఆధీనం నుంచి గోవా రాష్ట్రాన్ని విముక్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన కృషికి గుర్తుగా పణాజీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి లోహియా పేరు పెట్టాలని నితీశ్ కుమార్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మరుగుదొడ్లు నిర్మిస్తే నెహ్రూకు వ్యతిరేకంగా పోరాడటం మానేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి లోహియా అని చెప్పారు.
ఇళ్లలోని వంటశాలల్లో చిమ్నీలను పెట్టుకోవడం ద్వారా మహిళల ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుకోవచ్చని సూచించిన సహేతుకవాది లోహియా అని పేర్కొన్నారు. దేశం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడిన లోహియా వంటి వ్యక్తికి ఆయన జయంతి(అక్టోబర్ 12)న భారతరత్న ప్రకటించాలని లేఖలో నితీశ్ మోదీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment