'ఇంకా కలిసే ఉన్నాం.. అలాంటిదేం లేదు'
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఏదైనా బలమైన సంఘటన జరిగిన ప్రతిసారి చర్చలోకి వచ్చే అంశం అక్కడ ప్రభుత్వం మారుతుందా అని.. గతంలో మాదిరిగానే తాజాగా కూడా అదే అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ సరిగా పరిపాలనను నిర్వహించలేకపోతున్నారని, అందువల్లే అక్కడ అశాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని, నిత్యం అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ శ్రేణులతోపాటు ఇతర వర్గాలు పరోక్షంగా ఆమెను విమర్శిస్తున్నారు.
తాజాగా అమర్‌నాథ్ యాత్రికులపై అనంతనాగ్ జిల్లాలో దాడి నేపథ్యంలో ఆ విమర్షలు ఎక్కువకావడంతోపాటు మరోసారి ఇక బీజేపీ ముఫ్తీని దింపేసి సీఎం పగ్గాలు చేపడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అలా జరగకుంటే దాడి విషయంపై ఆ పార్టీల మధ్య విభేదాలు వస్తాయని వదంతలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఎలాంటి మార్పులు జరగబోవని ముప్తీనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, దాడికి పీడీపీని బాధ్యురాలిగా చేయలేమంటూ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఇప్పటికే బలంగా ఉందంటూ స్పష్టత నిచ్చారు. ఈ మేరకు బీజేపీ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ 'పీడీపీని తప్పుబట్టడానికి ప్రస్తుతం మాకు ఏ కారణమూ కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న తప్పులకు, దాడికి పీడీపీది బాధ్యత కాదు. మేం ఇప్పటికీ కలిసే ఉన్నాం' అని చెప్పారు.