
జైపూర్: ‘రాష్ట్రంలో ప్రతి నగరంలో జరుగుతున్న దారుణాలను ఆపడం ప్రభుత్వం వల్ల కాదు. ఇలాంటి ఘటనలను నియత్రించేందుకు ప్రభుత్వం వద్ద సరిపడా మానవ వనరులు లేవు. నిందితుడు ఏ మతానికి చెందినవాడైనా వదిలిపెట్టం, ముస్లిం లేదా హిందువైనా చర్యలు తప్పవ’ని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా అన్నారు. భరత్‌పూర్ జిల్లాలో గోరక్షకులు ఒక వ్యక్తిని కాల్చి చంపిన ఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. మృతుడి వాహనంలో ఆరు గోవులను కనుగొన్నారని, ఇందులో మృతి చెందిన ఆవు కూడా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు.
బీజేపీ పాలిత రాజస్థాన్‌లో శాంత్రిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె.. భరత్‌పూర్ జిల్లాలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. హత్య చేసి తప్పించుకోవడం సులభమన్న భావన ప్రభుత్వ చేతగానితనం వల్ల వచ్చిందని ధ్వజమెత్తారు.
ఆవులను తీసుకెళ్తున్న ఉమర్ ఖాన్(35) అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. భరత్‌పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్ మృతదేహాన్ని రామ్‌గఢ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తించినట్టు డీఎస్పీ అనిల్ బెనివాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్టు ఆల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాశ్ చెప్పారు. ఉమర్ ఖాన్‌తో పాటు బుల్లెట్ గాయాలైన మరొ వ్యక్తిని హరియణా ఆస్పత్రిలో చేర్చారు.