చంద్రబాబు దీక్ష భగ్నం | Chandrababu Naidu deeksha stopped by police | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దీక్ష భగ్నం

Published Sat, Oct 12 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

చంద్రబాబు దీక్ష భగ్నం

చంద్రబాబు దీక్ష భగ్నం

టీడీపీ నేతలతో పోలీసుల ముందస్తు సంప్రదింపులు  
 అనంతరం హైడ్రామా నడుమ ఆస్పత్రికి

 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దేశ రాజధానిలో చేపట్టిన నిరాహారదీక్షను హైడ్రామా మధ్య శుక్రవారం ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ను స్థానిక రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా చంద్రబాబు దీక్ష కొనసాగిస్తున్నట్లు పార్టీ మీడియా కమిటీ చైర్మన్ లింగం వెంకట శివరామకృష్ణప్రసాద్ మీడియాకు పంపిన సంక్షిప్త సమాచారంలో వెల్లడించారు. వాస్తవానికి బాబు దీక్ష ప్రారంభం నుంచే హైడ్రామా మధ్య నడిచింది. ఏపీ భవన్‌లో ఆయన సోమవారం మధ్యాహ్నం దీక్ష ప్రారంభించగా బుధవారం మధ్యాహ్నం నుంచే ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఏ క్షణంలోనైనా ఆసుపత్రికి తరలించవచ్చని పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు.
 
  కానీ అదేరోజు సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మరణంతో మీడియా అటువైపు దృష్టి సారించింది. దీంతో ఆరోజు దీక్ష భగ్నం అయితే తమకు ఆశించిన ప్రచారం రాదని ఆ రోజుకు విరమించుకున్నారు. తీరా గురువారం దీక్ష భ గ్నానికి సిద్ధపడితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అడ్డుపడ్డాడు. క్రికెట్ కు గుడ్‌బై చెప్తున్నానని సచిన్ ప్రకటించటంతో ఆ రోజు మీడియా దృష్టి ఆ వైపు కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలోనే బాబు దీక్ష భగ్నం కార్యక్రమం శుక్రవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం వర్షం కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఉదయం 10.30 సమయంలో బాబు శిబిరంలోకి చేరుకుని పడుకున్నారు. కొద్ది సేపటికి సీఎన్‌ఎన్ ఐబీఎన్ ఛానల్ ప్రతినిధి కరణ్ థాపర్ చంద్రబాబును ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చారు.
 
  దీంతో ఉత్సాహంగా లేచిన బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తరువాత అధినేత పడుకోగా పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య తదితరులు ఆవేశంగా ప్రసంగించారు. చంద్రబాబు దీక్ష భగ్నానికి కుట్ర జరుగుతోందని, ప్రాణత్యాగం చేసైనా దాన్ని అడ్డుకుంటామన్నారు. ఆ సమయంలోనే ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు ఎస్‌బీఎస్ త్యాగి, ఎంఎం మీనా, రాజా వీర్‌సింగ్‌లు వచ్చి టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. తాము బలవంతంగా దీక్షను భగ్నం చేయబోమని తమకు సహకరిస్తే ఆసుపత్రికి తీసుకెళతామని చెప్పారు. తమ కార్యకర్తలు కొద్దిసేపు నిరసన తెలుపుతారని, ఆ తరువాత మీరు చంద్రబాబును తీసుకెళ్లవచ్చని నేతలు చె ప్పారు. దీంతో వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రబాబు వద్దకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహకరించాల్సిందిగా కోరారు. ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండా దీక్షా వేదిక నుంచి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్‌లో ఎక్కి కూర్చున్నారు.
 
 ఫ్లెక్సీలపై టీడీపీ నేతల ప్రతాపం: అంబులెన్స్ ఏపీ భవన్ నుంచి బైటకు రాకుండా కార్యకర్తలు సుమారు అరగంటపాటు అడ్డుకున్నారు. అంతకుముందు కూడా ఏపీ భవన్‌లో టీడీపీ కార్యకర్తలు కొద్దిసేపు హడావుడి చేశారు. అక్కడ ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియాగాంధీల బొమ్మలతో కూడిన ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, పీసీ చాకో తదితరులు చేసిన వ్యాఖ్యలను వారి ఫొటోలతో పాటు టీడీపీ నేతలు ఒక ఫ్లెక్సీలో ముద్రించారు. ఆ ఫ్లెక్సీని కూడా చింపి దహనం చేశారు. అయినా ఏపీ భవన్ సిబ్బంది, భద్రతా సిబ్బంది కనీసం నిలువరించే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబును ఆసుపత్రికి తరలించిన తరువాత సోనియాగాంధీ నివాసం ముట్టడికి బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీ సీఎం రమేశ్, వైవీబీ రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు రక్షాభవన్ వద్ద బారికేడ్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు కొందరు పోలీసులపైకి రాళ్లు, చెప్పులు విసిరారు.
 పండుగ రోజు కుటుంబానికి దూరంగా: బాబు దీక్షను పోలీసులు భగ్నం చేయటాన్ని నిరసిస్తూ  శనివారం జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఏఐసీసీ కార్యాలయం ముట్టడి చేపట్టాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ కారణంగా శనివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రత్యేక రైలును నిలిపి వేశారు.
 
  ఆ రైలు ఆదివారం బయలుదేరుతుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి వస్తున్న రైలు శనివారం ఢిల్లీ చేరుకుంటుంది. అందులో వచ్చే, ఇప్పటికే నగరంలో ఉన్న నేతలు, కార్యకర్తలతో ఆదివారం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో రెండు రైళ్లు ఆదివారం బయలుదేరి మంగళవారం గమ్యస్థానాలకు చేరతాయి. దీనిపై ముఖ్యులు మినహా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఏదో ఢిల్లీ వెళ్లి వద్దామనుకుంటే.. దసరా రోజు కుటుంబసభ్యులతో సరదాగా గడపడానికి వీల్లేకుండా రైల్లో ప్రయాణించాల్సి ఉండటం బాధగా ఉందని పలువురు వాపోతున్నారు. ముఖ్య నేతలు మాత్రం విమానాల్లో గమ్యస్థానాలకు పండుగ రోజే చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారని, తమను మాత్రం ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement