ముంబై: ప్రతిపక్షాలను అధికారానికి దూరంగా ఉంచడం కోసమే తమ పార్టీ తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకుందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నట్టు ఇటీవల ఇరుపార్టీల నేతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా బీజేపీపై పలు ఆరోపణలు చేసిన శివసేన తిరిగి బీజేపీతో జత కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం శివసేన అనుబంధ సంస్థ స్థానీయ లోకాధికార్ సమితి(ఎస్‌ఎల్‌ఎస్) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్దవ్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను యూ టర్న్ తీసుకున్నానని.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో శివసేన కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. పార్టీపై వస్తున్న ఆ విమర్శలను పట్టించుకోవద్దు. నేను పార్టీ సైనికులు సహకారంతో శివసేనను నడుపుతున్నాను. అవసరమైతే నేను సీ టర్న్, జెడ్ టర్న్ కూడా తీసుకుంటాను. ఒంటరిగా పోటీ చేస్తే మన పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవడానికి సిద్దంగా లేదు. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకవేళ మనం ఒంటరిగా పోటీ చేస్తే విజయం సాధించినప్పటికీ.. హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం బీజేపీతో 25 ఏళ్ల నుంచి కలిసి ప్రయాణిస్తున్నాం. గత ఐదేళ్ల నుంచి ఇరు పార్టీల మధ్య సమస్యలు తలెత్తాయి. అయితే దేశ ప్రజలు కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. ఇప్పుడు బీజేపీకి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే.. చాలా అంశాలతో పాటు హిందుత్వం కూడా వెనుకబడిపోతుంద’ని తెలిపారు. కాగా, గత నెలలో ఎస్‌ఎల్‌ఎస్ సమావేశంలో ప్రసగించిన ఉద్దవ్.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.
ఇంకా ఈ కార్యక్రమంలో మంగళవారం భారత వైమానిక దళం అధికారులు జరిపిన మెరుపు దాడులకు ఉద్ధవ్ సెల్యూట్ చేశారు. సైనికుల త్యాగాలను రాజకీయం చేయకూడదన్నారు. పాక్ చెరలో చిక్కుకున్న ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment