విశ్లేషణ
మునుపెన్నడూ ఎరుగని రీతిలో 150కి పైగా రైతు సంస్థలు కలసి అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ అనే ఒకే వేదిక మీదకు వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రకాల పంటలకు ప్రాతినిధ్యం వహించే రైతు కూటమిగా అది రూపొందింది. చాలా కాలంగా వామపక్షాల నినాదంగా ఉన్న రైతు–కూలీ ఐక్యత వాస్తవమైంది. బహుశా మొదటిసారిగా రైతు సంస్థలు, సంఘాలన్నీ ఉమ్మడి అజెండాను అమోదించాయి. ఈ సంఘటన నిలవగలిగితే దేశ వ్యవసాయ సంక్షోభం సమస్యపై నిర్ణయా త్మకమైన జోక్యం చేసుకోగల బ్రహ్మాండమైన శక్తిసామర్థ్యాలు దానికి సమకూరగల అవకాశం ఉంది.
భారత రైతు ఉద్యమం నూతన దశలోకి ప్రవేశి స్తోందా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని చూపడానికి ఆరు వారాల సమయం చాలా తక్కువ. పున్ టాంబా రైతుల సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా రైతు ఆందోళనల స్వభావంలో కొంత కొత్తదనాన్ని సూచించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల రైతులను, రైతు సంఘాలను, ఉద్యమాలను అనుసంధానిస్తూ సాగిన ఆరు వారాల కిసాన్ ముక్తి యాత్ర కలిగించిన ప్రభావం దీన్ని రూఢి చేసింది. ఈ యాత్ర, మందసౌర్ పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన తర్వాత సరిగ్గా నెల రోజులకు, అంటే జూలై 6న అక్కడి నుంచే బయలుదేరింది. అది ఆరు రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరింది. క్షేత్ర స్థాయికి అతి సన్నిహితంగా సాగుతున్న రైతు ఉద్యమాల నూతన ప్రపంచంలోకి పరికించి చూడటానికి ఈ యాత్ర మంచి అవకాశం అయింది. ఈ యాత్ర ముగిశాక నేనిప్పుడు దేశ రైతు ఉద్యమాల చరిత్రలో మౌలికమైన పెను మార్పు ప్రారంభమైందని నిర్ధారణకు వచ్చాను.
మూడో తరం రైతు ఉద్యమం
మీడియా, ఈ మార్పునకు సంబంధించిన కొన్ని బాహ్య లక్షణాలను గుర్తించడం ఇప్పుడే మొదలైంది. జీన్స్ ధరించిన కొత్త తరం రైతు కార్యకర్తల గురించిన కథనాలు వెలువడ్డాయి. అలాగే స్మార్ట్‌ఫోన్లు, వాట్సాప్‌ల వాడకం కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. అలాంటి కథనాలు అసలు విషయాన్ని విస్మరించేలా చేయవచ్చు. భారత వ్యవసాయరంగంలోని నూతన వాస్తవాలకు, మారుతున్న భారత రాజకీయాల స్వభావానికి తగ్గట్టుగా రైతు ఉద్యమాలు కూడా సర్దుబాటవుతున్నాయి. ఇవి, మూడో తరం రైతు ఉద్యమాలు. వలసపాలనలోని భారతదేశంలో పెల్లుబికిన రైతు తిరుగుబాట్లు మొదటి తరానికి చెందినవి. మాప్పిలా రైతు తిరుగుబాటూ, గాంధేయవాద చంపారన్, ఖేరా, బార్డోలీ రైతు ఉద్యమాలూ, బెంగాల్‌లోని తెభాగా పోరాటం చాలా వరకు బ్రిటిష్ వలసవాద భూమి కౌలు విధానాల అణచివేతకు ప్రతిస్పందనలు.
రెండవ తరం రైతు ఉద్యమాలు 1980లలో సాగినవి. అవి, పల్లెటూరి మహేంద్ర సింగ్ తికాయత్, కార్యకర్తగా మారిన ఆర్థికశాస్తవేత్త శరద్ జోషి, స్వతంత్రుడైన మజుందార్ స్వామి నేతృత్వంలో సాగినవి. ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో నిర్లక్ష్యానికి గురవుతున్న సాపేక్షికంగా మెరుగైన రైతుల నిరసన ఇది. ప్రాథమికంగా వారి పోరాటాలు గిట్టుబాటు ధరల సమస్యపై సాగినవి. ఆ ఉద్యమాలకు సమాంతరంగా పెద్ద భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా భూమిలేని పేద శ్రామికుల పోరాటాలు సాగాయి. ప్రధానంగా వాటికి నక్సలైట్లు నాయకత్వం వహించారు.
నిజమైన ‘రైతు–కూలీ ఐక్యత’
ఇక మూడో తరం రైతు కార్యకర్తలు ఒక నూతన నేపథ్యాన్ని ఎదుర్కొంటున్నారు. గత తరంలో, భూకమతాల విఘటన (ముక్కలు చెక్కలు కావడం) జరిగింది. వ్యవసాయ రంగం మొత్తంగానే బికారిగా మారే పరిస్థితిని ఎదుర్కొంటోంది. సాగుబడి విస్పష్టంగానే లాభసాటి కాని కార్యకలాపం అయింది. వ్యవసాయరంగానికి సంబంధించిన ఆర్థిక, జీవావరణ సంక్షోభం భారత రైతు మనుగడకు సంబంధించిన సంక్షోభంగా మారుతోంది. నేటి రైతు ఉద్యమం, రైతు ఆత్మహత్యలనే వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కొత్త రైతు ఉద్యమం, భూస్వామి, రైతు, భాగస్వామ్య రైతు లేదా భూమిలేని రైతు అనే సంప్రదాయక విభజనలను తుడిచిపెట్టేస్తోంది. గ్రామీణ భారతం పేదరికం పాలు కావడంతో నేటి రైతు ఉద్యమాలు రైతులలోని అన్ని విభాగాలను ఒక్కటి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
‘రైతు–కూలీ ఐక్యత’ చాలా కాలంగా వామపక్షాల నినాదంగా ఉండేది. అయితే ఇటీవలి కాలంలోనే ఆ నినాదం రైతు ఉద్యమాలలో ప్రతిధ్వనించడం మొదలైంది.రైతు నిర్వచనాన్ని విస్తృత పరచడం వివిధ సామాజిక విభాగాలను కలుపుకుపోవడాన్ని ప్రోత్సహించింది. దళితులు, ఆదివాసులు చాలా ఎక్కువగా పనిచేసేది వ్యవసాయ కార్యకలాపాలలోనే. అయినా వారిని ప్రధాన స్రవంతి రైతు ఉద్యమాలు రైతులుగా చూడలేదు. ఈ పక్షపాత ధోరణి మారడం మొదలైంది. అలాగే దళిత, ఆదివాసీ సమస్యలను పట్టించుకోవడానికి రైతు ఉద్యమాలు సుముఖత చూపడం కూడా పెరిగింది. వ్యవసాయరంగంలోని ముడింట రెండు వంతుల శ్రమను చేస్తున్న మహిళా రైతులను గుర్తించడం పట్ల సుముఖత కూడా పెరిగింది.
కనీ వినీ ఎరుగని రైతు ఐక్యత
భావజాల పరంగా చెప్పాలంటే, ఈ నూతన రైతు ఉద్యమం పాత విభజనల నుంచి దూరంగా జరుగుతోంది. భూమిగలవారు, భూమిలేనివారి మధ్య వైరుధ్యంపై గతంలో దృష్టి కేంద్రీకృతమయ్యేది. నేడు అది, ఆ రెండు వర్గాలూ ఆర్థిక వ్యవస్థ బాధితులేననే గుర్తింపుపైకి మళ్లింది. భారత్ గీఇండియాగా (గ్రామీణ భారతం, పట్టణ ఇండియా అని) స్థూలంగా పేర్కొన్న పట్టణ– గ్రామీణ విభజనపై కూడా కొంత పునరాలోచన జరి గింది. ఎంతైనా ‘ఇండియా’ లోపల సైతం ‘భారత్’
లోని ఒక పెద్ద భాగం ఉంది. అంతేగానీ ‘భారత్’లో ‘ఇండియా’ ఉండటం కాదు. జీవావరణ సంబంధమైన సంక్షోభం రైతులు, రైతులుకానివారి పైన కూడా దుష్ప్రభావాన్ని చూపుతుందని, అనారోగ్యంతో ఉండే రైతులు దేశానికి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఉత్పత్తి చేస్తారనే గుర్తింపు కూడా పెరుగుతోంది.
భావజాలపరంగా పట్టువిడుపులు లేకుండా ఉండే వైఖరికి దూరంగా జరగడం రాజకీయ ఐక్యతను, విధానాలపై దృష్టిని కేంద్రీకరించడాన్ని అనుమతించింది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో 150కి పైగా రైతు సంస్థలు కలసి అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) అనే ఒక వేదిక మీదకు వచ్చాయి. అత్యంత వైవిధ్యభరితమైన రాజకీయ–భావజాలపరమైన వైఖరులు ఉన్న సంస్థలను కూడా ఈ సంఘటనలో భాగం చేసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వివిధ రకాల పంటలకు ప్రాతినిధ్యం వహించే రైతు కూటమిగా అది రూపొందింది. ఈ సంఘటన నిలవగలిగితే, వ్యవసాయ సంక్షోభం సమస్యపై నిర్ణయాత్మకమైన జోక్యం చేసుకోగల బ్రహ్మాండమైన శక్తిసామర్థ్యాలు దానికి సమకూరే అవకాశం ఉంది.
రైతు సంఘాలకు ఉమ్మడి అజెండా
బహుశా మొదటిసారిగా రైతు సంస్థలు, సంఘాలన్నీ ఉమ్మడి అజెండాను అమోదించాయి. ఏఐకేఎస్‌సీసీలో భాగంగా ఉన్న అన్ని సంస్థలూ, దానికి బయట ఉన్నవి సైతం న్యాయమైన, గిట్టుబాటు ధరలు, రుణ విముక్తి అనే రెండు అంశాల అజెండాపైనే తమ శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరించడానికి అంగీకరించాయి. రైతుకు ఇచ్చిన విశాలమైన అర్థానికి అనుగుణంగానే ఈ రెండు డిమాండ్లను కూడా మరింత సమగ్రమైన రీతిలో నిర్వచించారు. న్యాయమైన, గిట్టుబాటు ధరను భారత రైతాంగంలో పదింట ఒకరికి తక్కువ మందికే లబ్ధిని చేకూర్చే కనీస మద్దతు ధరకు, సేకరణకు పరిమితం చేయలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అన్ని పంటలకు, అందరు రైతులకు నిజంగానే అందేలా చేయాలని నేటి రైతు ఉద్యమాలు డిమాండు చేస్తున్నాయి. లేదంటే ప్రభుత్వం ప్రకటించిన ధరకు, రైతుకు దక్కిన ధరకు మధ్య ఉండే లోటును తమకు చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా, రుణ విముక్తి డిమాండును కూడా, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు లేదా గ్రామీణ సహకార బ్యాంకుల రుణాలకు పరిమితం చేయలేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల రుణ విషవలయాన్ని కూడా ఈ డిమాండులో భాగం చేశారు.
ఈ మౌలిక మార్పు, ఈ కొత్త రైతుల నాయకత్వంలోని మార్పులో కనిపించింది. మధ్యస్థాయిలోని రైతు ఉద్యమ నాయకత్వం గ్రామీణ మూలాలూ, పట్టణాలతో పరిచయమూ ఉన్న నాయకులతో కూడినది. వారు రైతు కుటుంబాల నుంచి వచ్చినవారు. రైతుల బాధలను వారు అర్థం చేసుకోగలరు. అంతేకాదు, విధానకర్తల భాషలోనూ మాట్లాడగలరు. వారు క్షేత్ర స్థాయిలో పోరాటాలను నడపడమే కాదు, సమాచార హక్కు చట్టాన్ని, వ్యాజ్యాలను సాధనాలుగా వాడగలరు కూడా. నేటి నూతన రైతు ఉద్యమాలకు వెన్నెముకగా ఉన్నది ఈ యువ నాయకత్వమే. ఈ కొత్త తరం రైతుల ఉద్యమాలు అంతకు ముందటి వాటికంటే మరింత ప్రభావశీలమైనవా? మునుపెన్నటి కంటే నేడు రైతు పోరాటాల ఆవశ్యకత ఎక్కవగా ఉన్నా... వారిని సమీకరించడం గతంలో కంటే మరింత కష్టంగా మారింది. ఊహాత్మకతను, రాజీలేనితత్వాన్ని కలిగి ఉంటూ, అందరినీ కలుపుకుపోయే నాయకత్వం అందుకు అవసరం అవుతోంది. రైతు ఉద్యమాలు ఎదుర్కొంటున్న సవాలు ఇదే.
- యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
‘ మొబైల్ : 98688 88986