చావుపుట్టుకలే ఆయనవి, బతుకంతా ప్రపంచానిది
సందర్భం
పాతతరం కొత్తతరానికి కేవలం జ్ఞాప కాలనే కాకుండా స్ఫూర్తిని కూడా అంది స్తుంది. వారి భుజాలనెక్కి దూసుకొచ్చే కాలప్రవాహాన్ని అంచనా వేసి తగు చర్యలు తీసుకోమంటుంది. ఆ పాత తరం నాయకులు సత్యాన్వేషకులైతే, తాము దర్శించిన దర్శనాల్లోంచి, ఆచరణ బాటలోంచి భావితరాలవారికి మనోబలాన్ని సృష్టించిపోతారు. అటు వంటి హృదయ చక్షువులతో ప్రపంచాన్ని దర్శించిన అరుదైన నేతల్లో రామ్‌మనోహర్ లోహియా ఒకరు. ఈయన మహాత్మా గాంధీకి దగ్గరి అనుయాయే కానీ భావాలలో అవసరమైతే ఆయనతోనూ విభేదించే స్వతంత్రాలోచనా ఉంది.
దగా పడుతున్న వాడికి న్యాయం జరగాలంటే తాను నమ్మిన సోషలిజం మూలాలనూ ప్రశ్నించే సాహస ప్రవృత్తి ఉంది. జర్మనీలో చదువుకున్నారు. ప్రపంచ మార్పులను గమనిం చారు. తిరిగివచ్చి గాంధీజీతో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. దేశమంతా సంచరించేందుకే సమయం సరిపోని వ్యక్తి గనుక పెళ్లి చేసుకోలేదు. దేశంలో సోషలిస్ట్ ఉద్యమాన్ని నిర్మించారు. ఆయన అనుభవాల్ని ‘రాజకీయాల మధ్య తీరికవేళలు’ అనే తన పుస్తకంలో పొందుపరిచారు. సమా జంలో ఘర్షణలు ఎందుకొస్తున్నాయ్? సమానత్వం ఎందుకు లేదు? వాటి మూలాలేంటి? వాటిని పరిష్కరించడం ఎట్లా ? అనేదే లోహియా సమగ్ర రచనల సారం. అందుకు తన పరిధిలో చేయాల్సినదంతా చేశారాయన.
లోహియా లోకాన్ని వదిలి 50 ఏళ్లు కావొస్తుంది . కానీ ఇప్పటి సందర్భం, శకలాలు శకలాలుగా విడిపోయి ఉన్న సమాజ సందర్భం. గెలిస్తే అమెరికాకు ఎదురులేని ప్రపంచ సార్వభౌమాధికారాన్ని కట్టిపెడతానంటూ రంకెలేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌ని అమెరికన్ రిపబ్లికన్ సమాజం ఆమోదిస్తున్న సందర్భం. నీవు భారతమాతకు ైజై అనకపోతే ఈ దేశంలో ఉండొద్దు అని హుకుం జారీ చేసే నేతలకు చప్పట్లు కొడుతున్న సందర్భం. భారత్ మాతాకి జై అని ఎందుకు అనాలి? నేను అనను, అని మరో వర్గపు నేతలు అంటే కూడా చప్పట్లు కొడుతున్న సందర్భం. ఈ దేశంలో నా పుట్టుకే ఓ శాపం అని బాధపడుతున్న రోహిత్‌ల ఆగ్రహపు ఆందోళనలను టైస్ట్, యాంటి నేషనల్ అని ముద్రవేసి ప్రభుత్వాలే వారి గొంతును అణచివేస్తున్న సందర్భం. అధికారం కోసం మనుషులని కులాల పేరుతో రెచ్చగొట్టి, ఓట్లుగా మలచుకుని, ఆ ప్రజల బాగోగుల్ని గాలికి వదిలేస్తున్న సందర్భం.
ఇది ఓ విచిత్రమైన గ్లోబలైజ్డ్, లిబరలైజ్డ్ సందర్భం. గాయం అవుతుంది. అందరూ శత్రువు ఎక్కడా అని వెతికేవాళ్లే. ఆ గాయంలో తన పాత్ర కూడా ఉందని తెలిసినా నిజాన్ని ఒప్పుకునే ధైర్యంలేక, నీవంటే నీవని ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అటువంటప్పుడు ఏదైనా గాయానికి మూల కారణం కనుక్కోవాలంటే, సత్యం తెలుసుకోవాలంటే భయం. సత్యం తెలిస్తే తనకు అధికారం, గుర్తింపూ ఉండదనే అభద్రత. అతనికి ప్రజల్లో ఎంత గందరగోళం ఉంటే అంత లాభం కాబట్టి ప్రజలను కూడా విడగొట్టి గందరగోళ పరుస్తాడు.
లోహియా కాలంలో శత్రువు బయటివాడు కాబట్టి, వాడు ఎవడో స్పష్టంగా గుర్తించే కాలం అది. దాని మీద పోరాడ డానికి ప్రజల్ని ైచైతన్యపరిచి కదిలించగలిగారు. ఈ గ్లోబలైజ్డ్, క్యాపిటైలైజ్డ్ కాలంలో శత్రువు ఫలానా అని గుర్తించడానికి వీలుండదు. ఇది అంతర్గతమైనది. స్తబ్దతకు, భద్రతకు, సౌక ర్యానికి, చైతన్య రాహిత్యం, స్వార్థం అనే విషపు కోరలో్ల చిక్కుకున్న మనిషి మనస్తత్వమే ఇపుడు దేశానికి శత్రువు, అందుకని అంతర్గతంగా ఉన్న శత్రువు బయట ఎట్లా దొరుకుతాడు? ఈ కాలం, వ్యక్తి కేంద్రీకృత పోటీ కాలం. ఒకడు ఇంకొకడి గురించి ఆలోచించడానికో, వినడానికో కూడా సమయం దొరకని కాలం లేదా విననట్లు నటిస్తున్న కాలం. ఏదో ఒక శకలంతో ఐడెంటిైఫై చేసుకుని భద్రతను కోరుకుంటున్న కాలం. నేను బాగుంటే చాలు అనుకునే కాలం. ఆ స్తబ్దత భూతమే మహా రాక్షసిగా మారి ఒక్కొక్కరి మీద దాడి చేస్తూ అందరినీ గాయపరుస్తుంది. ఈ అంతర్గత శత్రువులను మేలొ్కల్పుతున్న ఈ గుర్తు తెలియని రాక్షస స్వైరవిహారంలో అందరం బాధితులమే, అందరం భాగస్వా మ్యులమే అయినా, దాని ఎరుక కూడా లేకుండా పరుగు తీస్తున్న కాలం ఇది. ఇటువంటప్పుడు లోహియాలు ఏం చేస్తారనేది ప్రశ్న?
వ్యవస్థలోని ఈ ఒక్క ఉదాహరణతోనే ఈ పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇప్పుడు రాజకీయాలు లాభసాటి వ్యాపా రాలు. ఒక్కోడు ఎమ్మెల్యే కావడానికే 10 నుండి 20 కోట్ల పెట్టుబడి పెట్టి గెలవడానికి సిద్ధపడుతున్నప్పుడు దానికి కనీసం మూడు రెట్లన్నీ రిటర్న్స్ రాబట్టుకోకుండా ఎలా ఉంటాడు? క్యాపిటలిస్టు వ్యవస్థతో చేతులు కలుపుతాడు. ప్రజల భాగస్వామ్యమున్న సహజ వనరులతో పాటు, ప్రజల చైతన్యాన్ని , హక్కుల్ని, ఆత్మాభిమానాన్ని కబ్జా చేస్తాడు. అనేక రకాలుగా సమాజం చుట్టూరా అవినీతిని నాటుతాడు. దండ కారణ్యంలోని గిరిజనుల మీద లీగల్ గానే యుద్ధం చేసినట్లు గానే రేపు మన మీదా ఎదో రూపంలో లీగల్‌గానే యుద్ధం చేసి మనల్ని మనం తాకట్టు పెట్టుకునేలా చేస్తాడు. అప్పుడు ఎవడి గోడు ఎవడు వింటాడు. అంతా లీగల్ గానే జరుగు తుంటది కానీ శత్రువు దొరకడు.
ఒక కోటి పెట్టుబడి అయిదేళ్ళలో కనీసం 5 కోట్లుగా మారుతున్న ఈ సమాజంలోకి వచ్చి లోహియా ఏం చేయగలడు? దేశానికి విధానాలు నిర్ణయించి, దిశానిర్దేశం చేసే రాజకీయ వ్యవస్థకే ఇలా వైరస్ పడితే, దాని ప్రభావం అన్నిటిమీదా పడి దేశాన్ని అతలా కుతలం చేస్తుంది. అటువంటి ఈ స్థితిలో, సాక్షాత్ లోహియానే ఎలక్షన్‌లో పోటీ చేస్తే డిపాజిట్ దొరకదు అనే అంశంలో సందేహం అక్కర్లేదు. డబ్బే, కులమే, మతమే గెలుస్తుంది అనే బలమైన నమ్మకం ప్రజలో్ల నాటుకుపోయింది. అది సరియైన దారి కాదు అని అంటూనే అందరం అందులో భాగస్వా మ్యులం కావడమే అత్యంత విషాదం. ఇటువంటపుడు లోహియాలు ఏం చేస్తారనేది ప్రశ్న?
ఇలా వ్యవస్థలోనే లోపం ఉన్నప్పుడు లోహియా ఏం చేసేవాడో అనిపిస్తుంటుంది. ఓసారి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ దగ్గరికెళ్లి ‘ఇప్పుడు ప్రపంచాన్ని ఇద్దరు ఆకర్షిస్తున్నారు. ఒకరు గాంధీ, రెండోది మీరు. గాంధీ ప్రపంచాన్ని కలిపేందుకు అహింసా శాంతి మంత్రాల్ని బోధిస్తే మీరు హింసను, భయాన్ని కలిగించే ఆటంబాంబును కనుక్కున్నారు’ అని నిర్మొహమాటంగా లోహియా చెప్పేసరికి ఐన్‌స్టీన్ మొదట కంగుతిని తరువాత ప్రస్తుతించాడు. కమ్యూనిస్టు యుగో స్లేవియాకు వెళ్లి, అక్కడి కమ్యూనిజాన్ని విషపు కోరలు ఉన్న దానిగా, అమెరికాకు వెళ్లి, క్యాపిటలిజాన్ని భయంకర భూతంగా వర్ణించిన లోహియా జీవితాన్ని, నైజాన్ని తెలిసిన వారెవరైనా ఒకటి మాత్రం చెప్పగలరు. ఈ కాలంలో ఆయనే ఉంటే పదవులనే ఆశను నేలకు కొట్టి, ఇల్లిల్లు, వీధివీధి తిరుగుతూ మనకు పట్టిన చెదలు పురుగుల్ని విప్పి, మన జడత్వాన్ని బండకేసికొట్టేవాడు. రోహిత్, కన్హయ్యల పోరాట ఆగ్రహాన్ని ఇంకో కోణంలో దర్శించేవారు.
ఈ లోహియానే ఒకప్పుడు, మంత్రి పదవిని ఇస్తాను తను కేబినెట్‌లోకి రమ్మని ఆహ్వానించిన నెహ్రూతో, ప్రతిపక్షమైతే ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడతాము అని తిరస్కరించి, ప్రభుత్వాన్ని నిరంతరం మేలుకునేట్లు చేశారు. అటువంటి లోహియా ఈ కాలంలో ఉంటే, ఈనాటి కలహాల ట్రంపులకు; జాతీయత గురించి తమకే పేటెంట్ హక్కున్నట్లు లక్ష్మణ రేఖల్ని గీస్తున్న మతతత్వపు నేతలకు బహుళత్వంలోని జీవన సౌందర్యాన్ని, భిన్నత్వంలోని ఏకత్వపు మాధుర్యాన్ని కళ్లకు కట్టినట్లు వివరించేవారు.
ఆయన ఓసారి ‘‘మనుషులకు పునర్జన్మలున్నాయని నమ్మను కానీ, ఓ దేశానికి మాత్రం ఉంటుంది. ఎందుకంటే, దేశాన్ని బాగుచేసుకోవాలని చేపట్టే ఇప్పటి మంచి చర్యలే రేపటి తరాల వారికి మంచి ఫలితాల రూపంలో పునర్జన్మగా అందుతాయి’’ అన్నాడు. అందుకైనా అతను నిరంతరం మెళకు వతో ఉంటూ, సమాజాన్ని ఎరుకలో ఉంచేవాడు.
‘‘సోషలిజానికి శాశ్వత నిర్వచనాలు ఉండవంటూ, నిత్యం దాన్ని ఎవరికివారు కొత్తగా కనుక్కోవాల్సింది’’ అనే ఆయన మాట బుద్ధుడిలాంటి మాట. విశ్వమత హృదయంతో అంద రినీ తనలో, అందరిలో తనను చూసుకునే వారే మహానేతలు. వారి వెంట జనాలు ఉండనీ లేకపోనీ; పరిస్థితులు అనుకూ లించనీ, లేకపోనీ; పదవులు ఉండనీ లేకపోనీ కానీ వారు మాత్రం తానున్న మేర, తానున్న పరిసరాల్లో తన ఆచరణ జ్యోతి అనే కాగడాలను పట్టుకుని పొద్దునే విశ్వైక్యసమతా రాగాన్ని పాడుకుంటూ గడపగడపకు తిరిగి మనుషుల్ని మేల్కొ ల్పుతారు. ఈరోజు కాకున్నా రేపన్నా మార్పు రాకపోతుందా అనే ఆశని కల్పిస్తారు. అటువంటి మహానాయకుల్లో రామ్ మనోహర్ లోహియా ఒకరు. పుట్టుక ఆయనది, చావు ఆయ నది. కానీ బతుకంతా ప్రపంచానిది.
(నేడు హైదరాబాద్‌లో లోహియా 106వ
జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా)
- ఎ. గంగారెడ్డి
వ్యాసకర్త బెడ్‌ఫోర్డ్ యూనివర్సిటీ(యూకే) అలుమ్ని
మొబైల్: 9000022443