20 లేదా 21న బీజేపీ అభ్యర్థి ప్రకటన!
► రాష్ట్రపతి ఎన్నికలో మా అభ్యర్థికి మద్దతివ్వండి
► ఉద్ధవ్ ఠాక్రేను కోరిన అమిత్ షా
న్యూఢిల్లీ/ముంబై: రాష్ట్రపతి ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు తీవ్రం చేసింది. ఈ నెల 20 లేదా 21న తమ అభ్యర్థిని ప్రకటించి, 23నాటికి నామినేషన్ వేసే అవకాశముందని పార్టీ నేత ఒకరు చెప్పారు. అభ్యర్థి పేరు ప్రతిపాదకులుగా, బలపరచేవారిగా కేంద్ర మంత్రులను, మిత్రపక్షాల సీనియర్ నేతలను బీజేపీ రంగంలోకి దించింది. 60 మంది ప్రతిపాదకులు, 60 మంది బలపరచేవారితో నాలుగు సెట్ల నామినేషన్లను సిద్ధం చేసింది. వీరు ఈ నెల 20కల్లా కసరత్తు పూర్తి చేసే అవకాశముంది.
తన ఎంపీలకు పోలింగ్ ప్రక్రియను వివరించడానికి బీజేపీ 19, 20న సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఈ నెల 24న విదేశీ పర్యటనకు వెళ్తుండడంతో 23 నాటికి అధికార పక్ష అభ్యర్థి నామినేషన్ వేసే అవకాశముంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతివ్వాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిత్రపక్షమైన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఆదివారం కోరారు. షా ముంబైలో ఉద్ధవ్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. మరోపక్క కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. సమాజ్‌వాదీ పార్టీ నేతలైన రాంగోపాల్ యాదవ్, నరేశ్ అగర్వాల్‌తో ఫోన్లో చర్చించారు. కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌ను కలసి తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు.
ఒంటరిగా ఆప్..
ఆప్ రాష్ట్రపతి ఎన్నికల సందడికి దూరంగా మిలిగిపోయింది. ఇంతవరకు ఎవరూ తమ మద్దతు కోరలేదని ఆప్ నేత ఒకరు చెప్పారు.
ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలట్ పేపర్లు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడానికి ఎన్నికల సంఘం ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలట్ పేపర్లను, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలట్ పేపర్లను అందించనుంది. వీరి ఓట్ల విలువల్లో తేడాలు ఉండడంతో సులభంగా లెక్కించేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీఏ, విపక్షాలు తమ అభ్యర్థులను నిలబెట్టడం, వారిలో ఎవరూ నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోవడం జరిగితే ఈసీ బ్యాలట్ పేపర్లను ముద్రించక తప్పదు. ఇప్పటివరకు 15 మంది నామినేషన్లు వేయగా ఏడుగురిని అనర్హులుగా ప్రకటించారు.
ఈసారి కూడా పోటీనే!
రాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నా ఈసారీ పోటీ జరిగే అవకాశముంది. ఇంతవరకు జరిగిన 14 రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవ రెడ్డిని ఎన్నుకున్న 7వ ఎన్నిక మినహా మిగతా ఎన్నికలన్నింటిలోనూ పోటీ జరిగింది. 1977లో సంజీవ రెడ్డిని పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అభ్యర్థులు తలపడిన మిగతా 13 ఎన్నికల్లో చాలా వాటిలో నామమాత్రపు పోటీనే నమోదైంది. 1969 నాటి 5వ ఎన్నికలో మాత్రం అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.
వీవీ గిరికి 4,01,515 ఓట్లు, సంజీవ రెడ్డికి 3,13,548 ఓట్లు వచ్చాయి. 87,967 ఓట్ల తేడాతో గిరి గెలిచారు. ఆయన సాధించిన మెజారిటీ రాష్ట్రపతి ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీ. 1967నాటి 4వ ఎన్నికలోనూ గట్టి పోటీ జరిగింది. విజేత డాక్టర్ జాకీర్ హుసేన్‌కు 4.71 లక్షల ఓట్లు, ఆయన ప్రత్యర్థి కోకా సుబ్బారావుకు 3.6 లక్షల ఓట్లు దక్కాయి. 1997లో కేఆర్ నారాయణన్.. టీఎన్ శేషన్‌ను ఓడించారు. 2002లో లక్ష్మీ సెహగల్‌పై అబ్దుల్ కలాం.., 2007లో భైరాన్‌సింగ్ షెకావత్‌పై ప్రతిభాపాటిల్.. , 2012లో పీఏ సంగ్మాపై ప్రణబ్ గెలుపొందారు.