మౌలిక లక్షణం మలినం కారాదు | Yogendra Yadav Says his Opinion on Secularism | Sakshi
Sakshi News home page

మౌలిక లక్షణం మలినం కారాదు

Published Fri, Mar 30 2018 12:23 AM | Last Updated on Fri, Mar 30 2018 12:23 AM

Yogendra Yadav Says his Opinion on Secularism - Sakshi

ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్‌ చానల్స్‌లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్‌ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా‍‍్యఖ్యానంలా కనిపిస్తుంది.

మన దేశంలో జరిగే చాలా బహిరంగ చర్చలు ఎలా ఉంటాయంటే, అవి బధిరుల సంభాషణలను మరిపిస్తూ ఉంటాయి. ఈ చర్చలు ప్రతి నాయకుల మధ్య జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే శత్రువుల మధ్య సాగుతూ ఉంటాయనవచ్చు. వాదనలోని ఏ ఒక్క విషయాన్ని అంగీకరించకూడదని భీష్మించుకుని కూర్చున్నట్టే వారు ఉంటారు. ద్వంద్వ యుద్ధంలో ప్రత్యర్థిని ఓడించి తీరాలన్న పట్టుదలతో చర్చకు దిగినట్టు ఉంటుంది. ఇక మిత్రులైతే ఒకరి వాదనను ఒకరు బహి రంగంగా నిరాకరించుకోరు. 

అందుకే మన టీవీ చర్చలన్నీ అలా చెవులు చిల్లులు పడేటట్టు ఉంటాయి. చాలా చర్చలు సమర నాదాల తోనే సాగుతాయి. ఇంకా, దశ దిశ లేకుండా ఉంటాయి. ఈ కారణం గానే ఈ మధ్య ‘మైనారిటీల స్థితిగతులు’ అన్న అంశం మీద జరిగిన ఒక చర్చను చూశాక ముచ్చటగా అనిపించింది. సెక్యులర్‌వాద కార్య కర్తలు, మేధావులు కొందరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో ఆ అంశం మీద తమ తమ విభేదాల గురించి వెల్లడించారు. ప్రముఖ సామాజిక, మానవ హక్కుల కార్యకర్త హర్షమందిర్‌ రాసిన వ్యాసంతో ఈ చర్చ ఆరంభమైంది.

ఆరోగ్యకరమైన చర్చ అవశ్యం
ముస్లింల పార్టీ అన్న ముద్ర పడడం వల్లనే మొన్నటి సాధారణ ఎన్ని కలలో కాంగ్రెస్‌ ఓటమి పాలైందంటూ ఆ మధ్య ఇండియాటుడే పత్రిక నిర్వహించిన గోష్టిలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ చేసిన ప్రకటన ఆధారంగా హర్ష ఆ వ్యాసం రాశారు. సోనియా అభిప్రాయానికి మరొక ఉదంతం కూడా జోడించారు. ఒక సందర్భంలో ముస్లింలను బురఖా, టోపీ లేకుండా రావాలంటూ చెప్పిన ఉదంతమది. ముస్లింలు ఈరోజు రాజకీయ అనాథలుగా మిగిలిపోయారని ఆయన వాదన. కానీ ప్రముఖ చరిత్రకారుడు, ఉదారవాద మేధావి రామచంద్ర గుహ దీనితో విభేదించారు. 

బురఖా ధరించడం ముస్లింల వెనుకబాటుతనానికి ప్రతీకగా కనిపిస్తుందనీ ఉదారవాదులైన మేధావులు ఎవరూ దానిని ఎట్టి పరిస్థితులలోను సమర్థిం చరాదనీ గుహ అభిప్రాయం. ఇంకా సుహాస్‌ పాల్షికార్, ఇరేన్‌ అక్బర్, ముకుల్‌ కేశవన్‌ వంటి మేధావులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే, అసలే ముస్లింలు పెద్ద సవాలును ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి చర్చ జరగడం గురించి కొందరు మేధావులు కలత పడి ఉండవచ్చు. దీనిని నేను అంగీకరించను. ఎందుకంటే, తమని తాము ఆత్మశోధన చేసుకోవడానికి కష్ట కాలమే మంచి అవకాశం ఇస్తుంది. 

ఆచరణ ఎలా ఉందన్నదే ప్రశ్న
సిద్ధాంతపరంగా, ఆచరణ స్థాయిలో సెక్యులరిజం ఎలా ఉన్నదీ అనే అంశం గురించి నిజాయితీగా చర్చించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి చర్చ అనివార్యంగా జరగాలి కూడా. ఎందుకంటే మన గణతంత్ర రాజ్యం నిర్దే శించుకున్న పవిత్ర సిద్ధాంతం సెక్యులరిజం. 1975లో సెక్యులరిజం అన్న పదాన్ని మన రాజ్యాంగ పీఠికలో లాంఛనంగా చేర్చుకుని ఉండవచ్చు. కానీ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కీలక భాగమది. సెక్యులర్‌ కాని భారతదేశాన్ని మనం ఎంచుకోలేదు. అయినప్పటికీ ఆచరణలో ఈ పవిత్ర సిద్ధాంతం తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నది. 

ఇందుకు కారణం సెక్యులరిజం ఆచరణాత్మకంగా, సిద్ధాంతపరంగా రెండు మౌలిక దోషాలతో ఉంది. వాటి గురించి నిజాయితీతో బహిరంగంగా చర్చిండానికి ఇదే అను కూల సమయం. ఆ రెండింటిని రాజకీయ సెక్యులరిజం సమస్య, మేధావుల సెక్యులరిజం సమస్య అనుకోవచ్చు. సెక్యులరిజాన్ని రాజకీయ రంగం పర స్పర విరుద్ధంగా, పక్షపాత దృష్టితో, ఒక సాధనం అన్న ధోరణి నుంచే ఆచ రిస్తుండడం మొదటి సమస్య. ఏదైతే మైనారిటీల హక్కుల పరిరక్షణే ఆశ యంగా మొదలైందో, కాలగమనంలో అదే ఇతరుల బలహీనతలను ఆధారం చేసుకుని  మైనారిటీ మేధావులు ప్రయోగించడానికి ఉపకరించే సాధనంగా మారిపోయింది.

వాస్తవాల వెల్లడిలో దాపరికమేల?
మెజారిటీ మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం మధ్య వైరుధ్యాన్ని శాస్త్ర బద్ధంగా వివరించేందుకు ప్రారంభమైన ఆలోచనే, ఇప్పుడు ముస్లిం మైనా రిటీలను మతోన్మాద పంథాలో కదిలించడానికి జరుగుతున్న ప్రయత్నం నుంచి, వారిలో వ్యక్తమవుతున్న పురోగమన వ్యతిరేకతల నుంచి మన దృష్టిని మళ్లించేదిగా పరిణమించింది. హిందూ సామాజిక విధానంలోని రుగ్మతలను బాహాటంగా చర్చించడానికి చర్చలూ, అందులోని అవాంఛనీయ పరిణామా లను గురించి చెప్పడానికి ఒక విమర్శకుడు కనిపిస్తున్నారు. కానీ ఇతర మతా లలో కనిపించే అలాంటి రుగ్మతలను, అవాంఛనీయ పోకడలను చర్చించే విమర్శకులు తరచూ మౌన ప్రేక్షకులై పోతున్నారు. హిందువులు, వారి సంస్థలు చేస్తున్న దుర్మార్గాల మీద దాడి జరుగుతుంది. 

శల్యపరీక్షలు జరుగు తాయి. అదే విధంగా ఒక చర్చి, లేదా గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ వంటి సంస్థలు చేసిన దుర్మార్గాల గురించి ఎలాంటి దాడి జరగదు. ఏ విధమైన∙శల్య పరీక్షలు ఉండవు. మైనారిటీలను లాలించడమనే ఆరోపణ తప్పయితే, ఒక సాధారణ ముస్లిం దుస్థితిని గురించి వస్త్వాశ్రయ దృష్టితో చేసిన సూచనలన్నీ కూడా కీడు చేసేవే అవుతాయి. ముస్లిం పురోహిత వర్గాన్ని లాలించడమనేది ఒక చేదునిజం. ఒకవేళ ఆరెస్సెస్, బీజేపీ ముస్లింలను ముస్లింతనానికే పరిమితం చేయాలని కోరుకుంటున్నాయని అనుకుంటే, సెక్యులర్‌ పార్టీలు చేస్తున్నది కూడా అదే. కొన్నేళ్లుగా సెక్యులర్‌ పార్టీలు ముస్లింలకు సంబంధించిన సమస్యలను మాత్రమే వెలుగులోకి తెచ్చి, వారి భద్రత గురించి మాత్రమే మాట్లాడి, వారి మత అస్తిత్వం గురించి మాత్రమే చెప్పి వారి ఓట్లను విజయవంతంగా తమ ఖాతాలో వేసుకోగలిగాయి. సాధారణ భారత పౌరులను చేసినట్టు సెక్యులర్‌ రాజకీయాలు ముస్లింలను ప్రజా సేవలకు, ప్రయోజనాలకు దగ్గర చేయలేదు. 

వెనుకబడిన ముస్లింలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో, కావలసిన సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో సెక్యులర్‌ పార్టీల ప్రభుత్వాలు అ«ధికారంలో ఉన్న రాష్ట్రాల చరిత్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల రికార్డు కంటే భిన్నంగా ఏమీ లేదు. ఓటు బ్యాంకు రాజ కీయాలంటూ ఇతరులను విమర్శించే స్థితిలో బీజేపీ లేకపోవచ్చు. కానీ సెక్యులర్‌ పార్టీలు మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను బందీ లుగా చేసుకుని, వారి ఓట్లను రాబట్టుకోవడానికి సంక్షేమ పథకాల అమలు చేయడం కాకుండా, వారిలో భయాందోళనలు కల్పిస్తున్నారు. సెక్యులర్‌ పార్టీల ఈ ఘనతను గమనించిన తరువాత సెక్యులరిజం అంటే మైనారిటీ అనుకూల విధానం తప్ప మరొకటి కాదంటూ సంఘ్‌ పరివార్‌ చేస్తున్న ప్రచారంలో సాధారణ హిందువులు పడి పోవడం పెద్ద వింతేమీ కాదు.

మూలాలను నాశనం చేసిన మేధావులు
ఇక మేధావులు ప్రవచించే సెక్యులరిజంతో వచ్చిన చిక్కేమిటంటే, అసలు అది ఆ సిద్ధాంతం మౌలిక లక్షణాలనే సర్వ నాశనం చేసింది. మేధావులనేవారు సాధారణ ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలు, భాష నుంచి సుదూరంగా జరిగిపోయారు. ఇలాంటి మేధావుల చర్చలు ప్రధానంగా ఇంగ్లిష్‌ చానల్స్‌లో ఉంటాయి. కాబట్టి సెక్యులర్‌ అన్న ఆంగ్ల పదానికి భారతీయ భాషలలో సరైన అర్థం కనిపించదు. అధికారికంగా ఇచ్చిన అనువాదం ‘ధర్మ నిరపేక్షత’. కానీ ఈ అనువాదం దుర్వా్యఖ్యానంలా కనిపిస్తుంది. ఇది ప్రతికూలార్థం ఇచ్చేటట్టుగా కనిపించ డమే కాదు, సాంస్కృతికంగా అస్పష్టంగా అనిపిస్తుంది. 

సెక్యులర్‌ మేధావుల మాటలలో ఎక్కువగా తిలక ధారణ, బురఖా వంటి మత, సాంస్కృతిక చిహ్నాల పట్ల నిరసన కనిపిస్తుంది. సెక్యులరిజం, ఆధునిక విద్య మన మత వారసత్వం పట్ల ఒక సామూహిక నిరక్షరాస్యతను పెంచేశాయి. దీనితో జరి గిందేమిటంటే, సెక్యులరిజం అంటే ఏవో విదేశాలకు సంబంధించిన విధానం, పాశ్చాత్య ధోరణులు ఉన్న హేతువాదులకు పరిమితం, మన సంస్కృతీ సంప్రదాయాలలో ఇమిడేది కాదు అన్న అభిప్రాయాన్ని కలిగిస్తు న్నది. ఈ సిద్ధాంతాన్ని దారుణంగా ఖండిస్తున్నప్పటికీ ఎదురొడ్డి మాట్లాడు తున్నవారు గడచిన రెండేళ్ల నుంచి బాగా తక్కువగా కనిపిస్తున్నారు. 

ఒక విషయం స్పష్టం చేస్తాను. ఇది సెక్యులరిజంను వ్యతిరేకించడం కాదు. సెక్యులరిజం అనేది గణతంత్ర భారతం అవతరణకు ఆదిలోనే ఏర్ప రుచుకున్న సిద్ధాంతం. మనం ఇప్పుడు పిలుచుకుంటున్న సెక్యులరిజం అనే సిద్ధాంతం నిజంగా సెక్యులరిజంగా ఉండాలంటే, సిద్ధాంత పరంగానే కాకుండా, దాని ఆచరణ తీరును గురించి పునరాలోచించుకోవాలని నా విన్నపం. మనకు కావలసినది పొందికైన, నిబద్ధత కలిగిన రాజకీయ సెక్యు లరిజం. మనకు మేధో సెక్యులరిజం కూడా కావాలి. కానీ అది మన బహు ళత్వ, మత సంప్రదాయాల మూలాలు కలిగినదై ఉండాలి. ఇందుకు మనం గాంధీజీ నుంచి కొంత నేర్చుకోవలసి రావచ్చు.

- యోగేంద్ర యాదవ్‌
వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు
మొబైల్‌: 98688 88986

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement