
ఆ ఇద్దరూ ఇక బయటకే!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అసమ్మతి నేతలు ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్‌ల ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. శనివారం జరుగనున్న జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కాగా, అసమ్మతి నేతలు, కేజ్రీవాల్ బృందం మధ్య ప్రారంభమైన మాటల యుద్ధం శుక్రవారం పతాక స్థాయికి చేరుకుంది. కేజ్రీవాల్‌పై స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ ఆడియో టేప్‌ను అసమ్మతి వర్గం శుక్రవారం విడుదల చేసింది. ఈ టేపులో కేజ్రీవాల్... ఇద్దరు అసమ్మతి నేతలతో తాను కలిసి పనిచేయటం సాధ్యం కాదని కేజ్రీవాల్ అందులో అన్నారు.
వాళ్లిద్దరూ ఉంటే తాను 66మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీని పెట్టుకుంటానని కూడా కేజ్రీవాల్ ఆ టేప్‌లో అన్నారు. ఈ ఆడియో టేప్ విని తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని.. తమను పార్టీనుంచి వెళ్లగొట్టాలని నిర్ణయించుకున్న తరువాత ఇక చర్చలు జరిపి ప్రయోజనం లేదని విలేకరుల సమావేశంలో యోగేంద్రయాదవ్ అన్నారు. పార్టీ వ్యవస్థాగత సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో కేజ్రీవాల్ రాజీపడుతున్నారని ఇద్దరు నేతలు ఆరోపించారు. తాము ప్రస్తావించిన ఐదు డిమాండ్లను పరిష్కరిస్తే పార్టీలోని అన్ని పదవులనూ వదులుకుంటామన్నప్పటికీ పట్టించుకోలేదన్నారు.
పార్టీ రాష్ట్ర శాఖలకు స్వతంత్ర ప్రతిపత్తి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కేజ్రీవాల్ ప్రయత్నించారన్న ఆరోపణలపై అంతర్గత లోక్‌పాల్‌తో విచారణ, పార్టీ నిర్ణయాల్లో కార్యకర్తల భాగస్వామ్యం పెంచటం, ఆర్టీఐ పరిధిలోకి పార్టీని తీసుకురావటం వంటి డిమాండ్ల విషయాలను పక్కన పెట్టారని అన్నారు. శనివారం జరుగనున్న జాతీయ మండలి సమావేశాన్ని వీడియో తీయాలని కోరినా స్పందించలేదన్నారు. తమను జాతీయ కార్యవర్గం నుంచి తప్పించగలరేమో కానీ పార్టీ నుంచి బహిష్కరించటం అంత తేలిక కాదని, అలా చేయాలంటే తప్పనిసరిగా అంతర్గత లోక్‌పాల్‌కు, క్రమశిక్షణాసంఘానికి నివేదించాల్సి ఉంటుందన్నారు.