Gulab Chand Kataria
-
మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
గువాహటి: గువాహటి(అస్సాం)–న్యూజల్పాయ్గురి(పశ్చిమబెంగాల్) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈ వందేభారత్ రైలుతో ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వారంతో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి దిశగా అద్భుతమైన ప్రయాణం సాగించిందన్నారు. 2014కు పూర్వం ఊహించని అనేక విజయాలను ప్రభుత్వం సాధించిందని తెలిపారు. గువాహటిలో ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, సీఎం హిమాంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. గువాహటి– న్యూజల్పాయ్గురి మధ్య రైలు ప్రయాణ సమయం ప్రస్తుతమున్న 6.30 గంటల నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో 5.30 గంటలకు తగ్గనుంది. -
హోం మంత్రి కటారియాకు ఈసారి కష్టాలే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ప్రతిష్టాకరమైన ఉధంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన హోం మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియాకి మొదటి సారి ఓటమి భయం పట్టుకుంది. అదీ సొంత పార్టీ నాయకుడే కాకుండా ఇంతకాలం తన సహచరుడిగా ఉన్న దల్పత్ సురాణా నుంచే. పైగా ఆయన కూడా కటారియాలాగా జైనుడే కావడం గమనార్హం. 74 ఏళ్లు వచ్చినప్పటికీ యువతరానికి అవకాశం ఇవ్వకుండా ఆరోసారి కూడా కటారియా రంగంలోకి దిగడంతో, తాను తిరుగుబాటు అభ్యర్థిగా జనతాసేన టిక్కెట్‌పై నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని సురాణా తెలిపారు. మొదటినుంచి ఆరెస్సెస్ అండ కలిగిన కటారియాకు బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. ‘నా లక్ష్యం ఒక్కటే కటారియాను ఓడించడం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు’ అని సురాణా వ్యాఖ్యానించారు. కటారియా తన తల బిరుసుతనంతో పార్టీలో ఎవరినీ ఎదగకుండా చేశారని ఆయన విమర్శించారు. తాను బరిలోకి దిగకపోతే కటారియాకు ప్రత్యర్థిగా నిలబడే దమ్ము ఎవరికీ లేదని, అందుకనే మొన్నటివరకు ఆయన అనుచరిడిగా కొనసాగిన తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పారు. నియోజకవర్గంలో దాదాపు 44 వేల మంది జైన ఓటర్లు ఉన్నారని, వారంతా ఇదివరకు కటారియాకే మద్దతిచ్చారని, ఇప్పుడు సురాణాకు ఇస్తున్నారని, ఆయనకు మద్దతిస్తున్న బ్రాహ్మణ నాయకుడు మంగేలాల్ జోషి తెలిపారు. ఆరెస్సెస్‌లోని యువత కూడా సురాణాకే మద్దతిస్తోంది. సురాణా ఎన్నికల్లో విజయం సాధించాక తిరిగి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆ యువత భావిస్తోంది. కటారియాపై తిరుగుబాటు అభ్యర్థి సురాణా ఒక్కరే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీ వీరాభిమాని, నమో విచార్ మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ రటాలియా కూడా పోటీ చేస్తున్నారు. కటారియాను రాజ్‌పుత్‌లు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘కటారియాను ఓడించే సత్తా ఎవరికి ఉంటే వారికే మేము ఓటు వేస్తాం’ అని ‘మేవర్ క్షత్రియా మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కష్ణావత్ తెలిపారు. ఇదివరకు తామంతా బీజేపీకే మద్దతు ఇస్తూ వచ్చామని, మేవర్‌లో 28 సీట్లుంటే బీజేపీ ఇద్దరు రాజ్‌పుత్‌లకు మాత్రమే సీట్లు ఇచ్చిందని, ఈ కారణంగా ఈ సారి తాము బీజేపీని ఓడించేందుకే కంకణం కట్టుకున్నామని ఆయన తెలిపారు. కటారియా మాత్రం అంతిమంగా విజయం తనదేనని చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక మాట్లాడండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలపై ప్రజలు కోపంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, ఆ అంశాలను ప్రజలు ఇప్పుడు మరచిపోయరని అన్నారు. మరి ఉద్యోగాల హామీ గురించి ప్రస్తావించగా, పకోడీల లాంటి థియరీ నాకోటి ఉందని, దాంతోని యువతను ఆకట్టుకున్నానని ఆయన చెప్పారు. కానీ ఆయన మొహంలో అంతకుముందున్న ధీమా కనిపించడం లేదు. -
‘అతడి దగ్గర చనిపోయిన ఆవు ఉంది’
జైపూర్: ‘రాష్ట్రంలో ప్రతి నగరంలో జరుగుతున్న దారుణాలను ఆపడం ప్రభుత్వం వల్ల కాదు. ఇలాంటి ఘటనలను నియత్రించేందుకు ప్రభుత్వం వద్ద సరిపడా మానవ వనరులు లేవు. నిందితుడు ఏ మతానికి చెందినవాడైనా వదిలిపెట్టం, ముస్లిం లేదా హిందువైనా చర్యలు తప్పవ’ని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా అన్నారు. భరత్పూర్ జిల్లాలో గోరక్షకులు ఒక వ్యక్తిని కాల్చి చంపిన ఘటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. మృతుడి వాహనంలో ఆరు గోవులను కనుగొన్నారని, ఇందులో మృతి చెందిన ఆవు కూడా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో శాంత్రిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. ముఖ్యమంత్రి వసుంధర రాజె.. భరత్పూర్ జిల్లాలో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. హత్య చేసి తప్పించుకోవడం సులభమన్న భావన ప్రభుత్వ చేతగానితనం వల్ల వచ్చిందని ధ్వజమెత్తారు. ఆవులను తీసుకెళ్తున్న ఉమర్ ఖాన్(35) అనే వ్యక్తిని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. భరత్పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్ మృతదేహాన్ని రామ్‌గఢ్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం గుర్తించినట్టు డీఎస్పీ అనిల్ బెనివాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్టు ఆల్వార్ ఎస్పీ రాహుల్ ప్రకాశ్ చెప్పారు. ఉమర్ ఖాన్‌తో పాటు బుల్లెట్ గాయాలైన మరొ వ్యక్తిని హరియణా ఆస్పత్రిలో చేర్చారు. -
సారీ చెప్పిన హోంమంత్రి
జైపూర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చాంద్ కటారియా క్షమాపణ చెప్పారు. పొరపాటుగా అలా మాట్లాడానని అన్నారు. చురాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మన్మోహన్ సింగ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. 'మన్మోహన్ సింగ్ అమెరికా వెళితే ఆయనకు విమానాశ్రయంలో సాధారణ మంత్రులు ఆహ్వానం పలికారు. నరేంద్ర మోదీ అమెరికా వెళితే అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం పలికారంటూ' అభ్యంతరకర భాష వాడారు. కటారియా వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆయన క్షమాపణ చెప్పారు. 'నేను వాడిన భాష తప్పే. మాట్లాడుతుండగా మధ్యలో అలా వచ్చేసింది. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నా. మన్మోహన్ సింగ్ ను అవమానించాలనే ఉద్దేశం నాకు లేద'ని కటారియా తెలిపారు. ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లట్ డిమాండ్ చేశారు.