రాష్ట్రపతి ఎన్నికలున్నాయి.. జాగ్రత్త: శివసేన
దేశానికి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోడానికి మరో నాలుగు నెలలే సమయం ఉంది. ఎన్డీయే పక్షానికి ఇంకా పూర్తిస్థాయిలో బలం లేదు. దాదాపుగా ఉందనుకుంటున్నా కూడా మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేన ఇప్పుడు కత్తులు నూరుతోంది. ప్రతిపక్షాలన్నింటితో ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరుపుతున్నారని, బీజేపీ అభ్యర్థిని అంత సులభంగా గెలవనిచ్చేది లేదని శివసేన వర్గాలు అంటున్నాయి. కొన్ని ఇతర పార్టీలు కూడా ఠాక్రేతో చర్చలు జరుపుతున్నాయని చెబుతున్నారు. మోహన్ భగవత్‌ను రాష్ట్రపతిని చేయాలంటూ ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ కొత్త వాదన లేవనెత్తిన విషయం తెలిసిందే.
భారతదేశం ఇప్పుడు హిందూత్వాన్ని ఆమోదిస్తోందని, అందువల్ల ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను రాష్ట్రపతి చేస్తే బాగానే ఉంటుందని అన్నారు. భగవత్ పేరు ప్రతిపాదిస్తే యావద్దేశం దమకు మదద్తుగా ఉంటుందని చెప్పారు. దేశంలో హిందూత్వం బలం పుంజుకుంటోందని చెప్పడానికి ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని రౌత్ అన్నారు. బీజేపీ అయినా, శివసేన అయినా.. తమ లక్ష్యం హిందూ సామ్రాజ్యమేనని చెప్పారు. లౌకిక వాదం అంటే హిందూమతం గురించి మాట్లాడకపోవడం కాదని, ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు కూడా బీజేపీకి ఓటేశారని గుర్తుచేశారు. శివసేన ఎలక్టొరల్ కాలేజిలో 30వేల ఓట్లు ఉన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఆయన చెప్పారు.