తెలుగువారికి రామమనోహర్ లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ మనకు దూరంగానే ఉండిపోయాయి. లోహియా ఇతిహాస వ్యాసాల పుస్తకం ఆయనలోని ఈ కోణాన్ని చేరువ చేస్తుంది. పురాణ పాత్రల మీద వెలుగు అన్నట్టేగానీ, ఆ పేరుతో అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు చాటారు. ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోరణిని తూర్పారబట్టారు. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక.
‘‘నాకు అవకాశం దొరకాలే గానీ ఈ భూమండలం సహా, యావత్తు గ్రహరాశిని సొంతం చేసుకొని ఏలుబడిలోకి తెచ్చుకొంటాను.’’
– భూస్వామ్య వ్యవస్థలో కూలి నాలి చేసుకొని బతికే శ్రమజీవుల కాయకష్టానికి విలువ కట్టిన ప్రసిద్ధ ఆర్థికవేత్త రికార్డో ప్రకటన.
పరాయి వలస పాలనకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలతో పోరాడి దాన్నుంచి విముక్తి సాధించుకున్నారు వివిధ ఖండాల ప్రజలు. అయితే విమోచన తరువాత కూడా (స్వతంత్ర భారతం సహా) స్థానిక పాలకుల స్వార్థ ప్రయోజనాల వల్ల దోపిడీ వ్యవస్థలో మౌలికమైన మార్పు రాలేదు. ఈ సత్యాన్ని చాటినవారు భారత స్వాతంత్య్ర పోరాటంలో తలమునకలై తన సమకాలీన రాజకీయ సహచరుల పోకడలనూ, సైద్ధాంతిక రంగంలో ఆటుపోట్లనూ దగ్గ రుండి గమనించిన రామమనోహర్ లోహియా. ఇటీవల లోహియా ఇతిహాస వ్యాసాల పేరిట ‘పురాణ పాత్రలపై కొత్త వెలుగు’ మకు టంతో లోహియా సమతా ట్రస్ట్ నిర్వాహకులు, నిరంతర అధ్యయన శీలి రావెల సోమయ్య ఒక ఉత్తమ సంకలన గ్రంథాన్ని ప్రచురించారు. రిషితుల్యుడు, ఆసియాలో తొలి సామ్యవాదిగా పేరెన్నికగన్న స్వామి వివేకానందకు ఈ సంపుటిని అంకితమిచ్చారు.
పేరుకు ‘పురాణ పాత్ర’లపై ప్రసరించిన కొత్త వెలుగే. కానీ దాని చాటున అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు ఉన్నాయి. ఇంతవరకూ తెలుగువారికి లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ హిందీ భాషా ప్రియులకు మాత్రమే లభ్యమవుతూ వచ్చాయి. ఆ లోటు ప్రస్తుత తెలుగు సంకలనంతో కొంతవరకు తీరుతుంది.
పురాణ పాత్రల ప్రస్తావనలో కూడా లోహియా ఆధారపడింది ‘రొడ్డ కొట్టుడు’ సరుకు మీద కాదు. ఎకాఎకిని ఏ మహోన్నతుని భావదీప్తిని అందిపుచ్చుకోవాలో సరిగ్గా ఆ ఉద్దండుని ‘సహవాసాన్నే’ లోహియా కోరుకున్నాడు. ‘అవధి’ అనే స్థానిక ప్రజల భాషకు వ్యతి రేకులైన సంస్కృత ఛాందసుల ఆగడాలను అతి కష్టం మీద వ్యతి రేకించి నిలబడిన పండిత తులసీదాస్ రామాయణ రచనను ప్రేమిం చినవాడు లోహియా! స్థానిక భాష ‘అవధి’లో రచించిన రామాయ ణాన్ని కాపాడుకోవడానికి తులసీదాస్ పడిన కష్టాలు వర్ణనాతీతం.
ఆ సమయంలో తులసీదాస్ గ్రంథాన్ని భద్రంగా కాపాడిన వ్యక్తి ముస్లిం సోదరుడు. రామలీల ఉత్సవాల్ని జరిపే ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోర ణిని తూర్పారబట్టినవాడు లోహియా. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక.
ఛాందసుల మాటేమోగానీ, లోహియాకు మాత్రం హిందూ మతంలోనే లోపాయికారిగా పాతుకుపోయిన రాజకీయ దూరదృష్టి ఆశ్చర్యం కల్గించింది. ఎందుకంటే, లోహియా భావనలో మతం, రాజనీతి పరిధులు, ఆశయాలు, వాటి పాటింపు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని కలపకూడదు. ఎందుకని? ‘‘మతం దీర్ఘకాలం ఉండే రాజనీతి కాగా, రాజనీతి అనేది కొంతకాలం మాత్రమే సాగే మతం’’! మతం, రాజనీతుల్లో వివేకం లేకుంటే అవి రెండూ కలిసిపోయినప్పుడు దేశం నాశనమవుతుం దన్నాడు లోహియా! ‘‘రాజకీయ క్షేత్రంలో మతం చొరబడిపోయి దేశంలో ఎంత ఉద్వేగం, ఉద్రేకం, హింస, ద్వేషాలు ప్రబలిపోతు న్నాయో నేను కళ్లారా చూస్తున్నాను. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే మత కార్యకలాపాల్ని అరికట్టక తప్పదు’’!
చరిత్రకారుడు విల్ డూరాంట్ తన ‘లెసన్స్ ఆఫ్ హిస్టరీ’లో సోష లిస్టు, క్యాపిటలిస్టు పరిణామ దశల గురించి వెలిబుచ్చిన భావాలతో లోహియా ఏకీభవిస్తున్నట్టు కన్పిస్తుంది: ‘‘పెట్టుబడిదారీ విధాన వ్యాప్తి గురించిన భీతితో సోషలిజం తన స్వేచ్ఛా పరిధిని విస్తృతం చేసుకొనక తప్పని స్థితి ఏర్పడినట్టే, సోషలిస్టు వ్యవస్థ విస్తృతిని గమనించి పెట్టుబడీదారి వ్యవస్థ కూడా తన సమానత్వ పరిధిని విస్తృత పరుచుకొనక తప్పలేదు. ఫలితంగా రెండు విభిన్న ధృవాలూ త్వరలో ఏకమయ్యే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చు’’!
సోషలిజానికి శాశ్వత నిర్వచనాలుండవు, దాని నిత్య పరిణా మంలో కొత్తగా అన్వేషిస్తూ ఉండవలసిందేనని లోహియా భావన. అంతేగాదు, మన తెలుగు భాషకు లోహియా అర్థవంతమైన భాష్యం కూడా చెప్పడం విశేషం!
‘‘తెలుగు భాషలో ‘ఉ’కారాంత పదాలు తర చుగా దొరకడానికీ, తులసీదాస్ రాసిన ‘అవధి’ భాషలోనూ, తులసీ రామాయణంలోనూ ఈ ‘ఉ’కారాంత పదాలు ఎక్కువగా ఉండటాన్నీ లోహియా పేర్కొంటాడు. పదాల చివర్లో ‘ఉ’ కలిపితే పదానికి తీపి దనం ఎక్కువవుతుందనీ, ఈ పద మాధుర్యం వెనుక విజయపురిని పాలించిన ఇక్ష్వాకు రాజుల భాషా ప్రభావం ఉండి ఉండవచ్చనీ, ఈ కారణం వల్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఉ’ అయోధ్యకు చేరిందో, లేదా అయోధ్య నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందో తాను చెప్పలేననీ, కానీ, అవధి, తెలుగు భాషా పదాల పరస్పర వాడకం నిజంగా జరిగిందా అని మాత్రం తెలుసుకోవడం తనకిష్టమనీ అంటాడు. దీనివల్లే లోహియా అనేక ప్రాంతీయ భాషా శాసనాలను ఆసక్తితో చూడటం విశేషం.
కానీ ఒక్క అనుమానం – ఎన్నో విషయాలపైన ఇంతగా సాధి కార వ్యాఖ్యలు అందించగల్గిన లోహియాకు క్రీస్తుపూర్వం 2100 సంవత్సరం నాటికే సుమేరియా నాగరికత సంపన్న పాలకుల ఆస్తిపాస్తులను, సేద్య యోగ్యమైన భూసంపదను ఎలా, ఏ పద్ధతుల ద్వారా పేద ప్రజలకు పంచి దుర్భిక్ష పరిస్థితులు తలెత్తకుండా చేయ గలిగిందో అవగాహన లేకపోవడం ఒక మహా సోషలిస్టు నాయకుడిలో లోపంగా భావించవచ్చా?! ఎందుకంటే, అమెరికన్ మహా కోటీశ్వ రుల్లో బలవంతుడైన రాక్‌ఫెల్లర్ కొడుకు జాన్ డి. రాక్‌ఫెల్లర్ అమెరికా లోని ఘరానా ప్రయివేట్ ట్రస్ట్ కంపెనీల గురించి ప్రస్తావిస్తూ ఓ గొప్ప నిజాన్ని బహిర్గతం చేశాడు: ‘‘అందమైన అమెరికన్ గులాబీ రోజాను దాని అందచందాలతో, మధుర సువాసనలతో పెంచడం మహా సులభమే. కానీ ఎలా? ఈ పెద్ద గులాబీని ఆసరా చేసుకొని దాని చుట్టూ మొగ్గ తొడుగుతూన్న చిన్న గులాబీలను కాస్తా తుంచి పారేయడం ద్వారా. ఆ పద్ధతిలో ఎదిగినవే అమెరికన్ ట్రస్టు కంపెనీ లన్నీ.’’ జూనియర్ రాక్‌ఫెల్లర్ మార్క్సిజం పరీక్షకు తనను తాను గురి చేసుకొన్నాడో లేదో తెలియదుగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించే అసమ సామాజిక, అరాచక పరిస్థితులను బలైపోయిన శిశు ‘రోజా’ ఉదాహరణ ద్వారా బహిర్గతం చేయగలిగాడు.
నూరేళ్ల క్రితమే ఇంగ్లండ్ మహాకవి షెల్లీ ‘ఇంగ్లండ్ ప్రజలకు విన్నపం’ పేరిట ఇచ్చిన సందేశం విశ్వగీతికగా మార్మోగిపోయింది. పారిశ్రామిక విప్లవానంతరం పెట్టుబడిదారీ విధాన ఫలితాల వల్ల కష్ట జీవులైన కార్మిక కుటుంబాలు అనుభవిస్తున్న వ్యథలను గమనించి, ఆ కష్టాలకు కర్మ సాక్షిగా ఆయన నిలబడ్డాడు.
‘‘కష్ట జీవులారా! మీరు నాటే విత్తనాన్ని మరొకడుఅనుభవిస్తున్నాడు,
నీవు సృష్టించే సమాజ సంపదను మరొకడెవడో దొంగిలిస్తున్నాడు,
నీవు నేసే బట్టలను మరొకడెవడో ధరిస్తున్నాడు,
నీవు సృష్టించే ఆయుధాల్ని మరొకడు ధరిస్తున్నాడు.
విత్తనం నువ్వే నాటు, కానీ నియంతకు అందనివ్వకు,
సంపదను సృష్టించు, కానీ దుర్మార్గ పాలకుడికి అందనివ్వకు,
దుస్తులు కుట్టు, కానీ సోమరిపోతుకు అందనివ్వకు
ఆయుధాలు తయారుచెయ్యి, కానీ వాటిని నీ రక్షణకే
ఉపయోగించు.’’
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment