‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలో 1942 ఆగస్టు 27 నుంచి నవంబర్ 12 వరకు.. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కనిపెట్టేవరకు 78 రోజుల పాటు రామ్ మనోహర్ లోహియా అజ్ఞాత ప్రదేశాల్లోంచి నడిపించిన సీక్రెట్ రేడియో (బ్రిటిష్‌వారి దృష్టిలో ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’).. అదే ఏడాది జర్మనీలో సుభాస్ చంద్రబోస్ ప్రారంభించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది. క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ తర్వాతి ఏడాది 2018లో కేంద్రప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన ‘అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్‌కాస్ట్ డ్యూరింగ్ క్విట్‌ఇండియా మూవ్‌మెంట్’ అనే పుస్తకంలో ఆ సీక్రెట్ రేడియోకు సంబంధించి విస్మయకరమైన అనేక వివరాలు ఉన్నాయి.
ఐదారు చోట్ల నుంచి!
అంతరాయం లేకుండా వివిధ స్థలాల నుంచి కనీసం మూడు ట్రాన్స్‌మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71) రోజుల ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్‌మీటర్ పరికరాలను వేర్వేరు చోట్లకు బ్రిటిష్‌వాళ్ల కళ్లు కప్పడానికి తరలించేవారు. నవంబరు 12 దాకా ఈ ప్రసారాలు ఆగకపోవడం గమనార్హం. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్ల మీద ప్రసారాలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసారాలు సాగేవి. ‘హిందుస్థాన్ హమారా’ అనే పాటతో మొదలై వందేమాతరం గీతంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసారశక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఇక ఈ ప్రసారాలు నిర్వహించిన యువసైన్యం వివరాలు ఉత్తేజం కలిగిస్తాయి.
బాబూ భాయ్
బొంబాయిలో ఫోర్త్ స్టాండర్డ్ దాకా మాత్రమే చదివిన 20 సంవత్సరాల గుజరాత్ యువకుడు బాబూ భాయ్.. (అసలు పేరు విఠల్‌దాస్ మాధవి ఖక్కడ్) కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం (కేరో గ్యాస్) తయారీ వ్యాపారంలో ఉన్నవాడు.. ఈ సీక్రెట్ రేడియోకు ముఖ్య నిర్వాహకుడిగా ఉన్నాడు. రామ్ మనోహర్ లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనుడు ఇతనే. 1943 మే తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇతను ఈ రేడియో ప్రసారాల కారణంగా అనుభవించాడు.
నారీమన్ అబరాబాద్
నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ రావల్పిండిలో జన్మించి లాహోర్‌లో చదువుకున్నారు. మెట్రిక్యులేషన్ తరవాత వైర్‌లెస్ విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి బొంబాయి టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థ ప్రారంభించి అందులో శిక్షణ ఇచ్చేవారు. ఇంగ్లండు వెళ్లి టెలివిజన్ గురించి అధ్యయనం చెయ్యాలని ప్రయత్నించి సఫలుడు కాలేక వెనక్కు వచ్చి బాబూభాయ్ కేరోగ్యాస్ వాణిజ్యంలో చేయి కలిపారు. దీన్ని కూడా నిషేధించాక, బాబూ భాయ్‌కు సీక్రెట్ రేడియో ట్రాన్స్‌మీటర్ నిర్మించి ఇచ్చారు ఈ ప్రింటర్ మహాశయుడు.
మరో నలుగురు
బాబూ భాయ్, ఉషా మెహతా, నారిమన్‌తో పాటు గుజరాత్ భావనగర్ ప్రాంతానికి చెందిన 28 సంవత్సరాల విఠల్‌దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్‌లెస్ నిపుణులు నానక్ ఘర్‌చంద్ మోత్వానే, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 సంవత్సరాల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్‌లు లోహియా రేడియోలో కీలకపాత్రలను పోషించారు.
ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజన్స్ రికార్డులలో ఉన్నాయి కనుక వారి పేర్లు మాత్రమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఎందరో అజ్ఞాత వీరుల సేవల గురించీ, ఈ సీక్రెట్ రేడియో గురించీ.. 1988 దాకా నేషనల్ ఆర్కైవ్స్‌లో దాగివున్న ఈ పోలీసు ఫైలు పరిశోధకులు గౌతమ్ ఛటర్జీ కంటపడకపోతే.. మనకు తెలిసి వుండేది కాదు. ఆ అజ్ఞాత వీరులు దేశవ్యాప్తంగా సమాచారం సేకరించి ఆ చీకటి రోజుల్లో రేడియో ప్రసారాల క్రతువుకు ఇచ్చేవారు.
–డా నాగసూరి వేణుగోపాల్‌ఆకాశవాణి పూర్వ సంచాలకులు
(చదవండి: క్విట్ ఇండియా రేడియో! సీక్రెట్ ఫైల్స్)
Comments
Please login to add a commentAdd a comment