ఉగ్రదాడి: బీజేపీకి శివసేన చీఫ్ సవాల్!
ముంబై: జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. తన మిత్రపక్షమైన బీజేపీకి చురకలింటిస్తూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు బీజేపీకి చేతనైతే గో రక్షకులను పంపించాలని సవాల్ విసిరారు. రాజకీయాంశాల్లో సంస్కృతి, క్రీడలను తీసుకురావద్దని బీజేపీ ఎప్పుడూ చెబుతోందని, కానీ మతం, రాజకీయం జతకలిసి ఉగ్రవాదం రూపంలో చెలరేగిపోతుందని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. సోమవారం రాత్రి అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులలో గుజరాత్ వాసులు ఐదుగురు కాగా, మరో ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వారు కావడంతో ఉద్ధవ్ ఈ విషయంపై కాస్త సీరియస్‌గా ఉన్నారు.
గణేష్ మండల్స్‌తో త్వరలో జరగనున్న పండగకు ఏర్పాట్లకోసం మంగళవారం ఉద్ధవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ప్రస్తుతం గో రక్షక్షులు అనే విషయం సమస్యాత్మకంగా మారింది. గోవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ సామాన్యులపై దాడులకు పాల్పడే గో రక్షకులు ఎంతో హాని తలపెడుతున్న ఉగ్రవాదులను ఎదుర్కోగలరా. మీరు ఎంతగానో మద్ధతిచ్చే గో సంరక్షకులను ఉగ్రవాదులపై యుద్ధం చేసేందుకు పంపిస్తే బీజేపీకి సమస్య తీవ్రత అర్థమవుతోంది. కశ్మీర్‌లో వేర్పాటువాదులతో బీజేపీ ఎలాగైనా చర్చించి అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని' చెప్పారు. కొన్ని ప్రత్యేక పండుగల నేపథ్యంలో శబ్ధాల తీవ్రతపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించగా, వాటిని కాస్త సవరిస్తూ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కోరారు.