మళ్లీ పొత్తు దిశగా శివసేన - బీజేపీ?
మళ్లీ పొత్తు దిశగా శివసేన - బీజేపీ?
Published Fri, Feb 24 2017 5:48 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికార కూటమిగా ఉన్న శివసేన - బీజేపీ మళ్లీ కలవొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఆ దిశగా వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని ఆయన సూచించారు. శివసేనకు ఈ ఎన్నికల్లో 84 డివిజన్లు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 227 స్థానాలున్న బీఎంసీలో అధికారం చేపట్టాలంటే కనీసం 114 మంది మద్దతు అవసరం. అంటే మరో 30 మంది మద్దతు శివసేనకు కావాలి. మరోవైపు రెండో పెద్ద పార్టీగా వచ్చిన బీజేపీ.. సొంతంగా పోటీ చేసి 82 స్థానాలు గెలుచుకుంది. దాంతో ఇద్దరిలో ఎవరికీ మేయర్ పదవి నేరుగా దక్కే అవకాశం లేదు. ప్రస్తుతానికి తాను మేయర్ పదవి గురించి ఏమీ ఆలోచించలేదని, అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నామని ఉద్ధవ్ ఠాక్రే తన నివాసమైన మాతోశ్రీ వద్ద చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని అన్నారు గానీ.. ఎవరితో అనే విషయం చెప్పలేదు.
దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ - శివసేన కూటమి బీఎంసీని పాలిస్తోంది. ఈసారి తాము ఈ పొత్తు నుంచి విడిపోయి వేరుగా పోటీ చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పూర్తిస్థాయిలో బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోవడం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ శాశ్వత మిత్రులు గానీ ఉండరని చెప్పడంతో ఇప్పుడు మరోసారి ఇరు పార్టీల మధ్య పొత్తు పొడవచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన మొత్తం 10 మునిసిపాలిటీల ఎన్నికల్లో ఎనిమిది బీజేపీకే దక్కడంతో ఇప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
ఆసియాలోనే అత్యంత ధనవంతమైన పురపాలక సంస్థ అయిన బీఎంసీకి వార్షిక బడ్జెట్ దాదాపు రూ. 37వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు దీని పగ్గాలు ఎవరు చేపడతారన్న విషయమై మరో రెండు మూడు రోజులు ఆగితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ పరిస్థితి కూడా ఈసారి ఏమీ ఆషామాషీగా లేదు. 82 స్థానాలు గెలుచుకోవడంతో బలమైన పార్టీగా ఉన్న కమలం సైతం అధికారం చేపట్టేందుకు పూర్తి అవకాశాలున్నాయి. ఇంతకుముందు మాత్రం శివసేనకు బయటి నుంచి మద్దతు ఇచ్చింది. ఈసారి బీఎంసీ పగ్గాలను ఎవరు చేపడతారో చూడాలి మరి!!
Advertisement
Advertisement