gau rakshaks
-
సంచలన కేసులో కొత్త కోణం!
జాడోలి కా బాస్(రాజస్థాన్): దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉమర్ మహ్మద్ హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవులను అక్రమ రవాణా చేస్తున్నాడనే ఆరోపణలతో భరత్పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఉమర్‌ను నవంబర్ 10న దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. అతడి మృతదేహాన్ని రామ్‌గఢ్, జాడోలి కా బాస్ మార్గంలో రైలు పట్టాలపై పడేశారు. రైల్వే ట్రాక్‌పై పడేయటానికి ముందు అతడి తల నరికేశారని వెల్లడైంది. అయితే రైలు అతడి పైనుంచి వెళ్లడంతో మొండం నుంచి తల వేరైందని అంతకుముందు భావించారు. ముందు శిరచ్ఛేదం చేసి తర్వాతే రైల్వే ట్రాక్‌పై పడేశారని మృతదేహాన్ని ముందుగా గుర్తించిన రైల్వే కీమన్ సోను కుమార్ తెలిపినట్టు ‘న్యూస్ 18’ వెల్లడించింది. ‘మృతదేహం రెండు పట్టాల మధ్య ఉంది. తల మాత్రం బయటుంది. కాళ్లు, చేతులపై గాయాలున్నాయి. ఎవరో తెచ్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారని కచ్చితంగా చెప్పగలను. రెండు పట్టాల మధ్య పడేసిన బాడీపైనుంచి రైలు వెళ్లితే తల ఎలా వేరవుతుంది? మృతదేహాన్ని పట్టాల మధ్య నిలువుగా పడేశారు, అడ్డంగా కాదు. కాబట్టి కచ్చితంగా శిరచ్ఛేదం చేసిన తర్వాతే ఇక్కడ పడేశార’ని కుమార్ పేర్కొన్నాడు. మధుర చెందిన ఆయన 1489/3-4 రైల్వే ట్రాక్ వద్ద కీమన్గా విధులు నిర్వహిస్తున్నారు. మరో రైల్వే కార్మికుడు జగదీశ్ ప్రసాద్ కూడా కుమార్ వాదనతో ఏకీభవించాడు. మృతదేహం పడివున్న విధానాన్ని బట్టి చూస్తే తలనరికేసి ఇక్కడకు తీసుకొచ్చినట్టు కనబడుతోందని అభిప్రాయపడ్డారు. బాడీని రైలు పట్టాలపై అడ్డంగా పడుకోబెడితేనే తల తెగే అవకాశముందన్నారు. ఒకవేళ మృతదేహం పైనుంచి రైలు వెళితే శరీర భాగాలు అక్కడక్కడా పడే అవకాశముందని పదేళ్లు గేట్మాన్గా పనిచేసి ఏడాదిగా కీమన్గా పనిచేస్తున్న జగదీశ్ వివరించారు. మృతుడి ఛాతిపై ఎటువంటి బుల్లెట్ గాయాలు తాను గుర్తించలేదని కుమార్ తెలిపారు. ఉదర భాగంలో రంధ్రం గుర్తించానని చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఈ అనుమానాలు నివృత్తి అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రామ్‌వీర్ గుజ్జర్, భగవాన్ సింగ్‌లను అళ్వార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 201, 302 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని అళ్వార్ ఏఎస్పీ తెలిపారు. ఉమర్ దేహాన్ని హంతకులు ఖండించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే రైల్వే కార్మికులు చెప్పిన దాంట్లో వాస్తమున్నట్టు కనబడుతోంది. అసలేం జరిగిందనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. -
‘అతడి దగ్గర చనిపోయిన ఆవు ఉంది’
జైపూర్: ‘రాష్ట్రంలో ప్రతి నగరంలో జరుగుతున్న దారుణాలను ఆపడం ప్రభుత్వం వల్ల కాదు. ఇలాంటి ఘటనలను నియత్రించేందుకు ప్రభుత్వం వద్ద సరిపడా మానవ వనరులు లేవు. నిందితుడు ఏ మతానికి చెందినవాడైనా వదిలిపెట్టం, ముస్లిం లేదా హిందువైనా చర్యలు తప్పవ’ని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా అన్నారు. భరత్పూర్ జిల్లాలో గోరక్షకులు ఒక వ్యక్తిని కాల్చి చంపిన ఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. మృతుడి వాహనంలో ఆరు గోవులను కనుగొన్నారని, ఇందులో మృతి చెందిన ఆవు కూడా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో శాంత్రిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె.. భరత్పూర్ జిల్లాలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. హత్య చేసి తప్పించుకోవడం సులభమన్న భావన ప్రభుత్వ చేతగానితనం వల్ల వచ్చిందని ధ్వజమెత్తారు. ఆవులను తీసుకెళ్తున్న ఉమర్ ఖాన్(35) అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. భరత్పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్ మృతదేహాన్ని రామ్‌గఢ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తించినట్టు డీఎస్పీ అనిల్ బెనివాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్టు ఆల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాశ్ చెప్పారు. ఉమర్ ఖాన్‌తో పాటు బుల్లెట్ గాయాలైన మరొ వ్యక్తిని హరియణా ఆస్పత్రిలో చేర్చారు. -
గెలుపు కోసమే గాండ్రింపులు
రెండో మాట ఫలానా వారు, లేదా ఫలానా సంస్థ/సంస్థలు ‘గోరక్ష’ దౌర్జన్యకారులని మోదీ ప్రకటించకపోయినా, ఆరెస్సెస్ లాంటి ప్రధాన సంస్థ, ఆ సంస్థ అనుబంధ శాఖలు ఇలాంటి ‘గోరక్ష’ దౌర్జన్యకాండలకు ఎలా కారణమవుతున్నాయో సుప్రసిద్ధ భారత రాజకీయ విశ్లేషకుడు, పాత్రికేయుడు ధీరేంద్ర కె. ఝా ఈ ఏడాది (2017) ప్రారంభ దినాల్లోనే ‘షాడో ఆర్మీస్’ అనే పరిశోధనాత్మక గ్రంథంలో వివరించారు. అవి ఇండియాలో ఏ విధంగా పని చేస్తూ వచ్చాయో ధీరేంద్ర ఝా ‘అజ్ఞాత సైనికులు’ గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు. ‘గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. గోరక్ష పేరుతో ఎవరూ చట్టాన్ని తమ చేతులలోకి తీసుకోరాదు. పలువురు సంఘ వ్యతిరేకశక్తులు ఈ అవకాశం విని యోగించుకుని సమాజంలో అస్థిర పరిస్థితులకు కారణమవుతున్నారు. ఈ మతహింసను అరికట్టడంలో ప్రతిపక్షాలు సహకారం అందించాలి.’ – నరేంద్రమోదీ (పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఒక రోజు ముందు, 16వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో) తెలివి ఎవడబ్బ సొమ్ము? వెనుకటికి ఒకడు కన్నవారిని కడతేర్చి, ‘అమ్మా బాబులు లేనివాడిని అదుకోండి!’ అని మొత్తుకున్నాడట. ఇంతకూ ప్రధాని మోదీ విపక్షాలను ఉద్దేశించి చేసిన విజ్ఞాపనలో గోరక్ష పేరుతో అరాచకాలు చేస్తున్నవారు ఎవరు? ఆ పేరుతో హింసకు దిగుతున్నవారు ఎవరు? అనే అంశాన్ని మాత్రం స్పష్టంగా పేరుపెట్టి చెప్పలేదు. ఎవరు గోరక్ష పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో బహిరంగపరచలేకపోయారు. చట్టాన్ని ఎవరూ తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోరాదన్న మోదీ మాటను గౌరవించాల్సిందే. అలాగే మతహింసను అరికట్టే కృషిలో విపక్షాలు కూడా సహకరించాలన్న ప్రధాని విన్నపాన్ని కూడా గౌరవిస్తాం. అయితే తానే పేర్కొన్న ఆ అజ్ఞాత శక్తులేవో చెప్పకుండా ఆయన మౌనం దాల్చారు. ఆవు తోకతో గెలుపు వైతరణి దాటడానికే! ఇంతకూ విపక్షాలకు ఇలాంటి విజ్ఞాపనను ఇప్పుడు ప్రధాని చేయడం వెనుక రహస్యం ఏమిటి? సోమవారం (17వ తేదీ) కొత్త రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు ముహూర్తం కాబట్టి! బీజేపీ (ఆరెస్సెస్), ఎన్డీఏ పరివార్ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ బరిలో ఉన్నారు కాబట్టి! విపక్షాల తరఫున మీరాకుమార్ పోటీలో ఉన్నారు కనుక! కాబట్టే మోదీకి అమోఘమైన లౌక్యం అవసరమైంది. కోవింద్ నెగ్గాలంటే ఈ ఒక్క సందర్భానికైనా సెక్యులరిజం అవసరమై ఉంటుంది. గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు సరే, ఈ కృషిలో కేంద్రం తన వంతు ధర్మంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదో కూడా మోదీ వివరించలేదు. నిజానికి ఈ మతహింసకు ఎలాంటి వ్యక్తులు, ఏయే సంస్థలు కారణమో చెప్పి, మరింత తీవ్రంగా ఖండించి ఉంటే మోదీ ప్రజాభిమానాన్ని చూరగొని ఉండేవారు. కానీ ఆయన మాటలలో అదే కొరవడింది. గోరక్ష పేరుతో పలువురు సంఘ వ్యతిరేక శక్తులు హింసాకాండకు దిగారని ఆయనే అన్నప్పటికీ, వాళ్లెవరో ఆయన పేర్కొనలేదు. అంటే ‘సమాజంలో అస్థిర పరిస్థితులకు కారకులు’ ఎవరో కూడా బయటపెట్టలేదు. మతహింసను అరికట్టడంలో ప్రతిపక్షాలు సహకరించాలని కోరారే గానీ దేశవ్యాప్తంగా మూడేళ్లుగా గోరక్ష పేరుతోనే హేతువాదులపైన, దళితులపైన, జాతీయ మైనారిటీలపైన విచ్చలవిడిగా సాగిన దాడులకూ, దౌర్జన్యాలకూ కారకులు ఎవరో కూడా ఆయన వెల్లడించలేదు. ఆయా వర్గాల ఆహారపు అలవాట్ల మీద, వస్త్ర ధారణ మీద, రాజ్యాంగం శాసించినట్టు పాఠ్యపుస్తకాలలో సెక్యులర్ అంశాలను చేర్చడంపైన విరుచుకుపడుతున్నవారు ఎవరో ఆయన చెప్పలేదు. అంతా శ్రీవైష్ణవులే కానీ రొయ్యలబుట్ట ఖాళీ అన్న చందంగా గోరక్ష పేరుతో జరుగుతున్న ఈ అజ్ఞాత హింసకు పునాదులు ఎక్కడ ఉన్నాయో మోదీకి తెలియవంటే నమ్మగలమా! గోరక్షకుల అసలు ధ్యేయం ఏమిటి? కొత్త రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ‘శాయంగల విన్నపము’లలో భాగంగానే మోదీ నోటి వెంట ఆ తరహా ఆపద్ధర్మ విజ్ఞాపన వెలువడింది. అంతేతప్ప, ఆయన మాటను కుల, వర్గ, మతాతీత సెక్యులర్ వ్యవస్థ రక్షణకు ఉద్దేశించిన రక్షా కవచంగా భావించలేం. ఎందుకంటే, గోరక్షకుల ధ్యేయం నిజంగా గోవుల రక్షణ కాదు. వాటికి అవసరమైన మేతను, పచ్చికబయళ్లను పెంచి, గోశాలలు ఏర్పాటు చేసి వాటి సంక్షేమాన్ని చూడడం కాదు. రాజకీయ కక్షలలో భాగంగా చేపట్టే గోరక్ష ఉద్యమాలు, దౌర్జన్యాలు చేటు చేస్తాయి. హిందుత్వవాదులుగా ‘హిందూరాష్ట్ర సాధన’ కోసం పరితపించిన గోల్వాల్కర్, సావర్కర్లు విభిన్న జాతుల, మతాల, కులాల, తెగల సమన్వయంతో విలసిల్లే భారతదేశమే మనదన్న స్పృహ లేకుండా తలపెట్టినదే గోరక్ష చిట్కా. ఈ పూర్వరంగాన్ని మభ్యపెట్టి ఎవరో హింస చేస్తుంటే, అందుకు రాష్ట్ర ప్రభు త్వాలు ‘కఠినంగా వ్యవహరించకుండా ఉన్నట్టూ’ ఆ హింసను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు సహకరించనట్టూ ఎదురుదాడికి పాలకులు దిగడం– ఇప్పటికీ చరిత్ర పాఠాలు నేర్వడానికి వారు సిద్ధంగా లేరని భావించడానికి ఆస్కారం కల్పిస్తున్నది. మోదీ వెల్లడించడానికి ఇష్టపడని ఆ ఫలానావారి ‘హింస’కు వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా విద్యార్థి, ప్రజా సంఘాలు, సాహిత్య, సాంస్కృతిక రంగాల జాతీయ పురస్కార గ్రహీతలు ఎందరో నిరసనలు తెలిపారు, ఉద్యమాలు నడుపుతున్నారు, పురస్కారాలు తిప్పికొడుతున్నారని గ్రహించాలి. ఫలానా వారు, లేదా ఫలానా సంస్థ/ సంస్థలు ‘గోరక్ష’ దౌర్జన్యకారులని మోదీ ప్రకటించకపోయినా ఆరెస్సెస్ లాంటి ప్రధాన సంస్థ, ఆ సంస్థ అనుబంధ శాఖలు ఇలాంటి ‘గోరక్ష’ దౌర్జన్యకాండలకు ఎలా కారణమవుతున్నాయో సుప్రసిద్ధ భారత రాజకీయ విశ్లేషకుడు, పాత్రికేయుడు ధీరేంద్ర కె. ఝా ఈ ఏడాది (2017) ప్రారంభ దినాల్లోనే ‘షాడో ఆర్మీస్’(అజ్ఞాత సైన్యం) అనే పరిశోధనాత్మక గ్రంథంలో వివరించారు. ఈ ‘అజ్ఞాత శక్తులు’ ఎన్ని రూపాల్లో పనిచేస్తుంటాయో, ఈ అనుబంధ శాఖలు బ్రిటిష్ వలసవాద సైన్యం దుస్తుల నుంచి ఇటలీలోని ఫాసిస్టు ముస్సోలినీ సైన్య నిర్మాణ లక్షణాల నుంచి ఎరువు తెచ్చుకుని ఇండియాలో ఏ విధంగా పనిచేస్తూ వచ్చాయో ధీరేంద్ర ఝా ‘అజ్ఞాత సైనికులు’ గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించాడు. అతని పరిశోధన ప్రకారం ‘‘గత మూడు దశాబ్దాలుగా ‘హిందుత్వ’ రాజకీయాలు భారీ స్థాయిలో వ్యాప్తి అవుతూ వచ్చాయి. భారతీయ సమాజాన్ని చీల్చిపెట్టే పెక్కు రకాల బ్రాండ్ రాజకీయాలకు ఇది పునాదులు వేసింది. ఇందుకు దోహదం చేసే సంస్థ ఒక్క భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే కాదు, ఈ పార్టీకి అజ్ఞాతంగా పనిచేసే పెక్కు శక్తులు కూడా రంగ ప్రవేశం చేశాయ’’ని ధీరేంద్ర రాశాడు. అఖండ భారత సంస్థగా 1925లో అవతరించిన ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్’(ఆరెస్సెస్) ఇంతవరకూ భారతీయ చట్టాలలో దేని పరిధిలో కూడా రిజిస్టర్ కాని సంస్థ అని ఆయన పేర్కొన్నాడు. అలాగే పేరుకు తమది సాంస్కృతిక సంస్థ అని చెప్పుకున్నా దాని ప్రధాన వ్యాపకం రాజకీయ లక్ష్యమేనని ధీరేంద్ర చెబుతూ, ఈ సంస్థ కింద చాలామందికి తెలియని మొత్తం 36 అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటిలో బీజేపీ మాత్రమే రాజకీయాలకు అంకితమైన ఆరెస్సెస్ అనుబంధ సంస్థ. ఈ 36 విభాగాలనూ కలిపి ‘సంఘ్ పరివార్’గా పరిగణిస్తారు. పైకి చెప్పింది చేయక పోవటం, చేసింది చెప్పక పోవటం– ఈ ‘అజ్ఞాత సైన్యం’ లక్షణమన్న లోకోక్తి కూడా వ్యాప్తిలో ఉంది. ఆరెస్సెస్‌ను మూడుసార్లు ఎందుకు నిషేధించారు? బహుశా బీజేపీ గత 30 సంవత్సరాలలో పార్లమెంటులో కేవలం 2 సీట్లనుంచి, 2014 నాటికి 282 సీట్లకు ఎదగడం వెనుక రహస్యం దాని మాతృ సంస్థ అజ్ఞాత కార్యకలాపాలే కావచ్చు. అలాంటి ఆరెస్సెస్ సంస్థను దేశ స్వాతంత్య్రం తర్వాత మూడుసార్లు ఎందుకు నిషేధించాల్సి వచ్చింది? ఒకసారి మహాత్మాగాంధీ హత్యానంతరం (1948) మరోసారి 1970లలో ఎమర్జెన్సీ కాలంలో, ఇంకోసారి బాబ్రీ మసీదును విధ్వంసం చేసినప్పుడు (1992). ఈ అన్ని దశలను వివరిస్తూ ధీరేంద్ర ఝా అసలు విషయాన్ని ఇలా వర్ణించాడు: ‘‘బీజేపీ అధికారికంగా రాజకీయాలకు అంకితమైన ఆరెస్సెస్ అనుబంధ సంస్థ. మిగతా అనుబంధ సంస్థల ఆశయం ఇండియాను ఇక్కడ నివసించే ఇతర జాతులతో, విభిన్న మతాలతో, భిన్న జాతీయ ‘మైనారిటీ’ లతో సంబంధం లేని కేవల హిందూ రాష్ట్రంగా మార్చడం. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)– బీజేపీకి నీడలా వెన్నంటి ఉండే తెరచాటు సంస్థలు. ఈ రెండు సంస్థలూ ఎన్నికల్లో పోటీ చేయవుగానీ, జనాల్ని సమీకరించడంలో రాజకీయ బలాబలాల్లో మార్పు తీసుకురావడానికి తగిన సమస్యల్ని ముందుకు నెట్టడానికి ఒక రాజకీయ పార్టీ చేయగల పనులన్నింటినీ పెడుతుంటాయి’’. ఏ ‘సంఘ విద్రోహుల’ వల్ల భారతీయ సమాజానికి ‘అస్థిర పరిస్థితులు’ ముంచుకొస్తున్నాయో తేల్చే బాధ్యతను మోదీ వదిలి, ఆ పనిని మనకు బదలీ చేస్తున్నట్టుంది. అధికారంలో ఉన్న తాను పరిష్కరించగలిగి కూడా, పరిష్కరించలేక, రాష్ట్రపతిగా కేవలం కోవింద్ విజయావకాశాన్ని పెంచే ప్రయత్నంలో ‘గోరక్ష’ దౌర్జన్యం పేరిట మోదీ విపక్షాలపైన కనికట్టు ప్రయోగం చేశారు. దేశ భద్రత కోసం, దేశ రక్షణలో మీకు బాసటగానే ఉంటామని విపక్షాలు అఖిలపక్ష సమావేశంతో సరిపెట్టుకున్నాయి గానీ, దేశ భద్రతకు దేశ రక్షణకూ, దేశంలో మత జాతర ప్రాతిపదికపై విచ్చలవిడిగా కొనసాగుతున్న అరాచకాలకు స్వస్తి చెప్పించడానికి సంబంధం ఉన్న సత్యాన్ని మరవరాదు. అంటే, దేశంలో పాలకులు అనుసరించే నీతికీ, విధాన స్వచ్ఛతకూ–వైదేశిక నీతికీ, ఇరుగుపొరుగుతో సంబంధాలను శాంతి చర్చల ద్వారా మెరుగుపర్చుకోవడానికీ విడదీయరాని సంబంధం ఉందన్న సంగతిని కూడా సదా గుర్తుం చుకోవాలి. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఉగ్రదాడి: బీజేపీకి శివసేన చీఫ్ సవాల్!
ముంబై: జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. తన మిత్రపక్షమైన బీజేపీకి చురకలింటిస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు బీజేపీకి చేతనైతే గో రక్షకులను పంపించాలని సవాల్ విసిరారు. రాజకీయాంశాల్లో సంస్కృతి, క్రీడలను తీసుకురావద్దని బీజేపీ ఎప్పుడూ చెబుతోందని, కానీ మతం, రాజకీయం జతకలిసి ఉగ్రవాదం రూపంలో చెలరేగిపోతుందని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులలో గుజరాత్ వాసులు ఐదుగురు కాగా, మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో ఉద్ధవ్ ఈ విషయంపై కాస్త సీరియస్‌గా ఉన్నారు. గణేష్ మండల్స్తో త్వరలో జరగనున్న పండగకు ఏర్పాట్లకోసం మంగళవారం ఉద్ధవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ప్రస్తుతం గో రక్షక్షులు అనే విషయం సమస్యాత్మకంగా మారింది. గోవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ సామాన్యులపై దాడులకు పాల్పడే గో రక్షకులు ఎంతో హాని తలపెడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కోగలరా. మీరు ఎంతగానో మద్ధతిచ్చే గో సంరక్షకులను ఉగ్రవాదులపై యుద్ధం చేసేందుకు పంపిస్తే బీజేపీకి సమస్య తీవ్రత అర్థమవుతోంది. కశ్మీర్లో వేర్పాటువాదులతో బీజేపీ ఎలాగైనా చర్చించి అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని' చెప్పారు. కొన్ని ప్రత్యేక పండుగల నేపథ్యంలో శబ్ధాల తీవ్రతపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించగా, వాటిని కాస్త సవరిస్తూ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కోరారు. -
గోమాత సాక్షిగా కొన్ని నిజాలు
గో రక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ల అసలు ఉద్దేశం ఈ సాకుతో ముస్లింలను వేటాడడం కానట్టయితే, వారు మొట్టమొదట చేయాల్సింది హిందూ సమాజంలో వేళ్లూనుకున్న వంచనను బట్టబయలు చేయ డమే. దేశంలో 25 కోట్ల హిందూ కుటుంబాలున్నాయి. మొత్తం 12 కోట్ల ఆవులున్నాయి. ఆవును పూజించే ప్రతి కుటుంబం ఒక్కో ఆవును పోషించి, అది పాలివ్వనప్పటికీ దానికి సేవ చేస్తూ ఉన్నట్టయితే ఆవుల రక్షణ దానంతట అదే జరుగుతుంది. కానీ రైతులు దూడలను, ముసలి ఆవులను పోషించే స్థితిలో లేరు. ఆవుల్ని పోషించలేని వారు వాటి పాలన కోసం గోశాలలకు చందాలిచ్చినా గోరక్షణ జరుగుతుంది. అంధురాలైన పహలూ ఖాన్ తల్లి తన ఒక్కగానొక్క కొడుకును గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెను ఓదార్చడానికి మాటలు సరిపోవు. ఎనభై యేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకు గుర్తుకొచ్చింది. బహుశా అప్పటికి పహలూ ఖాన్ తల్లి పుట్టే ఉండాలి. 1936లో హిసార్‌లో బక్రీద్ రోజున ఆవును బలి ఇచ్చారన్న వివాదంతో అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో మా తాతగారైన మాస్టర్ రామ్ సింగ్‌ను హత్య చేశారు. పహలూ ఖాన్ తల్లి చేతుల్ని నా చేతుల్లోకి తీసుకోగా, నా మనసు గదిలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ పంక్తులు ప్రతిధ్వనించసాగాయి: ‘ఖూన్ కే ధబ్బే ధులేంగే కిత్నీ బర్సాతోం కే బాద్’ (ఎన్ని వర్షాకాలాల తర్వాత రక్తపు మరకలు తుడిచిపెట్టుకుపోతాయో). శ్రేష్ఠమైన భావన వెనుక... నేను గోరక్షణను సమర్థిస్తాను. మా ప్రాంతంలో బహుసంఖ్యాక సముదాయం ఆవును పవిత్రంగా భావిస్తుంది. వేదకాలంలో గోమాంసాన్ని తిని ఉండొచ్చు కానీ నేడు ఒక సగటు హిందువు పాటించే మత సంస్కారం అతన్ని గోమాంసం తినకుండా నిరోధిస్తుంది. మాంసాహారులైన హిందువులలో కొంత మందిని మినహాయిస్తే ఎక్కువ మంది ఆవు మాంసాన్ని తినరు. ఆ మాటకొస్తే అనేకానేక మత సంస్కారాల వలెనే గోరక్షణ అనే భావన కూడా చాలా అందమైంది. మానవీయ సంవేదనలను కేవలం తమ మానవజాతి రక్షణకే కాకుండా ఇతర ప్రాణుల రక్షణ వరకూ విస్తరించడమనేది శ్రేష్ఠమైన భావన అనడంలో సందేహం లేదు. ఒకవేళ ఆవు ఈ ఆదర్శానికి ప్రతీకగా నిలిస్తే ఎవరికైనా ఇందులో అభ్యంతరమేముంటుంది? హిందువులు పాటించే ధర్మం అతనిని గోహత్య చేయకుండా నిరోధిస్తున్నట్టుగానే, ముస్లింలు పాటించే ధర్మం అతనిని ఆవును చంపమని లేదా తినమని ఏమీ నిర్దేశించడం లేదు. ఖురాన్ షరీఫ్‌లోని రెండో సూరా ‘ఆవు’కు సంబంధించిన కథనాలపై ఆధారపడినదే. ఇస్లాంలో గోహత్య లేదా గోమాంసంపై పూర్తి నిషేధం ఏమీ లేదనేది వాస్తవమే. అయితే ఖురాన్ షరీఫ్ నిర్దేశాలన్నీ నిషేధం దిశలోనే ఉన్నాయి–పాలిచ్చే ఆవు, వ్యవసాయంలో ఉపయోగించే ఆవు, చిన్న దూడలు, ముసలి ఆవును బలివ్వడంపై నిషేధం ఉంది. హజరత్ మహమ్మద్ ఆవును పెంచాడు కాబట్టి ఆవు పెంపకాన్ని ‘సున్నత్’, అంటే ముస్లింల మతాచారానికి అనువైన పని గానే భావించారు. వాస్తవం ఏమిటంటే, పహలూ ఖాన్ గ్రామంలో నివసించే ముస్లింలు తరతరాలుగా గోపాలకులుగా ఉన్నారు. నేటి హరియాణాలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ముస్లింలు అధికంగా ఉండే మేవాత్ జిల్లాలోనే ఆవుల్ని ఎక్కువగా పెంచుతారు. ఈ వివాదం అనివార్యం కాదు అంటే అర్థం గోరక్షణ అనే సమస్యపై హిందువులూ, ముస్లింలూ ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబడడం తప్పనిసరేమీ కాదు. ఈ అవగాహన ఆధారంగానే భారత రాజ్యాంగంలో గోరక్షణను ఆదేశిక సూత్రాలలో ఒకటిగా చేర్చారు. కాబట్టి నిజాయితీగా ప్రయత్నించినట్టయితే గోరక్షణ విషయంపై జాతీయ సమ్మతి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం గోరక్షకులు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది: మనం చేయాల్సింది ఆవుల రక్షణా లేక ఈ సాకుతో ముస్లింలను వేటాడడమా? మన అసలు లక్ష్యం గోరక్షణే అయితే మనమొక చేదు నిజాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేడు ఆవుకు అసలైన ప్రమాదం గోమాంసాన్ని తినేవాళ్లతో లేదు, సరికదా ఆవు ఫోటోను పూజించే వాళ్లతోనే దానికి ముప్పు పొంచి ఉంది. చేదు నిజం ఏమిటంటే ఆవు విషయంలో హిందూ సమాజం వైఖరి వంచనతో కూడుకొని ఉంది. మాటల్లో హిందూ సమాజం ఆవును గోమాత అని చెబుతుంది. దానికి బొట్టూ, కుంకుమలు పెడుతుంది. కానీ దాని పేరుతో కొట్లాటలు సృష్టిస్తుంది. కానీ అదే హిందువు ఆవును రక్షించడం కోసం చేసే కృషి ఆవగింజంత కూడా ఉండదు. రక్షకులు విస్మరిస్తున్న వాస్తవం దేశంలో ప్రతి నగరంలో ఆవులు ప్లాస్టిక్‌నూ, చెత్తనూ తినటాన్ని మనం రోజూ చూస్తుంటాం. నిరుడు కరువు కాలంలో లక్షలాది ఆవులు మేత లభించక ఎండిపోయిన చేలూ, చెలకల్లో పడి తిరుగుతూ ప్రాణాలు విడిచాయి. వాటి దుస్థితిపై నేను వ్యాసాలు రాశాను. విజ్ఞప్తులు చేశాను. కానీ హిందూ సమాజం వాటి రక్షణకు ముందుకు రాలేదు. ఒకవైపు గోరక్షణ అంటూ గొంతులు చించుకుంటుండగా, మరోవైపు గోశాలలు మూతపడిపోతున్నాయి. అంటే ఆవులను కాపాడే ప్రథమ బాధ్యత ఉన్న హిందూ సమాజమే వాటిని ఈ దుస్థితికి నెట్టడంలో తొలి అపరాధి. మరో చేదు నిజం ఏమిటంటే గోహత్యకు బాధ్యత దానిని వధించే కసాయిది మాత్రమే కాదు. అది పాలివ్వడం మానెయ్యగానే దానిని అమ్మేసే, దూడలను వదిలేసే గోపాలకుడిదే గోవధలో మొదటి నేరం. ఆ తర్వాత ఆవును వధశాలకు చేరవేసే దళారీ పాత్ర ఉంటుంది. ఈ క్రమం చివరలో పెద్ద పెద్ద వధశాలలుంటాయి. వాటిలో లక్షలాది ఆవుల్ని వధించి వాటి మాంసాన్ని ఎగుమతి చేస్తారు. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్లలో అత్యధికులు హిందువులే, ముస్లింలు కాదు! నిషేధం ఎప్పుడు విధించాలి? మూడో చేదు నిజం ఏమిటంటే, గోహత్య, గోమాం సంపై చట్టపరమైన నిషేధం విధించినంత మాత్రాన ఉపయోగమేమీ ఉండదు. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో ఇప్పటికే గోహత్యపై నిషేధం అమలులో ఉంది. అయినా ఆవుల్ని పెంచే స్తోమత లేని రైతులు ముసలి ఆవుల్ని అమ్మేస్తారు. కాబట్టి గోరక్షణ వ్యవస్థను సరిచేయకుండా గోమాంసంపై నిషేధం విధించడమంటే అది ప్రతి వంటింట్లో పోలీసు అధికారి చొరబాటు వంటిదే. ఈ స్థితిలో అఖ్లాఖ్ వంటి దురంతాలు ప్రతి రోజూ జరుగుతూ ఉంటాయి. గోరక్షణ వ్యవస్థను కట్టుదిట్టం చేసినట్టయితే గోహత్యకు విరుద్ధంగా జాతీయ ఏకాభిప్రాయం సాధించవచ్చు. హైందవేతరులు కూడా దీనిని ఆమోదించే అవకాశం ఉంది. అయితే మొదట హిందూ సమాజం తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. గో రక్షణ అంటే.. గో సేవ కూడా!l గోరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ల అసలు ఉద్దేశం ఈ సాకుతో ముస్లింలను వేటాడడం కానట్టయితే, వారు మొట్టమొదట చేయాల్సింది హిందూ సమాజంలో వేళ్లూనుకున్న వంచనను బట్టబయలు చేయడమే. దేశంలో 25 కోట్ల హిందూ కుటుంబాలున్నాయి. మొత్తం 12 కోట్ల ఆవులున్నాయి. ఆవును పూజించే ప్రతి కుటుంబం ఒక్కో ఆవును పోషించి, అది పాలివ్వనప్పటికీ దానికి సేవ చేస్తూ ఉన్నట్టయితే ఆవుల రక్షణ దానంతట అదే జరిగిపోతుంది. కానీ నేడు రైతులు దూడలను, ముసలి ఆవులను పోషించే స్థితిలో లేరు. ఆవుల్ని పోషించలేని వారు వాటి పాలన కోసం గోశాలలకు చందాలిచ్చినా గోరక్షణ జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వాలు కూడా గోశాలల నిర్వహణలో సహాయం చేసినా అందులో అభ్యంతరం ఉండాల్సిందేమీ లేదు. కానీ ప్రధాన బాధ్యత స్వీకరించాల్సింది మాత్రం హిందూ సమాజమే. పహలూ ఖాన్ తల్లి గోసేవ కోసం సిద్ధంగా ఉంది. గోరక్షణ కోసం ప్రయత్నించే క్రమంలో ‘అమరుడైన’ మా తాతగారు కూడా బతికుంటే ఈ బాధ్యతను స్వీకరించేవారు. కానీ ఆవును కేవలం టీవీలో మాత్రమే చూడగలిగే గోరక్షకులు దీనిని స్వీకరించగలరా? వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
దేశంలో న్యాయపాలన సాగుతుందా ?
-
రాజస్థాన్‌లో దారుణం..యువకుడి మృతి
జైపూర్: రాజస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఆవులను తరలిస్తున్న ముస్లిం యువకులపై గో రక్షక దళ సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అయిదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఓయువకుడు మరణించాడు. అల్వార్ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ షాకింగ్ వీడియె ఇపుడు నెట్లో చక్కర్లుకొడుతోంది. స్థానిక పోలీస్అధికారి రమేష్ చాంద్ సినీశ్వర్ అందించిన వివరాల ప్రకారం జాతీయ రహదారి జుగువాస్ వద్ద నాలుగు వాహనాలను గోరక్షక దళ్ సభ్యులు అటకాయించారు. దాదాపు 15మంది ముస్లిం యువకులపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ అనేయువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. దీంతో నిందితులపై హత్య కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలుగా స్థానిక పోలీసులు గుర్తించిన పోలీసులు వీరిపై కేసులు నమోదుచేశారు. అటు ఆవులను అక్రమంగా తరలిస్తున్న కేసులో ముస్లింయువకులపై కూడా కేసులు నమోదుచేశారు. -
'తన్నండి కానీ.. ఎముకలు విరగ్గొట్టొద్దు'
మీరట్: తమ సంస్థకు చెందిన యువ గో సంరక్షకులకు విశ్వహిందూ పరిషత్ మరో సలహా చెప్పింది. గోవులను అక్రమంగా తరలించేవారిని, హింసించేవారిని కొట్టండి అయితే, వారి ఎముకలు మాత్రం విరగ్గొట్టద్దు అంటూ మరో వివాదాస్పద సలహాను ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బ్రజ్, ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన గో సంరక్షక బృందం ఉన్నత ప్రతినిధులు ఆదివారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరంతా విశ్వహిందూపరిషత్ కు చెందిన వారే. ఈ సందర్భంగా గో సంరక్షక శాఖ కేంద్ర కమిటీ సభ్యుడు ఖేమ్‌చంద్ మాట్లాడుతూ 'గోవులను స్మగ్లింగ్ చేసేవారిని కొట్టండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టద్దు. విశ్వహిందూపరిషత్‌కు చెందినవారు, చెందని వారు ఈ విధంగా ముందుకు వెళితే ఏ ఒక్కరూ ఆవులను తరలించేందుకు సాహసం చేయలేరు. కనీసం అలాంటివారు ఎదురుపడలేరు. ఆవుల సంరక్షణ అంటే మేక్ ఇన్ ఇండియా కాదని.. దేశాన్ని రక్షించుకోవడం' అని చెప్పారు. 'ఈ మధ్య ప్రధాని మోదీ గో సంరక్షణపై చాలా మాట్లాడారు. ఆయన చెప్పిన చాలా అంశాలతో నేను అంగీకరించను. కానీ నేను ఒక విషయాన్ని అంగీకరిస్తా. ఏ ఒక్కరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఈ విషయం నేను తరుచుగా చెబుతూనే ఉన్నాను. అందుకే స్మగ్లర్లను తన్నండి.. కానీ వారి ఎముకలు విరగ్గొట్టొద్దు. ఎందుకంటే పోలీసులతో కేసులై సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇక మోదీ మాటలతో నేను విభేదించకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు భారత్‌ను బంగారు పక్షి అనేవారు. నాడు ఎలాంటి పరిశ్రమలు లేవు. మేక్ ఇన్ ఇండియా వల్ల ఆ రోజుల్లో భారత్ కు బంగారు పక్షి అని పేరు వచ్చిందా? మొత్తం భారత్‌ను ఆ రోజుల్లో కాపాడింది గోవులే. గో సంరక్షకులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో వారు వీరమరణం కూడా పొందుతున్నారు' అని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో గో సంరక్షణ పేరిట దళితులపై, ముస్లింలపై దాడులు ఎక్కువవుతున్నాయని కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రధానికి లీగల్ నోటీసులు ?
న్యూఢిల్లీ: గో సంరక్షకులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖలను గో సంరక్షణ, హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గో సంరక్షకుల్లో 80 శాతానికి పైగా సంఘ విద్రోహశక్తులున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎమ్) యోచిస్తోంది. ఏబీహెచ్‌ఎమ్ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌషిక్ మాట్లాడుతూ.. 2004 ఎన్నికల్లో వాజ్ పేయికి పట్టిన గతే ప్రధాని మోదీకి కూడా పడుతుందని అన్నారు. ప్రధానిమంత్రి పీఠానికి మోదీ సరితూగరని విమర్శించారు. ప్రధాని చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు లీగల్ టీంతో సంప్రదింపులు జరపుతున్నట్లు వివరించారు. గోవుల సంరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఏబీహెచ్‌ఎమ్ చీఫ్ స్వామి చక్రపాణి ఖండించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మైసూరుకు చెందిన గో సంరక్షకులు ప్రధానికి లేఖ రాశారు. కాగా గో సంరక్షకులపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమర్ధించింది. గో సంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని పేర్కొంది. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యనించింది. 'మై గవ్' టౌన్ హాల్ , మెదక్ జిల్లా గజ్వేల్ మీటింగ్ లలో ప్రధానమంత్రి గో సంరక్షకులపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. -
మునిగిపోయే నావను కాపాడుకునేందుకే..
న్యూఢిల్లీ: దళితులపై దాడుల నేపథ్యంలో గోరక్షకులపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. గుజరాత్లో మునిగిపోతున్న బీజేపీ నావను కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. 'ప్రధాని రాజకీయ కోణంలో మాట్లాడటం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయన (గుజరాత్లో) ఓ ముఖ్యమంత్రిని కోల్పోయారు. రాష్ట్రం కూడా చేజారబోయే పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు' అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడ్డకన్ పేర్కొన్నారు. దళిత ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు ప్రధాని గోరక్షకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని సీపీఎం ఆరోపించింది. దళితులపై దాడుల పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ, క్షేత్రస్థాయిలో సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం నేత బృంద కారత్ విమర్శించారు. -
ప్రధానికి లీగల్ నోటీసులు?
న్యూఢిల్లీ: గో సంరక్షకులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖలను గో సంరక్షణ, హిందూ సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గో సంరక్షకుల్లో 80 శాతానికి పైగా సంఘ విద్రోహశక్తులున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్‌ఎమ్) యోచిస్తోంది. ఏబీహెచ్‌ఎమ్ జాతీయ అధ్యక్షుడు చంద్రప్రకాష్ కౌషిక్ మాట్లాడుతూ.. 2004 ఎన్నికల్లో వాజ్ పేయికి పట్టిన గతే ప్రధాని మోదీకి కూడా పడుతుందని అన్నారు. ప్రధానిమంత్రి పీఠానికి మోదీ సరితూగరని విమర్శించారు. ప్రధాని చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై లీగల్ నోటీసులు పంపేందుకు లీగల్ టీంతో సంప్రదింపులు జరపుతున్నట్లు వివరించారు. గోవుల సంరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఏబీహెచ్‌ఎమ్ చీఫ్ స్వామి చక్రపాణి ఖండించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని మైసూరుకు చెందిన గో సంరక్షకులు ప్రధానికి లేఖ రాశారు. కాగా గో సంరక్షకులపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సమర్ధించింది. గో సంరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని పేర్కొంది. అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యనించింది. 'మై గవ్' టౌన్ హాల్ , మెదక్ జిల్లా గజ్వేల్ మీటింగ్ లలో ప్రధానమంత్రి గో సంరక్షకులపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.