గోమాత సాక్షిగా కొన్ని నిజాలు
గో రక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ల అసలు ఉద్దేశం ఈ సాకుతో ముస్లింలను వేటాడడం కానట్టయితే, వారు మొట్టమొదట చేయాల్సింది హిందూ సమాజంలో వేళ్లూనుకున్న వంచనను బట్టబయలు చేయ డమే. దేశంలో 25 కోట్ల హిందూ కుటుంబాలున్నాయి. మొత్తం 12 కోట్ల ఆవులున్నాయి. ఆవును పూజించే ప్రతి కుటుంబం ఒక్కో ఆవును పోషించి, అది పాలివ్వనప్పటికీ దానికి సేవ చేస్తూ ఉన్నట్టయితే ఆవుల రక్షణ దానంతట అదే జరుగుతుంది. కానీ రైతులు దూడలను, ముసలి ఆవులను పోషించే స్థితిలో లేరు. ఆవుల్ని పోషించలేని వారు వాటి పాలన కోసం గోశాలలకు చందాలిచ్చినా గోరక్షణ జరుగుతుంది.
అంధురాలైన పహలూ ఖాన్ తల్లి తన ఒక్కగానొక్క కొడుకును గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడానికి మాటలు సరిపోవు. ఎనభై యేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. బహుశా అప్పటికి పహలూ ఖాన్ తల్లి పుట్టే ఉండాలి. 1936లో హిసార్‌లో బక్రీద్ రోజున ఆవును బలి ఇచ్చారన్న వివాదంతో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో మా తాతగారైన మాస్టర్ రామ్ సింగ్‌ను హత్య చేశారు. పహలూ ఖాన్ తల్లి చేతుల్ని నా చేతుల్లోకి తీసుకోగా, నా మనసు గదిలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ పంక్తులు ప్రతిధ్వనించసాగాయి: ‘ఖూన్ కే ధబ్బే ధులేంగే కిత్నీ బర్సాతోం కే బాద్’ (ఎన్ని వర్షాకాలాల తర్వాత రక్తపు మరకలు తుడిచిపెట్టుకుపోతాయో).
శ్రేష్ఠమైన భావన వెనుక...
నేను గోరక్షణను సమర్థిస్తాను. మా ప్రాంతంలో బహుసంఖ్యాక సముదాయం ఆవును పవిత్రంగా భావిస్తుంది. వేదకాలంలో గోమాంసాన్ని తిని ఉండొచ్చు కానీ నేడు ఒక సగటు హిందువు పాటించే మత సంస్కారం అతన్ని గోమాంసం తినకుండా నిరోధిస్తుంది. మాంసాహారులైన హిందువులలో కొంత మందిని మినహాయిస్తే ఎక్కువ మంది ఆవు మాంసాన్ని తినరు.
ఆ మాటకొస్తే అనేకానేక మత సంస్కారాల వలెనే గోరక్షణ అనే భావన కూడా చాలా అందమైంది. మానవీయ సంవేదనలను కేవలం తమ మానవజాతి రక్షణకే కాకుండా ఇతర ప్రాణుల రక్షణ వరకూ విస్తరించడమనేది శ్రేష్ఠమైన భావన అనడంలో సందేహం లేదు. ఒకవేళ ఆవు ఈ ఆదర్శానికి ప్రతీకగా నిలిస్తే ఎవరికైనా ఇందులో అభ్యంతరమేముంటుంది?
హిందువులు పాటించే ధర్మం అతనిని గోహత్య చేయకుండా నిరోధిస్తున్నట్టుగానే, ముస్లింలు పాటించే ధర్మం అతనిని ఆవును చంపమని లేదా తినమని ఏమీ నిర్దేశించడం లేదు. ఖురాన్ షరీఫ్‌లోని రెండో సూరా ‘ఆవు’కు సంబంధించిన కథనాలపై ఆధారపడినదే. ఇస్లాంలో గోహత్య లేదా గోమాంసంపై పూర్తి నిషేధం ఏమీ లేదనేది వాస్తవమే. అయితే ఖురాన్ షరీఫ్ నిర్దేశాలన్నీ నిషేధం దిశలోనే ఉన్నాయి–పాలిచ్చే ఆవు, వ్యవసాయంలో ఉపయోగించే ఆవు, చిన్న దూడలు, ముసలి ఆవును బలివ్వడంపై నిషేధం ఉంది. హజరత్ మహమ్మద్ ఆవును పెంచాడు కాబట్టి ఆవు పెంపకాన్ని ‘సున్నత్’, అంటే ముస్లింల మతాచారానికి అనువైన పని గానే భావించారు. వాస్తవం ఏమిటంటే, పహలూ ఖాన్ గ్రామంలో నివసించే ముస్లింలు తరతరాలుగా గోపాలకులుగా ఉన్నారు. నేటి హరియాణాలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ముస్లింలు అధికంగా ఉండే మేవాత్ జిల్లాలోనే ఆవుల్ని ఎక్కువగా పెంచుతారు.
ఈ వివాదం అనివార్యం కాదు
అంటే అర్థం గోరక్షణ అనే సమస్యపై హిందువులూ, ముస్లింలూ ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడడం తప్పనిసరేమీ కాదు. ఈ అవగాహన ఆధారంగానే భారత రాజ్యాంగంలో గోరక్షణను ఆదేశిక సూత్రాలలో ఒకటిగా చేర్చారు. కాబట్టి నిజాయితీగా ప్రయత్నించినట్టయితే గోరక్షణ విషయంపై జాతీయ సమ్మతి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం గోరక్షకులు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది: మనం చేయాల్సింది ఆవుల రక్షణా లేక ఈ సాకుతో ముస్లింలను వేటాడడమా?
మన అసలు లక్ష్యం గోరక్షణే అయితే మనమొక చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేడు ఆవుకు అసలైన ప్రమాదం గోమాంసాన్ని తినేవాళ్లతో లేదు, సరికదా ఆవు ఫోటోను పూజించే వాళ్లతోనే దానికి ముప్పు పొంచి ఉంది. చేదు నిజం ఏమిటంటే ఆవు విషయంలో హిందూ సమాజం వైఖరి వంచనతో కూడుకొని ఉంది. మాటల్లో హిందూ సమాజం ఆవును గోమాత అని చెబుతుంది. దానికి బొట్టూ, కుంకుమలు పెడుతుంది. కానీ దాని పేరుతో కొట్లాటలు సృష్టిస్తుంది. కానీ అదే హిందువు ఆవును రక్షించడం కోసం చేసే కృషి ఆవగింజంత కూడా ఉండదు.
రక్షకులు విస్మరిస్తున్న వాస్తవం
దేశంలో ప్రతి నగరంలో ఆవులు ప్లాస్టిక్‌నూ, చెత్తనూ తినటాన్ని మనం రోజూ చూస్తుంటాం. నిరుడు కరువు కాలంలో లక్షలాది ఆవులు మేత లభించక ఎండిపోయిన చేలూ, చెలకల్లో పడి తిరుగుతూ ప్రాణాలు విడిచాయి. వాటి దుస్థితిపై నేను వ్యాసాలు రాశాను. విజ్ఞప్తులు చేశాను. కానీ హిందూ సమాజం వాటి రక్షణకు ముందుకు రాలేదు. ఒకవైపు గోరక్షణ అంటూ గొంతులు చించుకుంటుండగా, మరోవైపు గోశాలలు మూతపడిపోతున్నాయి.
అంటే ఆవులను కాపాడే ప్రథమ బాధ్యత ఉన్న హిందూ సమాజమే వాటిని ఈ దుస్థితికి నెట్టడంలో తొలి అపరాధి. మరో చేదు నిజం ఏమిటంటే గోహత్యకు బాధ్యత దానిని వధించే కసాయిది మాత్రమే కాదు. అది పాలివ్వడం మానెయ్యగానే దానిని అమ్మేసే, దూడలను వదిలేసే గోపాలకుడిదే గోవధలో మొదటి నేరం. ఆ తర్వాత ఆవును వధశాలకు చేరవేసే దళారీ పాత్ర ఉంటుంది. ఈ క్రమం చివరలో పెద్ద పెద్ద వధశాలలుంటాయి. వాటిలో లక్షలాది ఆవుల్ని వధించి వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తారు. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్లలో అత్యధికులు హిందువులే, ముస్లింలు కాదు!
నిషేధం ఎప్పుడు విధించాలి?
మూడో చేదు నిజం ఏమిటంటే, గోహత్య, గోమాం సంపై చట్టపరమైన నిషేధం విధించినంత మాత్రాన ఉపయోగమేమీ ఉండదు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఇప్పటికే గోహత్యపై నిషేధం అమలులో ఉంది. అయినా ఆవుల్ని పెంచే స్తోమత లేని రైతులు ముసలి ఆవుల్ని అమ్మేస్తారు. కాబట్టి గోరక్షణ వ్యవస్థను సరిచేయకుండా గోమాంసంపై నిషేధం విధించడమంటే అది ప్రతి వంటింట్లో పోలీసు అధికారి చొరబాటు వంటిదే. ఈ స్థితిలో అఖ్లాఖ్ వంటి దురంతాలు ప్రతి రోజూ జరుగుతూ ఉంటాయి. గోరక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసినట్టయితే గోహత్యకు విరుద్ధంగా జాతీయ ఏకాభిప్రాయం సాధించవచ్చు. హైందవేతరులు కూడా దీనిని ఆమోదించే అవకాశం ఉంది. అయితే మొదట హిందూ సమాజం తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది.
గో రక్షణ అంటే.. గో సేవ కూడా!l
గోరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ల అసలు ఉద్దేశం ఈ సాకుతో ముస్లింలను వేటాడడం కానట్టయితే, వారు మొట్టమొదట చేయాల్సింది హిందూ సమాజంలో వేళ్లూనుకున్న వంచనను బట్టబయలు చేయడమే. దేశంలో 25 కోట్ల హిందూ కుటుంబాలున్నాయి. మొత్తం 12 కోట్ల ఆవులున్నాయి. ఆవును పూజించే ప్రతి కుటుంబం ఒక్కో ఆవును పోషించి, అది పాలివ్వనప్పటికీ దానికి సేవ చేస్తూ ఉన్నట్టయితే ఆవుల రక్షణ దానంతట అదే జరిగిపోతుంది.
కానీ నేడు రైతులు దూడలను, ముసలి ఆవులను పోషించే స్థితిలో లేరు. ఆవుల్ని పోషించలేని వారు వాటి పాలన కోసం గోశాలలకు చందాలిచ్చినా గోరక్షణ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు కూడా గోశాలల నిర్వహణలో సహాయం చేసినా అందులో అభ్యంతరం ఉండాల్సిందేమీ లేదు. కానీ ప్రధాన బాధ్యత స్వీకరించాల్సింది మాత్రం హిందూ సమాజమే. పహలూ ఖాన్ తల్లి గోసేవ కోసం సిద్ధంగా ఉంది. గోరక్షణ కోసం ప్రయత్నించే క్రమంలో ‘అమరుడైన’ మా తాతగారు కూడా బతికుంటే ఈ బాధ్యతను స్వీకరించేవారు. కానీ ఆవును కేవలం టీవీలో మాత్రమే చూడగలిగే గోరక్షకులు దీనిని స్వీకరించగలరా?
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
యోగేంద్ర యాదవ్
మొబైల్ : 98688 88986
Twitter : @_YogendraYadav