మృతదేహాన్ని పట్టాల మధ్య ఇలా పడేశారని చూపుతున్న రైల్వే కార్మికుడు
జాడోలి కా బాస్(రాజస్థాన్): దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉమర్ మహ్మద్ హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవులను అక్రమ రవాణా చేస్తున్నాడనే ఆరోపణలతో భరత్‌పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఉమర్‌ను నవంబర్ 10న దుండగులు కిరాతకంగా కాల్చి చంపారు. అతడి మృతదేహాన్ని రామ్‌గఢ్, జాడోలి కా బాస్ మార్గంలో రైలు పట్టాలపై పడేశారు. రైల్వే ట్రాక్‌పై పడేయటానికి ముందు అతడి తల నరికేశారని వెల్లడైంది. అయితే రైలు అతడి పైనుంచి వెళ్లడంతో మొండం నుంచి తల వేరైందని అంతకుముందు భావించారు. ముందు శిరచ్ఛేదం చేసి తర్వాతే రైల్వే ట్రాక్‌పై పడేశారని మృతదేహాన్ని ముందుగా గుర్తించిన రైల్వే కీమన్ సోను కుమార్ తెలిపినట్టు ‘న్యూస్ 18’ వెల్లడించింది.
‘మృతదేహం రెండు పట్టాల మధ్య ఉంది. తల మాత్రం బయటుంది. కాళ్లు, చేతులపై గాయాలున్నాయి. ఎవరో తెచ్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారని కచ్చితంగా చెప్పగలను. రెండు పట్టాల మధ్య పడేసిన బాడీపైనుంచి రైలు వెళ్లితే తల ఎలా వేరవుతుంది? మృతదేహాన్ని పట్టాల మధ్య నిలువుగా పడేశారు, అడ్డంగా కాదు. కాబట్టి కచ్చితంగా శిరచ్ఛేదం చేసిన తర్వాతే ఇక్కడ పడేశార’ని కుమార్ పేర్కొన్నాడు. మధుర చెందిన ఆయన 1489/3-4 రైల్వే ట్రాక్ వద్ద కీమన్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
మరో రైల్వే కార్మికుడు జగదీశ్ ప్రసాద్ కూడా కుమార్ వాదనతో ఏకీభవించాడు. మృతదేహం పడివున్న విధానాన్ని బట్టి చూస్తే తలనరికేసి ఇక్కడకు తీసుకొచ్చినట్టు కనబడుతోందని అభిప్రాయపడ్డారు. బాడీని రైలు పట్టాలపై అడ్డంగా పడుకోబెడితేనే తల తెగే అవకాశముందన్నారు. ఒకవేళ మృతదేహం పైనుంచి రైలు వెళితే శరీర భాగాలు అక్కడక్కడా పడే అవకాశముందని పదేళ్లు గేట్‌మాన్‌గా పనిచేసి ఏడాదిగా కీమన్‌గా పనిచేస్తున్న జగదీశ్ వివరించారు. మృతుడి ఛాతిపై ఎటువంటి బుల్లెట్ గాయాలు తాను గుర్తించలేదని కుమార్ తెలిపారు. ఉదర భాగంలో రంధ్రం గుర్తించానని చెప్పారు.
పోస్టుమార్టం నివేదిక వస్తే ఈ అనుమానాలు నివృత్తి అవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు రామ్‌వీర్ గుజ్జర్, భగవాన్ సింగ్‌లను అళ్వార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 201, 302 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులు నేరాన్ని అంగీకరించారని అళ్వార్ ఏఎస్పీ తెలిపారు. ఉమర్ దేహాన్ని హంతకులు ఖండించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే రైల్వే కార్మికులు చెప్పిన దాంట్లో వాస్తమున్నట్టు కనబడుతోంది. అసలేం జరిగిందనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment