మునిగిపోయే నావను కాపాడుకునేందుకే..
న్యూఢిల్లీ: దళితులపై దాడుల నేపథ్యంలో గోరక్షకులపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. గుజరాత్‌లో మునిగిపోతున్న బీజేపీ నావను కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది.
'ప్రధాని రాజకీయ కోణంలో మాట్లాడటం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయన (గుజరాత్‌లో) ఓ ముఖ్యమంత్రిని కోల్పోయారు. రాష్ట్రం కూడా చేజారబోయే పరిస్థితి నెలకొని ఉంది. కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు' అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడ్డకన్ పేర్కొన్నారు. దళిత ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు ప్రధాని గోరక్షకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని సీపీఎం ఆరోపించింది. దళితులపై దాడుల పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ, క్షేత్రస్థాయిలో సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకోవడం లేదని సీపీఎం నేత బృంద కారత్ విమర్శించారు.